డ్రైవింగ్ మజావా..
సాక్షి, సిటీబ్యూరో :ఏదైనా చూస్తే ఫ్లాట్ అయిపోయాం అంటాం. అయితే ఆ ఫ్లాట్‌ను చూస్తే ఫ్లాట్ అయిపోతాం. అంటే అదేదో ఎక్కడా చూడని లగ్జరీ ఇంటీరియర్స్తోనో మరొకటో అని కాదు. చూడగానే ఒక బైక్ షోరూమ్‌లా అనిపిస్తుంది. ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో బైక్స్ వరుసగా పార్క్ చేసి ఉండడమే విశేషం అంటే.. అవి అన్నీ ఒకే బ్రాండ్ బైక్స్ కావడం మరో విశేషం.
సిటీలో బైకర్స్ చాలా మందే ఉన్నారు. కొండాపూర్‌లో నివసించే వ్యాపారి సుజాత్ అలీఖాన్ తమ 3వ అంతస్థులోని ఫ్లాట్‌లో కనీసం 10కి మించిన జావా/ఎజ్డీ బైక్స్ ఉండటం విశేషం. వీటిని వరుసగా పేర్చేశారు. ‘1987లో కాలేజ్‌కి జావా బైక్ కొని దాని మీదే వెళ్లేవాడ్ని. అలా అలా ఆ తర్వాత జావా/ఎజ్డీ బైక్‌కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ప్రస్తుతం నాకు వ్యక్తిగతంగా 10 మా కుటుంబ సభ్యులకు 15 వరకూ బైక్స్ అవే ఉన్నాయి’ అంటూ చెప్పారు సుజాత్ అలీ ఖాన్. ఇంకా ఆయన తన అభిరుచి గురించి ఇలా పంచుకున్నారు.
సౌండ్.. స్పెషల్..
జావా/ఎజ్డీలు 2 స్ట్రోక్ బైక్. రెండు సైలెన్సర్స్ ఉంటాయి. దాని సౌండ్ వల్లే జావాకి ఆ పేరొచ్చింది. మోటార్ సైకిల్ ర్యాలీల్లో(పోటీల్లో) దీన్ని బాగా వాడేవారు. జీవితాంతం ఒకటే బైక్‌కి నేను కట్టుబడి ఉన్నాను. నా దగ్గర ఉన్నవాటిల్లో 1961 జావా ఖరీదైనది. దాని ట్యాంక్ మీద బ్యాటరీ ఛార్జింగ్ చేసే యాంపియర్ మీటర్ ఉంటుంది. దాని తర్వాత వచ్చే వాటిలో అది లేదు. నా జీవితంలో ఎన్నో వేల కిలో మీటర్లు జావా మీద ప్రయాణించాను. కానీ తనివి తీరదు. అదేమిటో... 3 బెడ్రూమ్ల మా ఇంట్లో 2 బెడ్ రూమ్స్ పూర్తిగా బైక్స్‌కే కేటాయించాను. నెలవారి నిర్వహణ కూడా ఖరీదే. మా బైక్స్ కోసం ఒక ప్రత్యేకమైన మెకానిక్ కూడా ఉన్నాడు.