దొంగనుకుని భార్యను కాల్చేశాడు
వాషింగ్టన్: అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన భార్యను దొంగ అనుకుని భర్త తుపాకీతో కాల్చాడు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్త్ కరోలినాలోని గోల్డ్స్బరోలో గినా విలియమ్స్(48), బిల్లీ విలియమ్స్(49)లు నివసిస్తున్నారు. కాగా, గినా ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఘటన జరిగిన రోజు నైట్ షిఫ్ట్ కావడంతో గురువారం సాయంత్రమే కార్యాలయానికి వెళ్లింది.
మరుసటి రోజే ఆమె తిరిగి వస్తుందని భావించిన బిల్లీ ఇంట్లోకి ఎవరో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండటంతో అప్రమత్తమయ్యాడు. దొంగ భావించిన బిల్లీ తుపాకీతో వ్యక్తి మెడ భాగంలో కాల్చాడు. దీంతో బుల్లెట్ గాయమైన గినా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కాగా బిల్లీపై ఇంకా ఎలాంటి కేసు నమోదు కాలేదు. పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు.