Bill English
-
ట్రంప్ గౌరవంగా మాట్లాడారు
వెల్లింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు నోటి దురుసు ఎక్కువన్న సంగతి ప్రపంచమంతా తెలుసు. తన నిర్ణయాలను వ్యతిరేకిస్తే జడ్జి అయినా సరే అస్ట్రేలియా ప్రధాని అయినా సరే వదలిపెట్టరు. ఏడు దేశాల నుంచి ముస్లిం రాకపై నిషేధాన్ని వ్యతిరేకించిన జడ్జి, శరణార్థుల విషయంలో తన మాట వినని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్బుల్లపై ట్రంప్ నోరు పారేసుకున్నారు. శరణార్థులపై నిషేధం విషయంలో విమర్శలను, వ్యతిరేకతను ఏమాత్రం పట్టించుకోలేదు. కాగా ట్రంప్ ఇదే విషయంపై .. ఆస్ట్రేలియా పక్కన ఉన్న న్యూజిలాండ్ దేశ ప్రధాని బిల్ ఇంగ్లీష్‌తో మాత్రం గౌరవంగా మాట్లాడారట. సోమవారం బిల్ ఇంగ్లీష్‌కు ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. శరణార్థులపై నిషేధం సహా పలు విషయాలకు సంబంధించి ఇద్దరూ 15 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య చర్చలు గౌరవప్రదంగా, సామరస్యపూర్వకంగా జరిగాయని న్యూజిలాండ్ ప్రధాని చెప్పారు. శరణార్థులపై నిషేధం విధించాలన్న ట్రంప్ నిర్ణయంతో తాను ఏకీభవించలేదని చెప్పారు. ఇరు దేశాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగుతాయని అన్నారు. చైనా, ఉత్తర కొరియా దేశాల విషయంలో కూడా ఇద్దరూ చర్చించామని న్యూజిలాండ్ ప్రధాని తెలిపారు. ఈ చర్చల విషయంపై వైట్ హౌస్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ భద్రత, శాంతికి న్యూజిలాండ్ కృషిచేస్తోందని, ఆ దేశానికి ధన్యవాదాలు అంటూ పేర్కొంది. -
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా బిల్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ కొత్త ప్రధాన మంత్రిగా బిల్ ఇంగ్లిష్(54) ప్రమాణం చేశారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న జాన్ కీ గతవారమే రాజీనామా చేయడం తెలిసిందే. సోమవారం జరిగిన సమావేశంలో నేషనల్ పార్టీ సభ్యులు ఇంగ్లిష్‌ను ఏకగ్రీవంగా ప్రధానిగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఇంగ్లిష్ వెల్లింగ్టన్లోని ‘గవర్నమెంట్ హౌస్’కు చేరుకుని ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఒకప్పుడు వ్యవసాయం చేసిన ఇంగ్లిష్ 1990 నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉంటున్నారు. -
ఇద్దరు కొత్త ప్రధానుల నియామకం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా బిల్ ఇంగ్లీష్ నియమితులయ్యారు. ఆ దేశ అధికార నేషనల్ పార్టీ ప్రధాని పదవికి ఆయన పేరును ఖరారు చేసింది. ఇక ఇటలీ ప్రధానిగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి పాలో గెంటిలోనిని నియమించారు. ఆ దేశాధ్యక్షుడు సెర్గియో మాటరెల్లా అన్ని పార్టీల నాయకులను సంప్రదించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. గత సోమవారం న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ, ఇటలీ ప్రధాని మట్టెయో రెంజీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి స్థానాల్లో కొత్త నేతలను ఎన్నుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ స్వచ్ఛందంగా రాజీనామా చేయగా.. ఇటలీ ప్రధాని రెంజీ మాత్రం రెఫరెండంలో వ్యతిరేకంగా తీర్పు రావడంతో వైదొలిగారు. ఇటలీలో రాజ్యాంగ సవరణ కోసం నిర్వహించిన రెఫరెండంలో (ప్రజాభిప్రాయ సేకరణ) ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేశారు.