సీఎంకు అమరావతి దెయ్యం పట్టింది
విజయవాడ బ్యూరో : సీమలోని నాలుగు జిల్లాలు కరువుతో అల్లాడుతుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి జపం చేస్తూ నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు వ్యవహరిస్తున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. విజయవాడ ఐలాపురం హోటల్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర కరువు కారణంగా సీమ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా యువకులు పొరుగు ప్రాంతాలకు వలస పోతున్నారని, అయినా సీఎం చంద్రబాబు నెత్తిన అమరావతి దెయ్యం పట్టినట్టుగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ కేసీఆర్‌కు భయపడి బాబు విజయవాడకు వచ్చేశారని ఆరోపించారు. 13 జిల్లాల చిన్న రాష్ట్రానికి ఏకంగా లక్షల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టడం చిన్న పాపకు పెద్ద గౌను వేసినట్టు ఉందని ఎద్దేవా చేశారు. కేవలం 500 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టవచ్చని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భూ సమీకరణ పద్ధతిలో లక్షల ఎకరాల సేకరణ వెనుక అసలు కారణం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దండుకోవడానికేనని ఆరోపించారు.
సీమకు అడుగడుగునా అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాయలసీమ రాష్ట్ర ఉద్యమానికి కారణమవుతోందని, నిర్లక్ష్యం చేసి తమకు తామే విడిపోయే పరిస్థితులు కల్పిస్తోందని ఆయన విమర్శించారు. రాయలసీమకు నీరివ్వడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం శ్రీశైలం డెడ్‌స్టోరేజీ నుంచి కూడా మంచినీటి అవసరాల పేరుతో నీరు విడుదల చేస్తోందని ధ్వజమెత్తారు. పట్టిసీమ పేరు చివరన సీమ ఉన్నప్పటికీ దానివల్ల రాయలసీమకు ఎటువంటి ప్రయోజనం లేదన్నారు.
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు రావాల్సిన రాజధానిని అమరావతికి మార్చారని, సాగునీరు ఇవ్వకుండా దగా చేస్తున్నారని, కరువు ప్రాంతాల్లో వలసల నివారణకు చర్యలు తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించేలా త్వరలో సీమ జిల్లాల్లో యాత్ర చేపడతామని రాజశేఖరరెడ్డి ప్రకటించారు. సీమ ప్రాంతానికే చెందిన సీఎం నంబర్ గేమ్‌లో పడి కోస్తా జిల్లాల్లో సీట్లు కోసం సీమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సీమకు చెందిన పెద్దాయన కేఈ కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేసి రాయలసీమ మేలు కోసం ఉద్యమంలో కలిసిరావాలని కోరారు.