బాబుగారి సొమ్మన్నట్టు..
రాష్ట్ర క్రీడారంగాన్నే బినామీకి రాసిచ్చేసిన బాబు
నాలుగు రోజుల కంపెనీకి గచ్చిబౌలిలో 400 ఎకరాలు
శంషాబాద్‌లో మరో 450 ఎకరాల భూమి
ఎకరా రూ. 50 వేలకే; వాస్తవ విలువ ఎకరా 4 కోట్లపైనే
కేబినెట్ అనుమతి లేకుండా ఆపద్ధర్మ హోదాలోనే కేటాయింపు
రిజిస్ట్రేషన్ ఖర్చులు చెల్లించక్కర్లేదంటూ చంద్రబాబు వరం
‘ఐఎంజీ భారత’ మూలధనం కేవలం రూ. 5 లక్షలు
ఐఎంజీ ఫ్లోరిడాకు అనుబంధమని చెప్పినా.. అంతా బోగస్
ఐఎంజీబీలో 99.9% వాటా బిల్లీరావుకి, 0.1% ఆయన సోదరుడికి
దీనికి భూములతోపాటు 8 స్టేడియాలు కూడా అప్పగింత
45 ఏళ్ల పాటు హక్కులన్నీ బిల్లీ బోగస్ కంపెనీకే
ఈ మధ్యలో కావాలంటే నిర్మాణ ధరకే కొనేసుకోవచ్చన్న బాబు
స్టేడియాలకు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు మూడేళ్లు ఉచిత విద్యుత్, నీళ్లు
ఇంకా కొన్ని వేల కోట్ల విలువైన వరాలిచ్చేసిన బాబు
బిల్లీ బ్రదర్స్ ఇద్దరూ చంద్రబాబుకు కుప్పం నుంచే బినామీలు
బాబుకు వంతపాడుతూ ఐఎంజీబీని ఆకాశానికెత్తిన ‘ఈనాడు’
ఇంత భారీ కుంభకోణంపై ఒక్కరోజూ పెన్నెత్తని రామోజీరావు
‘‘ఒక్క ఐఎంజీ కేసు చాలు. చంద్రబాబును చంచల్‌గూడ జైల్లో కూర్చోబెట్టడానికి’’ అని అన్నారు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదెంత దగుల్బాజీ వ్యవహారమో. ఇదెంత దోపిడీనో. నిజం చెప్పాలంటే ఇది.. దేశం దాటేసిన దోపిడీ. అంతర్జాతీయ సంస్థల పేరు వాడుకుని, బాబు తన బినామీల ద్వారా మొత్తం రాష్ట్ర క్రీడా రంగాన్ని, వేలకోట్ల రూపాయల విలువైన భూముల్ని ఒక్క దెబ్బతో కాజేయడానికి పన్నిన కుట్ర. ‘ఈనాడు’ అధిపతి రామోజీకి ఏనాడూ కనిపించని, కనీసం రాయాలనిపించని మహాదోపిడీ.
ఈ దొంగల నాటకాన్ని మీరే చూడండి....
‘‘అటు వెళితే అడవి. క్రూరమృగాలు పీక్కుతింటాయి. ఇటు వస్తే హాయిగా హైవే ఎక్కొచ్చు’’ అంటూ చిన్నపిల్లలకు పిట్టకథ చెప్పినట్టుగా చెప్పారు చంద్రబాబునాయడు. దాన్ని ఎంచక్కా పొల్లుపోకుండా సీమాంధ్రలో పతాక శీర్షికలోను, తెలంగాణలో కాస్త దిగువగాను అచ్చేసేశారు రామోజీరావు. అంతేకాదు!! రోజుకో శీర్షికపెట్టి, తెలుగుదేశం గెలిచిపోతోందంటూ గాలికొట్టి, తానే మధ్యవర్తిగా ఉండి పొత్తులు కట్టి... ఇలా బాబు కోసం నానా యాతనా పడుతున్నారాయన. ఎన్ని చేస్తున్నా జనం బాబును నమ్మటం లేదన్న సంగతి రామోజీకి బాగా తెలుసు. అందుకే... జగన్మోహన్రెడ్డి కేసుకు సంబంధించి ఇప్పటికే వేసేసిన చార్జిషీట్లను, ఇప్పటికే రాసేసిన రోత కథనాలను మళ్లీ వరుసగా అచ్చేస్తామంటూ మంగళవారం పత్రికాముఖంగా ప్రతిజ్ఞ కూడా చేసేశారు. మొత్తమ్మీద బాబుకు గాలికొట్టి, తనను కూడా బలమైన నేతగా చూపించడానికి తన శక్తికి మించి ప్రయత్నిస్తున్నారు రామోజీరావు.
మరి జగన్మోహన్రెడ్డిపై పేజీలకు పేజీలు కథనాలు వండేస్తున్న రామోజీరావు... చంద్రబాబు హయాంలో పెన్ను మూసుకున్నారేం? అప్పట్లో జరిగిన ప్రతి దోపిడీని, ప్రతి కుంభకోణాన్ని కూడా ప్రజలకు మహా మంచి జరుగుతున్నట్లుగా చూపించడానికి తాపత్రయపడ్డారెందుకు? ఐఎంజీ, ఏలేరు, మద్యం, పీపీఏలు, ప్రభుత్వ సంస్థల అమ్మకం, సహకార రంగాన్ని బొంద పెట్టడం.. ఇలా దేన్ని తీసుకున్నా అదంతా రాష్ట్రం మంచికోసమేనన్న కలరెందుకు ఇచ్చారు? తెలియటం లేదా రామోజీ పాత్రికేయ నీతి? 1995-2004 మధ్య ‘ఈనాడు’ తప్ప చెప్పుకోదగ్గ పత్రికన్నది ఉందా? మరి ఆ ‘ఈనాడే’ కన్ను మూసుకుని, పెన్ను మూసుకుని కూర్చుంటే ప్రజలకు దిక్కెవరు? 2008లో ‘సాక్షి’ ఆవిర్భవించాకే కదా.. బాబు చీకటి బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి! మరి ఇప్పటికీ ‘ఈనాడు’ వీటిని పట్టించుకోకుండా రాసిందే రాస్తుంటే ఏమనుకోవాలి? జగన్‌ను దెబ్బతీయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదన్న నైరాశ్యం రామోజీలో కనిపించటం లేదా?
2004 ఫిబ్రవరి 12
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ సంరంభం.
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ‘ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్’ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. అంతేకాదు!
‘‘ఐఎంజీ వచ్చేసింది. 2010 కామన్వెల్త్ గేమ్స్‌కు, 2020 ఒలింపిక్స్‌కు ఇక్కడి నుంచే క్రీడాకారులు తయారవుతారు. ఆసియా అంతటి నుంచీ క్రీడాకారులు ఇక్కడికే వస్తారు’’ అంటూ చంద్రబాబు ఉద్ఘాటించారు. దానికి తన ఊహల్ని జోడించి రంగుల లోకాన్ని చూపించే బాధ్యతను ‘ఈనాడు’ పొల్లుపోకుండా నెరవేర్చింది.
700 కోట్ల పెట్టుబడి.. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా కాంప్లెక్స్... ఒలింపిక్స్ క్రీడాకారుల్ని తయారు చేసే సిబ్బంది.. అంటూ ఊదరగొట్టేసింది.
పాపం జనం! వాళ్లకు అప్పట్లో ‘ఈనాడు’ రాసింది నిజమని నమ్మటం మినహా ప్రత్యామ్నాయం ఏముంది? అందుకే నమ్మారు! నిజమేననుకుని ఆనందపడ్డారు.
కానీ వాళ్లకేం తెలుసు... ఇదో అంతర్జాతీయ కుంభకోణమని. వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని, అప్పటికే నిర్మించిన అద్భుతమైన స్టేడియాల్ని, వందల కోట్ల విలువైన రాయితీల్ని కాజేయడానికి పన్నిన పన్నాగమని. ఇదంతా అంతర్జాతీయ సంస్థల పేరిట బోగస్ కంపెనీలతో, బినామీలతో చంద్రబాబు ఆడిస్తున్న మహర్నాటకమని!!.
తెరవెనుక జరిగిందేంటి? దీని వెనకున్న కుట్రేంటి? ఒకసారి చూద్దాం.
ఐఎంజీ అకాడెమీస్ సంస్థ ఫ్లోరిడాలో ఉంది. దానికి చివరన ‘‘భారత’’ అనే తోక తగిలించుకుని పుట్టకొచ్చింది ఐఎంజీ అకాడెమీస్ భారత. ముద్దుగా ఐఎంజీబీ. ఈ కంపెనీ రిజిస్టరైంది 2003 ఆగస్టు 5న. అది కూడా... రూ.5 లక్షల మూలధనంతో. దీని యజమానులు కూడా బిల్లీరావు, ఆయన సోదరుడు ప్రభాకరరావు (పేటరావు). మొత్తం వెయ్యి షేర్లలో 999 షేర్లు బిల్లీరావువి కాగా... 1 షేరు ఆయన సోదరుడు ప్రభాకరరావు అలియాస్ పేటరావుది. అంటే నూరుశాతం వీరిద్దరిదే. బాబు బినామీలదే.
ఆగస్టు 5న రిజిస్టరయిన కంపెనీతో నాలుగు రోజులు కూడా తిరక్క ముందే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంఓయూ కుదుర్చేసుకున్నారు. కనీసం కేబినెట్ అనుమతి కూడా లేదు. అయినా సరే బాబు స్వయంగా ఓకే చేసిన ఈ ఒప్పందం ప్రకారం...
ఐఎంజీకి రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని... ఎకరా కేవలం రూ. 50 వేల చొప్పున కట్టబెడుతుంది. నిజం చెప్పాలంటే 2003 నాటికే ఇక్కడ ఎకరా రూ.4 కోట్ల వరకూ పలుకుతోంది. అంటే రూ. 1,600 కోట్ల విలువైన భూమిని జస్ట్ 2 కోట్లకు ఇచ్చేశారన్న మాట.
రెండో విడతగా శంషాబాద్‌లోని మామిడిపల్లిలో మరో 450 ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం. ఇది కూడా ఎకరా జస్ట్ రూ.50 వేలకే. అప్పట్లో ఎకరా కనీసం రూ.కోటి ఉందని అనుకున్నా... అదో 450 కోట్లన్నమాట.
{ఫీ రిజిస్ట్రేషన్: చిత్రమేంటంటే ఎకరా రూ. 50 వేలకు ఉదారంగా కేటాయించేసిన ప్రభుత్వం... 850 ఎకరాలకు రిజిష్ట్రేషన్ ఫీజు రూపేణా కొన్ని కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నా... అబ్బే! మాకు డబ్బులు అవసరం లేదు ఫ్రీగా చేసేస్తామని వరం ఇచ్చేసింది. ఇదేమైనా చంద్రబాబో, రామోజీనో కష్టపడి సంపాదించినదైతే ఇలా ఇచ్చేవారు కాదేమో!! కానీ ప్రజల సొమ్ము కదా... వారిష్టం.
ఈ 850 ఎకరాలతో ఊరుకున్నారా అంటే... అలాంటిదేమీ లేదు. పాపం! ఐఎంజీకి చిన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు తప్ప వేరే ఆఫీసు లేదు. అందుకే... బంజారాహిల్స్ నుంచి శిల్పారామం వరకు వెళ్లే మెయిన్‌రోడ్డును ఆనుకుని, ఎక్కడ కావాలని ఐఎంజీ అడిగితే అక్కడ 5 ఎకరాల స్థలాన్ని ఆఫీసుకోసం ఇస్తామని ఎంఓయూలో వరమిచ్చేశారు చంద్రబాబు! ఔరా!!!.
భూములివ్వటంతో ఊరుకోలేదు చంద్రబాబు! తెలుగు ప్రజల గుండెలు పగిలిపోయే మరిన్ని క్లాజుల్ని కూడా ఒప్పందంలో చేర్చేశారు.
హైదరాబాద్‌లో మొత్తం 8 స్టేడియాల్ని బిల్లీ కంపెనీ గుర్తించింది. ఆ స్టేడియాల్ని బిల్లీకి 45 ఏళ్ల పాటు లీజుకివ్వటానికి చంద్రబాబు ఓకే చేసేశారు. కాకపోతే లీజు ధర మాత్రం చెప్పలేదు. అంటే... ఫ్రీగా ఇచ్చేసినట్లేనన్న మాట.
ఇంకా మండిపోయే క్లాజేమిటంటే... ఈ స్టేడియాల్లో దేన్నయినా, ఎప్పుడు కావాలంటే అప్పుడు బిల్లీ కంపెనీ దాని స్థలానికి, నిర్మాణానికి అయిన ఖర్చును చెల్లించి కొనేసుకోవచ్చు. కాదనే హక్కు ఎవరికీ లేదు. ఒకవేళ ఈ 45 ఏళ్లలో వేరే ప్రభుత్వాలు వస్తేనో??? అనే సందేహం ఎవరికైనా రావచ్చు. ఎవరికైనా ఎందుకు! బాబుకే వచ్చింది. అందుకే... ప్రభుత్వం ఈ విషయంలో సహాయనిరాకరణ చేసినా బిల్లీ కంపెనీ తన హక్కును అమలు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టంచేసేసింది. హమ్మా! వీళ్ల అసాధ్యం కూల!!
అంటే భవిష్యత్తులో ఈ స్టేడియాల్ని ఐఎంజీ స్వాధీనం చేసుకున్నా, సబ్ లీజుకు ఇచ్చుకున్నా, వేరొకరికి అమ్మేసినా అడిగే దిక్కు ఉండదన్న మాట. అదండీ కథ. ఇంతకీ ఆ స్టేడియాలేవో తెలుసా?
1) జిఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్ - గచ్చిబౌలి
2) ఇండోర్ స్టేడియం - గచ్చిబౌలి
3) అక్వాటిక్స్ స్టేడియం - గచ్చిబౌలి
4) ఇండోర్ స్టేడియం - సరూర్‌నగర్
5) విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియం - యూసఫ్‌గూడ
6) ఎస్ఏఏపీ వెలోడ్రమ్ - ఉస్మానియా వర్సిటీ
7) షూటింగ్ రేంజ్ - హెచ్‌సీయూ క్యాంపస్
8) హాకీ స్టేడియం - గచ్చిబౌలి
ఈ ఎనిమిది స్టేడియాల నిర్మాణానికీ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.117 కోట్లు. అంటే... 45 ఏళ్ల తరవాతయినా ఐఎంజీ ఈ ధర చెల్లించి కొనేసుకోవచ్చన్న మాట. అంటే 2048లో కూడా ఐఎంజీ రూ.117 కోట్లు చెల్లించి హైదరాబాద్‌లోని 8 స్టేడియాలనూ స్వాధీనం చేసుకోవచ్చు!!. నిజానికి 2048లో ఒక స్టేడియానికి స్థలం కొనాలంటేనే అంత ఖర్చయ్యే అవకాశముంది. మరి అప్పుడు కూడా ఇదే ధరకు 8 స్టేడియాల్ని అప్పగించాలని బాబు నిర్ణయించారంటే ఆయనది ఎంత దాతృత్వం!!! ఎంత దాతృత్వం!!!
ఇక్కడ ఇంకో చిత్రమైన క్లాజు కూడా ఉంది. లీజుకిచ్చాం కదా అని ప్రభుత్వం ఊరుకోలేదు. ఆ స్టేడియాల నిర్వహణకు ఐదేళ్ల పాటు ఏడాదికి రూ. 2.5 కోట్ల చొప్పున నిర్వహణ వ్యయాన్ని తామే భరిస్తామని కూడా స్పష్టంచేసింది. అంటే! లాభాలు బిల్లీకి. ఖర్చు ప్రభుత్వానికి. ఏం ప్లాను గురూ!!!
పబ్లిసిటీకి 11.25 కోట్లు సమర్పణ
అంతేకాదు, హైదరాబాద్ గురించి చాలా గొప్పగా ప్రచారం చేయడానికి కూడా బిల్లీరావుకు తన వంతు సాయం చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. బిల్లీ చేసే ఈ ప్రచారానికి... ఏడాదికి రూ.2.5 కోట్లు చొప్పున ఐదేళ్లపాటు చెల్లిస్తామని కూడా వరం కురిపించేసింది.
ఇవన్నీ కాక... సాధారణంగా విద్యాసంస్థలకిచ్చే అన్ని రాయితీలనూ ఈ బినామీల బిల్లీ కంపెనీకి కూడా ప్రభుత్వం వర్తింపజేసేసింది.
వీటితో పాటు 10 సంవత్సరాల పాటు వినోదపు పన్నును మినహాయించింది. అంటే 10 సంవత్సరాల పాటు ఈ మైదానాల్లో జరిగే ఏ క్రీడపై ఎంత వసూలు చేసినా... ప్రభుత్వానికి పైసా పన్ను చెల్లించరన్న మాట. ఇది ఎన్ని వందల, వేల కోట్లుంటుందన్నది ఊహకు కూడా అందని విషయం.
ఇక తొలి ఐదేళ్లలో టికెట్ల ద్వారా వచ్చే ఆదాయంలో 30 శాతాన్ని ఐఎంజీిబీకి అందజేస్తారు. ఆ తరువాతి 40 ఏళ్లూ మాత్రం... ఫిఫ్టీ - ఫిఫ్టీ... అంటే సర్కారుకు సగం, బిల్లీకి సగం.
ఏ క్రీడ నిర్వహించినా దానికి సంబంధించి ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని తొలి 10 సంవత్సరాలూ బిల్లీ కంపెనీయే స్వాహా చేస్తుంది. ఆ తరవాత 35 ఏళ్లలో 20 శాతాన్ని మాత్రం ప్రభుత్వానికిస్తుంది.
షాపులు, రెస్టారెంట్లు, ఇతరత్రా మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సర్కారు- బిల్లీ చెరిసగం పంచుకుంటారు.
ఇంకో షాకింగ్ న్యూసేంటంటే... రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినందుకు వైఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు... ఐఎంజీకి మాత్రం మొదటి 3 సంవత్సరాలూ ఉచితంగా విద్యుత్, మంచినీళ్లు ఇవ్వడానికి అంగీకరించేశారు. ఆ తరువాతి నాలుగేళ్ల పాటు ఈ బిల్లులపై 25 శాతం రాయితీ ఉంటుంది.
ఎన్నో చిత్రమైన లిటిగేషన్లు..
గచ్చిబౌలిలో ఐఎంజీకి చంద్రబాబు కేటాయించిన భూములు... అచ్చంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్వి. వర్సిటీకి చెందిన 400 ఎకరాలను బిల్లీకి కేటాయిస్తూ... పరిహారంగా గోపన్‌పల్లి సర్వే నంబరు 36,37లో ఉన్న 317 ఎకరాల భూముల్ని యూనివర్సిటీకి కేటాయించారు బాబు. ఏం! నిజంగా క్రీడల్ని అభివృద్ధి చేసే కంపెనీయే అయితే బిల్లీకి ఆ గోపన్‌పల్లి భూములే ఇవ్వచ్చుగా? అత్యంత ఖరీదైన గచ్చిబౌలి భూముల్నే ఇచ్చారెందుకు? స్వాహా చేయడానికి కాదా?
శంషాబాద్‌లో ఇచ్చిన 450 ఎకరాల్లో ఐఎంజీకి ఒక రిక్రియేషన్ సెంటర్‌ను నిర్మించాలనే షరతు పెట్టారు. అది కూడా ఎప్పుడో తెలుసా? అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన రెండేళ్లలోపు. అంటే ఈ విమానాశ్రయం 2008లో ఆరంభమైంది. 2010లోగా నిర్మించేందుకు అవకాశమిచ్చారన్న మాట బాబు. అంటే 2004లో ఒప్పందం కుదుర్చుకుని... ఆరేళ్ల సమయం ఇచ్చారన్న మాట. స్థలాన్ని మాత్రం ఎకరా రూ.50 వేల చొప్పున 2004లోనే కేటాయించేశారు. అంతేకాదు. ఆ 50వేల ధరను సైతం... వెంటనే చెల్లించాల్సిన పనిలేకుండా వరమిచ్చారు బాబు. సగం మొత్తాన్ని రిజిస్ట్రేషన్ సమయంలోను, మరో సగం మొత్తాన్ని ఎయిర్‌పోర్టు మొదలైన 90 రోజుల్లోగా చెల్లించవచ్చని చెప్పారు. అదీ... అసలు సంగతి. సగం డబ్బులకే పూర్తి రిజిస్ట్రేషన్. పెపైచ్చు ఆరేళ్ల తరవాత మిగిలింది. ఏం బొనాంజా బాబూ!!
ఇదండీ ఒప్పందం. ఇప్పుడు చెప్పండి! ఈ కుంభకోణానికి విలువ కట్టడం మానవ మాత్రులకు సాధ్యమా? ఇంతటి నీచానికి దిగినందుకు జనం అప్పటికప్పుడు చంద్రబాబుకు బుద్ధి చెప్పి గద్దె దింపేయబట్టి... వైఎస్సార్ అధికారంలోకి రాబట్టి... తాత్కాలికంగా ఒప్పందం ఆగిపోయింది. అయితే ఒప్పందం అమలు కోసం ఇప్పటికీ బిల్లీ కోర్టుల్లో పోరాడుతూనే ఉన్నారు. ఇంత నీచపు ఒప్పందం కాబట్టి... తాను జైలుకు పోకుండా చంద్రబాబు ఎప్పటికప్పుడు చక్రం తిప్పుతూనే ఉన్నారు. అవసరమైనపుడు అధికారంలో ఉన్న వాళ్లతో విచారణ తనవైపు రాకుండా పొత్తులు కూడా కుదుర్చుకుంటున్నారు. పార్టీని, విలువల్ని అన్నిటినీ తాకట్టు పెడుతూ వస్తున్నారు. అదే బాబు మళ్లీ గెలిస్తే ఏమో... ఈ బిల్లీ హూంకరించనూ వచ్చు. మరిన్ని బిల్లీలు పుట్టుకురానూ వచ్చు.