అధైర్యపడొద్దు
- బీఎన్‌ఆర్ మృతి బాధాకరం
- కుటుంబ సభ్యులను ఓదార్చిన వైఎస్ జగన్
- భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
ఏటీపీసీ105 : బీఎన్‌ఆర్‌కు నివాళులర్పించి.. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో ఎంపీ మిథున్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ తదితరులు
ఏటీపీసీ212 : కణేకల్లు మండలం పెనకలపాడులో బీఎన్‌ఆర్ అంతిమయాత్ర
ఏటీపీసీ211 : కన్నీరు మున్నీరవుతున్న బీఎన్‌ఆర్ కుటుంబ సభ్యులు
అనంతపురం : అధైర్యపడొద్దని, ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి (బీఎన్‌ఆర్) కుటుంబ సభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్చారు. అనారోగ్యంతో బాధపడుతూ బీఎన్‌ఆర్ ఆదివారం మరణించిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని సోమవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించి.. నివాళులర్పించారు. వైఎస్ జగన్ ఉదయం 10.45 గంటలకు బెంగళూరు నుంచి నేరుగా అనంతపురం అరవిందనగర్‌లోని మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయన వస్తున్నారనే సమాచారం అందుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాన్వాయ్ అక్కడికి చేరుకోగానే జగన్‌తో కరచాలనం చేయడానికి అభిమానులు ఎగబడ్డారు. వారికి అభివాదం చేస్తూ గురునాథరెడ్డి నివాసంలోకి వెళ్లారు. బీఎన్‌ఆర్ భౌతికకాయానికి పూలమాల వేసి..నివాళి అర్పించారు. అన్న మృతిని తట్టుకోలేక బోరున విలపించిన బీఎన్‌ఆర్ సోదరులు బి.ఎర్రిస్వామిరెడ్డి, బి.రెడ్డప్పరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి్కి ధైర్యం చెప్పారు. అక్కడికి కూడా నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో రావడంతో...బీఎన్‌ఆర్ కుటుంబ సభ్యులందరితో మరో గదిలోకి వెళ్లి ప్రత్యేకంగా మాట్లాడారు.
మరణానికి దారి తీసిన పరిస్థితులపై ఆరా
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ తాను ఇటీవల హైదరాబాద్‌లో ఆస్పత్రికి వెళ్లి బీఎన్‌ఆర్ అన్నను పరామర్శించానని, ఆ సమయంలో ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చెప్పారని అన్నారు. శనివారం రాత్రి దాకా కుటుంబ సభ్యులతో పాటు జిల్లాకు చెందిన పలువురి నాయకులతో ఫోన్‌లోనూ, నేరుగానూ బాగా మాట్లాడారని, ఆదివారం ఉదయం ఉన్నపళంగా అపస్మారక స్థితికి చేరుకుని మరణించారని ఎర్రిస్వామిరెడ్డి బోరున విలపించారు. ‘కుటుంబానికి నువ్వే పెద్దవాడివి. అందరికీ ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా డీలా పడితే ఎలా?’ అంటూ జగన్ ఓదార్చారు. అలాగే కుటుంబ సభ్యులను ఒక్కొక్కరినీ పలకరించారు.
రామ్మోహన్‌రెడ్డి, నారాయణరెడ్డి కుటుంబాలకు పరామర్శ
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ జిల్లా బలపనూరుకు చెందిన పుల్లారెడ్డి కుమారుడు రామ్మోహన్‌రెడ్డి, కోడలు మాధవి, మనవరాలు అనూష మృతి చెందారు. వీరి కుటుంబం అనంతపురం సాయినగర్‌లో స్థిరపడింది. వైఎస్ జగన్ వీరి ఇంటికి వెళ్లి రామ్మోహన్‌రెడ్డి కుమారుడు అనుదీప్, సోదరుడు రంగారెడ్డిని పరామర్శించారు. అలాగే ఇటీవల మునిసిపల్ మాజీ చైర్మన్ అంబటి నారాయణరెడ్డి మృతి చెందారు. ఆయన కుమారుడు అంబటి తిరుమలరెడ్డి, కోడలు అంబటి లక్ష్మీని కూడా వైఎస్ జగన్ పరామర్శించారు. అక్కడి నుంచి నేరుగా బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. వైఎస్ జగన్ వెంట పార్టీ జిల్లా ఇన్‌చార్జ్, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్‌నారాయణ, నాయకులు కేతిరెడ్డి పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, తోపుదుర్తి కవిత, ఆలూరి సాంబశివారెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, ఉషశ్రీచరణ్, రమేష్‌రెడ్డి, డాక్టర్ సిద్దారెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, మడకశిర గోవర్దన్‌రెడ్డి, పులివెందుల దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, లింగాల శివశంకర్‌రెడ్డి, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, గౌస్‌బేగ్, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, పామిడి వీరాంజనేయులు, బోయ సుశీలమ్మ, పాలే జయరాంనాయక్, కొర్రపాడు హుసేన్‌పీరా, ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, మీసాల రంగన్న, మరువపల్లి ఆదినారాయణ రెడ్డి, కసునూరు రఘునాథ రెడ్డి, మారుతీప్రకాష్, సోమశేఖర్ రెడ్డి, కొండమ్మ, కృష్ణవేణి తదితరులు ఉన్నారు.