Bill Melinda Gates
-
వ్యాక్సినేషన్‌కు గూగుల్ సాయం
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ సెంటర్ల సమాచారం ఇకపై గూగుల్‌లో కూడా లభ్యం కానుంది. ఈ మేరకు గూగుల్ సంస్థ శుక్రవారం ఓ ప్రకటన చేసింది. గూగుల్ సెర్చ్, మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్ వంటి టెక్నాలజీ యాప్స్ ద్వారా వ్యాక్సినేషన్ సెంటర్ల సమాచారాన్ని యూజర్లకు అందించనున్నారు. దీనికోసం కేంద్ర ఆరోగ్యశాఖ, బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్లతో కలసి పనిచేసినట్లు గూగుల్ చెప్పింది. అంతేగాక వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు, ఫేక్ న్యూస్‌ను అడ్డుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ బృందాల ద్వారా ప్రజలు ప్రభుత్వం అందించిన అధికారపూర్వకమైన సమాచారాన్ని పొందుతున్నట్లు తెలిపింది. ఇంగ్లిష్తో పాటు తెలుగు, తమిళం, హిందీ వంటి స్థానిక భాషల్లో కూడా సమాచారాన్ని అందుబాటులో తీసుకువచ్చినట్లు చెప్పింది. గూగుల్ ట్రెండ్స్‌లో సైతం వ్యాక్సినేషన్ సమాచారాన్ని అప్డేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. -
మహిళలకు బిల్‌గేట్స్ వెయ్యి కోట్లు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిల్‌గేట్స్ భారీ విరాళం ప్రకటించారు. మహిళ ఆర్థిక సాధికారిత సాధించడమే లక్ష్యంగా నాలుగు దేశాలకు 170 మిలియన్ డాలర్ల(అంటే వెయ్యికిపైగా కోట్ల) ప్రాజెక్ట్‌ను బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. ఈ నాలుగు దేశాల్లో భారత్ కూడా ఉండటం విశేషం. మంగళవారం బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ ప్రకటన చేసింది. ఇండియా, కెన్యా, తంజానియా, ఉగండా దేశాల్లో లింగ సమానత్వం పెరగడం, డిజిటల్ ఆర్ధిక సమ్మేళనం విస్తరించడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం, వ్యవసాయ రంగానికి, మహిళల మద్దతు సమూహాలకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలను ప్రధాన అంశాలుగా తీసుకుని ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు. ఒక మహిళ తన జీవితాన్ని తనకు తానుగా మరింత మంచిగా రూపొందించుకోవాలని బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్ మెలిండా గేట్స్ అన్నారు. మహిళల చేతుల్లో మనీ ఉంటే, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అనే అంశంపై అవగాహం కలిగి ఉంటారని, దీంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. పురుషుల కంటే మహిళలు తక్కువ అని అనాదిగా వస్తున్న నిబంధనలను వారు మారుస్తారని చెప్పారు. నగదు లేదా మొబైల్ మనీ వంటి ఆర్థిక వనరుల విషయంలో మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తే, ఆ నిర్ణయాలు ఆమెపై, తన కుటుంబ సభ్యులపై మంచి ప్రభావాన్ని చూపుతాయని, దీని ద్వారా మహిళలు సాధికారిత సాధిస్తారని ఫౌండేషన్ చెప్పింది. ఈ పెట్టుబడులు మహిళలు పూర్తిస్థాయిలో ఆర్థికవ్యవస్థలో పాలుపంచుకునే విధంగా సాయం చేయడం మాత్రమే కాకుండా.. ఎన్నో ఏళ్లుగా మహిళలు వెనుకబడి ఉన్న వాటిల్లో అడ్డంకులు తొలగించేలా చేయొచ్చని బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ జెండర్ క్వాలిటీ డైరెక్టర్ సరహ హెన్డ్రిక్స్ అన్నారు. -
విరబూసిన వాణిజ్య పద్మాలు
* అగాఖాన్కు పద్మ విభూషణ్ * బిల్-మిలిందా గేట్స్‌లకు పద్మభూషణ్ * పాయ్, నందరాజన్లకు పద్మశ్రీ న్యూఢిల్లీ: వాణిజ్యం, పరిశ్రమల కేటగిరి కింద ముగ్గురు వ్యక్తులకు పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, ఆయన సతీమణి మిలిందా గేట్స్‌లకు సామాజిక సేవ విభాగంలో పద్మ భూషణ్ అవార్డులు లభించాయి. ఇక వాణిజ్యం, పరిశ్రమల కేటగిరిలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌ల్లో నివసించే కరీమ్ ఆల్ హుస్సేని అగాఖాన్‌ను పద్మ విభూషణ్ అవార్డు లభించింది. ఇది దేశంలో రెండో అత్యున్నత అవార్డు. ఇన్ఫోసిస్ మాజీ బోర్డ్ సభ్యుడు టి. వి. మోహన్‌దాస్ పాయ్‌కు, ఇండో అమెరికన్ ఆర్థిక వేత్త నంద్రాజన్ రాజ్ చెట్టిలకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. బిల్‌గేట్స్, మిలిందాగేట్స్ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం ఆయన సంపద 8,200 కోట్ల డాలర్లపైనే. 1995 నుంచి 2014 వరకూ 2-3 ఏళ్లు మినహా ప్రతీ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. తన భార్యతో కలిసి 2000లో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. పేదరికం, ఆరోగ్యం, విద్య రంగాల్లో ఈ ఫౌండేషన్ దాతృత్వ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అగాఖాన్ షియా ఇస్లామ్‌కు సంబంధించిన నిజారి ఇస్లామిజమ్కు 49వ ఇమామ్‌గా వ్యహరిస్తున్న ఈయన ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌ల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. హోటళ్ల వ్యాపారం ప్రధానమైనది. ఎన్నో రేసుగుర్రాలకు అధిపతి. ఫోర్బ్స్ పత్రిక ప్రకారం ఆయన సంపద 80 కోట్ల డాలర్లు. ఆఫ్రికా, ఆసియా, పశ్చిమాసియాల్లో ధార్మిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. నందరాజన్ రాజ్ చెట్టి న్యూఢిల్లీలో 1979లో జన్మించిన చెట్టి.. హార్వర్డ్‌లో 2003లో పీహెచ్డీ చేశారు. అత్యంత పిన్నవయస్సు(29 సంవత్సరాలు)లోనే హార్వర్డ్ ఎకనామిక్స్‌లో బోధన చేపట్టి రికార్డ్ సృష్టించారు. ప్రస్తుతం జర్నల్ ఆప్ పబ్లిక్ ఎకనామిక్స్‌కు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. టి. వి.మోహన్‌దాస్ పాయ్ 1994లో దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో చేరిన పాయ్.. సీఎఫ్ఓ స్థాయికి ఎదిగారు. ఫైనాన్స్ ఏషియా నుంచి ఉత్తమ సీఎఫ్ఓ అవార్డును పొందారు. కామర్స్, న్యాయశాస్త్రాల్లో పట్టభద్రుడైన ఆయన వృత్తిరీత్యా చార్టెర్ట్ అకౌంటెంట్. విద్య, పరిశోధన, మానవ వనరుల్లో మరింతగా కృషి చేయడానికి 2006లో ఇన్ఫీ నుంచి వైదొలిగారు. ప్రస్తుతం అక్షర ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్నారు.