అన్ని రకాల పాటలు చేయాలని... | Interview with Music Director Ajay arasada | Sakshi
Sakshi News home page

అన్ని రకాల పాటలు చేయాలని...

Published Sun, Nov 17 2013 11:07 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

అన్ని రకాల పాటలు చేయాలని... - Sakshi

అన్ని రకాల పాటలు చేయాలని...

- అజయ్, యువ సంగీత దర్శకుడు

లఘుచిత్రాల ప్రభంజనం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గీతరచయితలు, సంగీత దర్శకులు, లఘుచిత్ర దర్శకులు, హీరోహీరోయిన్‌లుగా... యువతీయువకులు అన్ని కళలలోనూ వారి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఈ కోవకు చెందిన యువకుడు అజయ్ అరసాడ. ఒకవైపు లఘుచిత్రాలకు సంగీతం అందిస్తూనే, మరోవైపు సినిమాలకూ సంగీతం సమకూరుస్తున్న హైదరాబాద్‌కు చెందిన అజయ్‌తో ఇంటర్వ్యూ...
 
 మీ గురించి...
 వైజాగ్ గీతమ్స్‌లో బిటెక్ (ఐటీ) చేసి, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాన్నగారు నా చిన్నతనంలోనే పోయారు. అమ్మ వైజాగ్, ఐటిఐ కాలేజీలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్నారు.
 
 సంగీతం మీద  ఆసక్తి ఎలా మొదలైంది?
 మా అక్కయ్య, మేనత్తలు వీణ వాయిస్తారు. మా తాతగారు హార్మోనియం వాయించేవారు. అలా నాకు తెలియకుండానే సంగీతం అంటే ఆసక్తి పెరిగింది.
 
 శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా?

  ఎవరిదగ్గరా నేర్చుకోలేదు. కొన్నిరోజులు గిటార్ మీద వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్నాను. కొన్ని బ్యాండ్స్‌లో వాయించేవాడిని.
 
 సంగీతం నేర్చుకోకుండా పాటలకు ట్యూన్స్ చేయడం సాధ్యమేనా?
 నాకు చిన్నప్పటి నుంచి కొంత స్వరజ్ఞానం ఉండటం వల్ల మ్యూజిక్ చేయగలుగుతున్నాను. అలాగే గిటార్ నేర్చుకోవడం కొంత ఉపయోగపడింది.
 
 లఘుచిత్రాలకు మీ సంగీతం గురించి చెప్పండి...
 ఈ విషయంలో నాకు ఫేస్‌బుక్ బాగా ఉపయోగపడింది. షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్లు చాలామంది నన్ను ఆ విధంగానే కాంటాక్ట్ చేసి, వాళ్ల చిత్రాలకు నా చేత ట్యూన్ చేయించుకోవడం ప్రారంభించారు. ముందర ట్యూన్ ఇచ్చేయమంటారు. ఆ తరవాత వాళ్లు పాట రాసి ఇస్తుంటారు. ఇప్పటివరకు సుమారు పదిహేను లఘుచిత్రాలకు చేశాను. నాని అనే షార్ట్‌ఫిల్మ్ డెరైక్టర్ వల్ల నేను చాలామందికి పరిచయం అయ్యాను.
 
 మీరు చేసిన మొట్టమొదటి పాట, ఆ పాటకి లభించిన స్పందన...
 బాలభాస్కర్ రచించిన ‘నువ్వు పాడింది’ పాట నేను చేసిన మొట్టమొదటి గీతం. ‘లక్కీ’ షార్ట్‌ఫిల్మ్‌కి  చేసిన ‘కిన్నెరసాని’ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పాట మెలడీలో చేశాను. ‘పవన్ కల్యాణ్ ప్రేమలో పడ్డాడు’ లఘుచిత్రానికి కూడా చేశాను.
 
 పాటలకు బాణీలు ఎలా కట్టుకుంటారు? ఎక్కువగా ఎటువంటి పాటలు చేస్తుంటారు?
 ముందుగా నా పాటలు గిటార్ మీద ట్యూన్ చేసుకుంటాను. ఆ తరవాత మిడీ కీ బోర్డ్, ప్లగిన్స్ జాయిన్ చేసి మొత్తం ట్యూన్ చేస్తుంటాను. ‘పవన్ కల్యాణ్ ప్రేమలో పడ్డాడు’ అనే లఘుచిత్రానికి ఒక మాస్ సాంగ్ చేశాను. అందులో కూడా సితార్ వంటి సంప్రదాయ సంగీతవాద్యాలు ఉపయోగించాను. నాకు ఎక్కువగా మెలడీ అంటే ఇష్టం.
 
 మీకు ఏయే సంగీత దర్శకులంటే ఇష్టం..?
 నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అబ్జర్వేషన్ ఎక్కువ. దేవిశ్రీ పాటలు బాగా వినేవాడిని. ఆయన చిన్నవాడుగా అంటే 18 సంవత్సరాలకే సంగీత ప్రపంచంలోకి ప్రవేశించి, యూత్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ట్యూన్స్ చాలా క్యాచీగా ఉంటాయి. దేవిశ్రీ చేసిన పాటలను విన్న ప్రతిపదిమందిలో ఏడుగురికి తప్పనిసరిగా ఆపాటలు నచ్చుతాయి.  ఆయన టాలెంట్ నన్ను బాగా ప్రభావితం చేసింది. దేవిశ్రీ మొదట్లో చేసిన 30 ఆల్బమ్స్ విని నేను సంగీత దర్శకుడిని అయ్యాను. ఇళయరాజా, ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అంటే కూడా చాలా ఇష్టం.
 
 మీ లక్ష్యం...
  సస్పెన్స్, లవ్, కామెడీ... ఇలా  ఎన్నో చిత్రాల కు పాటలు చేశాను. నా దృష్టి అంతా రకరకాల పాటలు చేయడం మీదే ఉంది. మంచి సంగీత దర్శకుడిగా నిలబడాలన్నదే నా లక్ష్యం.
 
 - డా. వైజయంతి
 
 నాకు సంగీతం అంటే చిన్నప్పటి నుంచి ప్రాణం. నా చిన్నప్పుడు అంటే పదవ తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి అనారోగ్యం కలిగింది. మా వాళ్లు నన్ను ‘‘నీకేం కావాలి?’’ అని అడిగితే నేను ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలోని పాట కావాలని అడిగాను. నా మాటలకు అందరూ నవ్వుకున్నారు. ఆ తరవాత తెలిసింది... ఆ పాటకు సంగీతం చేసింది దేవిశ్రీప్రసాద్ అని. ఆ పాటకు ట్యూన్ చేసింది ఎవరో తెలియకుండానే నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడిని అయ్యాను.
 - అజయ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement