BNR
-
ప్రాణమున్నంత వరకు వైఎస్సార్సీపీలోనే..
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ప్రాణమున్నంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటామని అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి కుమారులు ప్రతాప్‌రెడ్డి, వెంకటేశ్‌రెడ్డిలు స్పష్టం చేశారు. బీఎన్ఆర్ సోదరులు గురునాథ్‌రెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, రెడ్డప్పరెడ్డిలు ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఈక్రమంలో బీఎన్ఆర్ కుమారులు కృష్ణా జిల్లాలో సాగుతున్న పాదయాత్రకు వెళ్లి జగన్‌ను కలిశారు. బీఎన్ఆర్ కుటుంబం టీడీపీలో చేరలేదని, ఆయన సోదరులు మాత్రమే టీడీపీలో చేరారని ప్రతాప్‌రెడ్డి, వెంకటేశ్‌రెడ్డిలు ఆయనకు తెలిపారు. తుది వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని స్పష్టం చేశారు. వారితో కాసేపు అనంతపురం నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. బీఎన్ఆర్ కుమారులు జగన్మోహన్రెడ్డిని కలవడం అనంతపురం నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. షాక్‌లో గురునాథ్‌రెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి అనంతపురం ఎమ్మెల్యేగా బి.నారాయణరెడ్డికి మంచిపేరు ఉంది. బీఎన్ఆర్ సోదరులుగానే గురునాథ్‌రెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, రెడ్డప్పరెడ్డిలకు గుర్తింపు. బీఎన్ఆర్ ప్రాణమున్నంత వరకూ వైఎస్ కుటుంబంతోనే నడిచారు. ఆయన మరణానంతరం ముగ్గురు సోదరులు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీన్ని అనంతపురం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా తప్పుబట్టారు. బీఎన్‌ఆర్‌ను చూసే గురునాథరెడ్డికి ఓట్లేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించామని చర్చించుకున్నారు. అలాంటిది టీడీపీలోకి వెళ్లడమంటే బీఎన్ఆర్ కాకుండా వారు ముగ్గురు వ్యక్తులుగా టీడీపీలో చేరడమే అనే చర్చ ‘అనంత’లో నడుస్తోంది. ఈక్రమంలో బీఎన్ఆర్ కుమారులు తాము వైఎస్సార్సీపీలోనే ఉన్నామని స్పష్టం చేయడంతో బీఎన్ఆర్ పేరు లేకుండా వారి సోదరులు చేసే రాజకీయం తెప్ప లేకుండా నావ నడిపినట్లే. ఈ పరిణామం గురునాథ్‌రెడ్డి, ఎర్రిస్వామిరెడ్డితో పాటు రెడ్డప్పరెడ్డికి పచ్చి వెలక్కాయ నోట్లో పడినట్లయింది. ప్రాణమున్నంత వరకూ జగన్‌తోనే: ప్రతాప్‌రెడ్డి ‘‘బీఎన్ఆర్ కుటుంబం ఏ పార్టీలో చేరలేదు. మేం ప్రాణమున్నంత వరకూ జగన్‌తోనే ఉంటాం. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాం. కొన్ని అనివార్య కారణాలతో కొద్దిరోజులుగా ఈ ప్రకటన చేయలేదు. జగన్‌ను కలిసి మా అభిప్రాయం చెప్పాం. అనంతపురం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. -
అశ్రునయనాలతో అంత్యక్రియలు
కణేకల్లు (రాయదుర్గం) : అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి (70) అంత్యక్రియలు అభిమానులు, బంధువులు, కుటుంబసభ్యులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య జరిగాయి. అనంతపురంలోని ఇంటి నుంచి బీఎన్ఆర్ భౌతికాయాన్ని మధ్యాహ్నం 1.40 గంటలకు స్వగ్రామమైన కణేకల్లు మండలం పెనకలపాడులోని ఇంటికి తీసుకొచ్చారు. రెండు గంటల పాటు ప్రజల సందర్శనార్థం ఉంచారు. గ్రామస్తులు, అభిమానులు భారీసంఖ్యలో తరలివచ్చి.. నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ఆయన సతీమణీ కాపు భారతిలు బీఎన్ఆర్ భౌతికాయానికి పూలమాలలేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం 3.20 గంటలకు ఇంటి నుంచి గ్రామశివారులో ఉన్న పొలం వరకు అంతిమయాత్ర కొనసాగింది. సాయంత్రం 4.30 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. బీఎన్ఆర్ సోదరులు బి.గురునాథరెడ్డి, బి.ఎర్రిస్వామిరెడ్డి, రెడ్డప్పరెడ్డితో పాటు కుటుంబసభ్యులు మట్టిని ముట్టించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తోపుదుర్తి కవిత, వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, మీసాల రంగన్న, డిప్యూటీ మేయర్ శ్రీరాములు, కణేకల్లు మాజీ ఎంపీపీ ఆలేరి రాజగోపాల్‌రెడ్డి, బొమ్మనహాళ్ మాజీ ఎంపీపీ లాలుసాబ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పాటిల్ నాగిరెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షులు మారెంపల్లి మారెన్న, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆలూరు చిక్కణ్ణ, నాయకులు విక్రంసింహారెడ్డి, బి.మోహన్‌రెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
అధైర్యపడొద్దు
బీఎన్ఆర్ మృతి బాధాకరం కుటుంబ సభ్యులను ఓదార్చిన వైఎస్ జగన్ భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏటీపీసీ105 : బీఎన్ఆర్కు నివాళులర్పించి.. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో ఎంపీ మిథున్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ తదితరులు ఏటీపీసీ212 : కణేకల్లు మండలం పెనకలపాడులో బీఎన్ఆర్ అంతిమయాత్ర ఏటీపీసీ211 : కన్నీరు మున్నీరవుతున్న బీఎన్ఆర్ కుటుంబ సభ్యులు అనంతపురం : అధైర్యపడొద్దని, ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి (బీఎన్ఆర్) కుటుంబ సభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్చారు. అనారోగ్యంతో బాధపడుతూ బీఎన్ఆర్ ఆదివారం మరణించిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని సోమవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించి.. నివాళులర్పించారు. వైఎస్ జగన్ ఉదయం 10.45 గంటలకు బెంగళూరు నుంచి నేరుగా అనంతపురం అరవిందనగర్‌లోని మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయన వస్తున్నారనే సమాచారం అందుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాన్వాయ్ అక్కడికి చేరుకోగానే జగన్‌తో కరచాలనం చేయడానికి అభిమానులు ఎగబడ్డారు. వారికి అభివాదం చేస్తూ గురునాథరెడ్డి నివాసంలోకి వెళ్లారు. బీఎన్ఆర్ భౌతికకాయానికి పూలమాల వేసి..నివాళి అర్పించారు. అన్న మృతిని తట్టుకోలేక బోరున విలపించిన బీఎన్ఆర్ సోదరులు బి.ఎర్రిస్వామిరెడ్డి, బి.రెడ్డప్పరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి్కి ధైర్యం చెప్పారు. అక్కడికి కూడా నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో రావడంతో...బీఎన్ఆర్ కుటుంబ సభ్యులందరితో మరో గదిలోకి వెళ్లి ప్రత్యేకంగా మాట్లాడారు. మరణానికి దారి తీసిన పరిస్థితులపై ఆరా ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ తాను ఇటీవల హైదరాబాద్‌లో ఆస్పత్రికి వెళ్లి బీఎన్ఆర్ అన్నను పరామర్శించానని, ఆ సమయంలో ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చెప్పారని అన్నారు. శనివారం రాత్రి దాకా కుటుంబ సభ్యులతో పాటు జిల్లాకు చెందిన పలువురి నాయకులతో ఫోన్లోనూ, నేరుగానూ బాగా మాట్లాడారని, ఆదివారం ఉదయం ఉన్నపళంగా అపస్మారక స్థితికి చేరుకుని మరణించారని ఎర్రిస్వామిరెడ్డి బోరున విలపించారు. ‘కుటుంబానికి నువ్వే పెద్దవాడివి. అందరికీ ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా డీలా పడితే ఎలా?’ అంటూ జగన్ ఓదార్చారు. అలాగే కుటుంబ సభ్యులను ఒక్కొక్కరినీ పలకరించారు. రామ్మోహన్‌రెడ్డి, నారాయణరెడ్డి కుటుంబాలకు పరామర్శ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ జిల్లా బలపనూరుకు చెందిన పుల్లారెడ్డి కుమారుడు రామ్మోహన్‌రెడ్డి, కోడలు మాధవి, మనవరాలు అనూష మృతి చెందారు. వీరి కుటుంబం అనంతపురం సాయినగర్‌లో స్థిరపడింది. వైఎస్ జగన్ వీరి ఇంటికి వెళ్లి రామ్మోహన్‌రెడ్డి కుమారుడు అనుదీప్, సోదరుడు రంగారెడ్డిని పరామర్శించారు. అలాగే ఇటీవల మునిసిపల్ మాజీ చైర్మన్ అంబటి నారాయణరెడ్డి మృతి చెందారు. ఆయన కుమారుడు అంబటి తిరుమలరెడ్డి, కోడలు అంబటి లక్ష్మీని కూడా వైఎస్ జగన్ పరామర్శించారు. అక్కడి నుంచి నేరుగా బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. వైఎస్ జగన్ వెంట పార్టీ జిల్లా ఇన్చార్జ్, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్‌నారాయణ, నాయకులు కేతిరెడ్డి పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, తోపుదుర్తి కవిత, ఆలూరి సాంబశివారెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, ఉషశ్రీచరణ్, రమేష్‌రెడ్డి, డాక్టర్ సిద్దారెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, మడకశిర గోవర్దన్‌రెడ్డి, పులివెందుల దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, లింగాల శివశంకర్‌రెడ్డి, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, గౌస్‌బేగ్, ఎల్ఎం మోహన్‌రెడ్డి, పామిడి వీరాంజనేయులు, బోయ సుశీలమ్మ, పాలే జయరాంనాయక్, కొర్రపాడు హుసేన్‌పీరా, ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, మీసాల రంగన్న, మరువపల్లి ఆదినారాయణ రెడ్డి, కసునూరు రఘునాథ రెడ్డి, మారుతీప్రకాష్, సోమశేఖర్ రెడ్డి, కొండమ్మ, కృష్ణవేణి తదితరులు ఉన్నారు. -
బీఎన్ఆర్ స్మారక పురస్కార ప్రధానోత్సవం