'అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దు'
అమెరికాకు అఫ్ఘాన్ అధ్యక్షుడు కర్జాయ్ స్పష్టీకరణ
కాందహర్: తమ దేశంలో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా, దాని మిత్రపక్షాలు జోక్యం కలుగజేసుకోవద్దని ఆఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 5న ఆఫ్ఘానిస్థాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దైపాక్షిక రక్షణ ఒప్పందానికి సంబంధించి అమెరికా-ఆఫ్ఘానిస్థాన్ మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో కర్జాయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శనివారం ఆఫ్ఘాన్‌లో మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కాందహర్లో ప్రారంభించారు. భారత ఆర్థిక సాయంతో నిర్మించిన ఈ వర్సిటీని భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌తో కలసి కర్జాయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్జాయ్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎన్నికలు నిస్పక్షపాతంగా.. పారదర్శకంగా నిర్వహిస్తుందని, అమెరికా, దాని మిత్ర పక్షాలు ఈ ఎన్నికల్లో జోక్యం చేసుకోరాదని, ఆఫ్ఘాన్ ప్రజలు స్వచ్చంధంగా ఓటు హక్కు వినియోగించుకునేలా సహకరించాలని కోరారు. 2014 తర్వాత పరిమిత స్థాయిలో నాటో దళాలు ఆఫ్ఘానిస్థాన్‌లో ఉండేందుకు తమకు అభ్యంతరం లేదని, అయితే అవి ఆఫ్ఘాన్‌కు మద్దతుగా ఉండాలనేదే తమ అభిమతమని చెప్పారు. ఆఫ్ఘాన్‌లో శాంతి కొనసాగాలంటే అమెరికా, పాకిస్థాన్‌ల సహకారం తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు.