చైనా కమ్యూనిస్టు పార్టీ నేతకు జీవితఖైదు
జినాన్/బీజింగ్: అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై కమ్యూనిస్టు పార్టీ మాజీ అగ్రనేత బోగ్జిలాయ్కి చైనా కోర్టు జీవితఖైదు విధించింది. షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని జినాన్ ఇంటర్మీడియెట్ కోర్టు ఆదివారం బో గ్జిలాయ్ని అవినీతి, అధికార దుర్వినియోగం, నిధుల దుర్వినియోగం అభియోగాల్లో దోషిగా తేల్చింది. బో గ్జిలాయ్కు లంచం తీసుకున్నారన్న అభియోగాలపై జీవితఖైదు, నిధుల దుర్వినియోగం అభియోగాలపై 15 ఏళ్లు, అధికార దుర్వినియోగం అభియోగంలో ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ప్రజాప్రతినిధిగా పని చేసిన బో అవినీతికి పాల్పడ్డం వల్ల దేశానికి, ప్రజలకు తీరని నష్టం జరిగిందని చెప్పింది. 64 ఏళ్ల బోగ్జిలాయ్ కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఛాంగ్కింగ్ సిటీ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు.
అంతేకాక ప్రజాదరణ కలిగిన నాయకుడిగా గత ఏడాది జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన పోటీదారుల్లో ఒకరిగా నిలిచారు. అయితే అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలు రావడంతో ఆయనను పార్టీ నుంచి తప్పించారు. బోగ్జిలాయ్ డాలియాన్ సిటీ అధిపతిగా ఉండగా నగర సుందరీకరణ పేరుతో 33 లక్షల అమెరికా డాలర్ల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వెలువడ్డాయి. అయితే తనపై మోపిన అభియోగాలను తోసిపుచ్చిన బోగ్జిలాయ్.. జినాన్ కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.