సంగీత వంశీ
కళ
ఒక సంగీత దర్శకుడిగా ఎక్కువకాలం నిలబడాలంటే, సంగీతం మీద పిపాస, మంచి ట్యూన్స్ చేయాలనే ఆసక్తి, వృత్తి పట్ల నిబద్ధత, దీక్ష, కృషి, పట్టుదల ఇవన్నీ ఉండితీరాలి. వంశీకి ఇటువంటి బలమైన కోరికలు ఉంటే, ఉత్తమసంగీత దర్శకుడు అవడానికి అంతకన్నా ఇంకేం కావాలి.
మ్యూజిక్... వెస్ట్రన్... రాక్... పాప్... నేటి తరానికి ఇదొక ప్యాషన్... ఇంటర్నెట్‌లో మ్యూజిక్ నోట్స్ డౌన్‌లోడ్ చేసుకుంటూ... వాద్యపరికరాలను కూడా అందులోనే తీసుకుంటూ... స్వయంగా సంగీత దర్శకత్వం చేస్తున్నారు... పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే సంగీత ప్రపంచంలో... చిన్నదో పెద్దదో... తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకుంటున్నారు. లఘుచిత్రాలతో కెరీర్ ప్రారంభించి... చలనచిత్రాల స్థాయికి ఎదుగుతున్నారు...
‘ఓ సఖీ’ ఆల్బమ్ (టాప్ టెన్‌లో ఉంది) తో 2011లో సంగీత జీవితం ప్రారంభించి, చలనచిత్రాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేసే స్థాయికి ఎదిగాడు వంశీ. ‘‘నాకు చిన్నప్పటి నుంచి కీబోర్డ్ అంటే చాలా ఇష్టం. కీబోర్డులో సరిగమల అభ్యాసానికి నాన్నగారే శ్రీకారం చుట్టారు. నాకు చదువు మీద అంతగా శ్రద్ధ లేదు. అందువల్ల చదువు మానేసి హైదరాబాద్ వచ్చాను. హిందుస్థానీ, పాశ్చాత్యం... ఈ రెండు సంప్రదాయ సంగీతాలనూ నేర్చుకున్నాను. సంగీతంతో పాటు డిజిటల్ రికార్డింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ నేర్చుకున్నాను. సంగీతం మీద ఉన్న అభిరుచి కొద్దీ, కొద్దిమంది మిత్రులతో కలసి ‘వేవ్ బ్యాండ్’ అని ఒక మ్యూజికల్ బ్యాండ్ ఏర్పాటుచేశాను’’ అంటూ వంశీ తన సంగీత ప్రయాణాన్ని వివరించారు.
‘పెళ్లి పుస్తకం’ లోని పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది’’ అంటున్న వంశీ యూ ట్యూబ్‌లో ప్రముఖుల సంగీత కచ్చేరీలు చూసి పరిజ్ఞానం పెంచుకుంటున్నారు.
ఇప్పటి వరకు అనేక చలనచిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేశాడు. కొన్ని చిత్రాలకు అసిస్టెంట్‌గానూ చేశాడు. ఒక పక్కన సంగీతం నేర్చుకుంటూనే మరో పక్క అతి కష్టం మీద పదవ తరగతి పూర్తి చేశాడు.
‘స్వామిరారా’, ‘ఉయ్యాలా జంపాలా’ వంటి చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన సన్నీ దగ్గర అసిస్టెంట్ ఆడియో ఇంజనీర్‌గా కొన్ని నెలలు పనిచేశాక, తాను చేస్తున్న పని పట్ల అంత సంతృప్తి కలగలేదు. ‘‘కీ బోర్డు నేర్చుకోవాలనే కోరిక నానాటికీ పెరుగుతూ వచ్చింది. దాంతో ఉద్యోగం వదిలేసి, పూర్తి సమయాన్ని కీ బోర్డు నేర్చుకోవడం కోసం కేటాయించాను’’ అని చెబుతాడు వంశీ.
సినిమా సంగీతానికి ఎంతో అవసరమైన పాశ్చాత్య సంప్రదాయ సంగీతం తనకు తానుగా నేర్చుకున్నారు. పెద్దపెద్ద సంగీత దర్శకుల దగ్గర కీబోర్డు ప్లేయర్‌గా పనిచేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో... ఋషి, కెమిస్ట్రీ, సరదాగా అమ్మాయితో, రొమాన్స్, నువ్వలా నేనిలా, పట్టపగలు... చలనచిత్రాలకు నేపథ్య సంగీతం అందించారు.
‘‘పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే మంచి సంగీతం చేయాలి. నా వరకు నేను మెలొడీలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాను. సంగీతం, సాహిత్యం, ఆర్కెస్ట్రా... ఒకదాన్ని ఒకటి డామినేట్ చేయకుండా ఉండేలా చూస్తున్నాను. ఆర్కెస్ట్రా తగ్గించి, భావం అర్థమయ్యేలాగ చేస్తున్నాను’’ అని చెప్పే వంశీకి ఇళయరాజా అంటే చాలా ఇష్టం. పరోక్షంగా ఆయన ప్రభావం తన మీద ఉందనీ, త్వరలోనే తనకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేలాంటి పాటలు చేస్తానని అంటున్నారు. సంగీతం చేస్తున్నప్పుడు అందరితోనూ స్నేహంగా ఉంటూ తనకు కావలసిన విధంగా వాళ్ల దగ్గర నుంచి రాబట్టుకుంటున్నారు.
ఎంఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చిన జనగణమన, పెళ్లి పుస్తకం, ప్రేమపకోడీ, హూ ఆర్ దే? పొసెసివ్‌నెస్, మధురమే, చిట్టితల్లి... లఘుచిత్రాలకు సంగీతం చేశారు వంశీ. ‘‘పెళ్లిపుస్తకం’ పాటకు 2.5 లక్షల హిట్స్ వచ్చాయి. నాకు మంచి పేరు కూడా వచ్చింది’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు వంశీ.
- డా. వైజయంతి