Boats Rally
-
శరదృతువులో అక్కడ పడవలతో పండుగ సందడి..ఏకంగా..!
సరస్సులో పడవల సందడితో కనువిందు చేసే పండుగ ఇది. ఏటా శరదృతువులో పద్దెనిమిది రోజుల పాటు కొనసాగే ఈ పండుగ కోలాహలం చూసి తీరాల్సిందే! మయాన్మార్లోని ఇన్లే సరస్సు ఒడ్డున ఉన్న ‘ఫాంగ్ డా వూ’ పగోడా వరకు పద్దెనిమిది రోజుల పాటు పడవల ఊరేగింపు జరుగుతుంది. మయాన్మార్ చాంద్రమాన కేలండర్లోని ఏడో నెల అయిన థాడింగ్యుట్ నెలలో శుక్లపక్షం మొదటి రోజు నుంచి బహుళపక్షం మూడో రోజు వరకు జరిగే ఈ పండుగలో లక్షలాది మంది జనాలు పాల్గొంటారు. ఈసారి ఈ పండుగ అక్టోబర్ 3 నుంచి ప్రారంభమై, 20 వరకు జరుగుతోంది. మయాన్మార్లోని మైనారిటీ తెగలకు చెందిన ‘ఇంథా’, ‘పావో’ తెగలవారు ఈ పండుగలో పెద్దసంఖ్యలో పాల్గొంటారు. పండుగ జరిగే పద్దెనిమిది రోజుల్లోనూ ఇన్లే సరస్సులో పడవల మీద ఊరేగింపుగా వెళ్లి ‘ఫాంగ్ డా వూ’ పగోడాకు చేరుకుంటారు. పగోడాలో బంగారుపూతతో కొలువుదీరిన ఐదు బుద్ధప్రతిమలను భక్తిగా తాకి, వాటికి బంగారు రేకులను అతికిస్తారు. విగ్రహాలు మరీ బరువుగా మారడం వల్ల పగోడా నిర్వాహకులు విగ్రహాలకు భక్తులు బంగారు రేకులను అతికే ప్రక్రియపై 2019 నుంచి నిషేధం అమలు చేస్తున్నారు. ఈ విగ్రహాల వద్ద భక్తులు సామూహికంగా ప్రార్థనలు జరుపుతారు. ఇన్లే సరస్సు తీరంలోని గ్రామాల్లో ఈ పద్దెనిమిది రోజులూ పండుగ కోలాహలం అట్టహాసంగా కనిపిస్తుంది. పడవల ఊరేగింపు జరిగినన్ని రోజులూ హంస ఆకారంలో ఉన్న రాచపడవను అనుసరించి వందలాది పడవలు ‘ఫాంగ్ డా వూ’ పగోడా తీరం వరకు ప్రయాణిస్తాయి.(చదవండి: అత్యంత అరుదైన వరుణదేవుడి ఆలయం..!) -
సెయిలింగ్ రెగెట్టా
కొరుక్కుపేట:సముద్రజలాలు, తీరప్రాంతాలు కాలుష్యానికి గురి కాకుండా ఉంచుకునేలా అవగాహన కల్పించేందు కు గురువారం సెయిలింగ్రెగెట్టా (పడవల ర్యాలీ)ని ప్రారంభించారు. దీన్ని కోస్టుగార్డు రీజన్ (ఈస్ట్) కమాం డర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్పీ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ టూరిజం ప్రిన్సిపాల్ సెక్రటరీ హర్ సహాయ్ మీనా జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో ది ఆర్మ్డ్ ఫోర్సెస్, కార్పొరేట్స్, సైలింగ్ క్లబ్స్ నుంచి 100 మంది సైలర్లు రెగెట్టాలో పాల్గొన్నారు. మూడు రోజులు పాటు నిర్వహించే ఈవెంట్ ఈ నెల 24వ తేదీతో ముగియనుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పి శర్మ మాట్లాడుతూ ఇండియన్ కోస్టుగార్డు ఫిబ్రవరి 1-2015 నాటికి జాతీయ సేవలో 38 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందన్నారు. సముద్రంలో కాలుష్య నివారణకు, సముద్రతీర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు తీర్చిదిద్దడంలో కోస్టుగార్డు కృషి చేసిందని గుర్తు చేశారు. ప్రజల్లోనూ ప్రత్యేక అవగాహన తెచ్చినట్లు వివరించారు. సైలింగ్ రెగెట్టా ఈవెంట్లో 100 మంది పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.