ప్రత్యర్థిని నరికేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయో, లేదో.. ఘర్షణలు వెంటనే మొదలైపోయాయి. ఒడిసాలో బీజేడీకి చెందిన ఓ కార్యకర్తను కాంగ్రెస్ కార్యకర్తలు నరికి చంపేశారు. ఈ సంఘన కేంద్రపర జిల్లాలో జరిగింది. రంజిత్ నాయక్ (40) అనే వ్యక్తిని పత్రాపూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు నరికి చంపినట్లు జిల్లా ఎస్పీ రవి నారాయణ్ బెహరా తెలిపారు.
నిందితులు, మృతుడు ఒకే గ్రామానికి చెందినవాళ్లు. ఈ నేరంలో మరింతమంది పాత్ర ఏమైనా ఉందేమో తెలుసుకోడానికి దర్యాప్తు మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాక రంజిత్ నాయక్ ఇంటివద్ద బాణాసంచా కాల్చారు. దానికి అభ్యంతరం చెబుతూ వాళ్లతో గొడవపడ్డాడు. దానికి ప్రతీకారంగా.. అతడు గ్రామ శివార్లలో ఒంటరిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు పదునైన ఆయుధాలతో దాడిచేసి నరికి చంపేశారు.