boats roll
-
అక్కడ పితృదేవత పండుగకి..పెద్ద పొడవాటి పడవలతో..
లావోస్‌లో ఏటా జరుపుకొనే ‘హా ఖావో పడప్ దిన్’ పండుగలో నదుల్లోను, కొలనుల్లోను పడవల జాతర జరుపుతారు. లావోస్ సంప్రదాయ కేలండర్ ప్రకారం సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఈ పండుగ వస్తుంది. ఈసారి ఆగస్టు 18న జరిగిన ఈ పండుగలో వేలాది మంది పడవల జాతరలో పాల్గొన్నారు. పొడవాటి పడవల్లోకి చేరి, తెడ్లు వేస్తూ పోటా పోటీగా రేసులు నిర్వహించారు. ‘హా ఖావో పడప్ దిన్’ లావోస్ ప్రజల పితృదేవత పండుగ. ఈ పండుగ రోజున ఆలయాల్లోను, ఇళ్లలోను ప్రార్థనలు జరిపి, పితృదేవతలకు సంప్రదాయక వంటకాలను నైవేద్యంగా సమర్పించుకుంటారు. బంధుమిత్రులతో విందు వినోదాలు జరుపుకొంటారు. కొబ్బరిపాలతో బియ్యం ఉడికించి, దానిని అరిటాకుల్లో పొట్లాలుగా చుట్టి పెద్దలకు నైవేద్యం పెడతారు. ఈ వంటకాన్ని ‘ఖావో టోమ్’ అంటారు. తర్వాత ఈ వంటకం పొట్లాలను ఇంటి నలుమూలలా పెట్టి ఉంచుతారు. ఇలా చేస్తే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవని వారి విశ్వాసం. (చదవండి: ఏడాదికి ఒక్కరోజే ఆ గ్రామంలోకి ఎంట్రీ! ఎందుకంటే..) -
సీలేరులో నాటు పడవల బోల్తా
సీలేరు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు సీలేరులో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి జలాశయంలో రెండు నాటు పడవలు బోల్తా పడిన ఘటనలో 8మంది గిరిజన కూలీలు గల్లంతయ్యారు. వారిలో 6 మృతదేహాలు లభ్యం కాగా.. ఇద్దరి జాడ ఇంకా తెలియరాలేదు. వీరిలో ఎక్కువ మంది చిన్న పిల్లలే. ప్రమాదం నుంచి 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ గుంటవాడ పంచాయతీ పరిధిలోని కొందుగుడ గ్రామానికి చెందిన చిన్నాపెద్దా కలిసి 35 మంది గిరిజనులు 8 నెలల క్రితం కూలి పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. ఆదివారం సాయంత్రం వారంతా ఒకే వాహనంలో బయలుదేరి సోమవారం సాయంత్రానికి సీలేరు చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో తాము హైదరాబాద్ నుంచి వచ్చిన విషయం అధికారులకు తెలిస్తే క్వారంటైన్‌కు తరలిస్తారని భావించి వారందరూ అడవి మార్గంలో సీలేరు జలాశయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి జలాశయానికి అవతల ఉన్న తమ గ్రామంలోని వారికి సమాచారం అందించి సోమవారం రాత్రి 7 గంటల సమయంలో రెండు నాటు పడవలు తెప్పించుకుని తొలుత 17 మంది అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. తిరిగి అవే పడవల్లో రెండో ట్రిప్‌లో 18 మంది బయలుదేరగా.. 30 మీటర్ల వెడల్పు, 70 మీటర్ల లోతున్న జలాశయం మధ్యలోకి వచ్చేసరికి నీటి ప్రవాహం పెరిగి పడవలోకి ఒక్కసారిగా నీరు చేరింది. ముందున్న పడవ మునిగిపోతుండటంతో అందులోని వారు ప్రాణభయంతో వెనక ఉన్న పడవను పట్టుకునే ప్రయత్నం చేయగా.. రెండు పడవలు మునిగిపోయాయి. ముందున్న పడవలో ప్రయాణిస్తున్న 11 మందిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా.. ఆరుగురు గల్లంతయ్యారు. వెనుక పడవలోని ఏడుగురిలో ఐదుగురు సురక్షితంగా బయటపడగా ఇద్దరు గల్లంతయ్యారు. 6 మృతదేహాలు వెలికితీత ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఇంజన్ బోట్ల ద్వారా ప్రమాదం జరిగిన ప్రదేశంలో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం సాయంత్రానికి అనుష్క (23), ఏసుశ్రీ (5), గాయత్రి (3), అజిర్ (1), సంసోన్ (10), అనుష్ వర్ధన్ (5) మృతదేహాలను వెలికితీయగా.. కొర్రా లక్ష్మి (23), పింకీ (5) జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీసి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో ఆళ్ల నాని ఫోన్లో మాట్లాడారు. విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, పాడేరు ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్, ఎస్పీ, ఏఎస్పీలు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఒడిశా పోలీస్ శాఖ ఓఎస్డీ సుమరాం, మల్కన్‌గిరి కలెక్టర్ వై.విజయ్‌కుమార్, ఎస్పీ రిషికేస్ కిలారి, ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృతదేహాలను చిత్రకొండ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కొందుగుడ గ్రామంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
విశాఖ చేరుకున్న అవినాష్ మృతదేహం
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): ఇటీవల అమెరికా నూజెర్సీలోని సరస్సులో గల్లంతై మృతిచెందిన ఉక్కునగరానికి చెందిన అవినాష్(32) మృతదేహం శుక్రవారం విశాఖకు చేరుకుంది. విశాఖ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొడుకు మృతదేహాన్ని చూసిన తండ్రి కోన వెంకటరావు కన్నీరు మున్నీరయ్యారు. అవినాష్ 2014లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడని, 2016 అగస్టులో ఇక్కడికి వచ్చి మమ్మల్ని చూసి మళ్లీ వెళ్లాడన్నారు. మే 28న అవినాష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపామని... ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని తండ్రి వాపోయారు. అక్టోబర్, నవంబర్‌లో వివాహం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నామని, ఇంతలోనే ఈ ఘోరం చోటు చేసుకుందని కన్నీరుమున్నీరయ్యారు. ఈ రాత్రి మృతదేహాన్ని స్టీల్‌ప్లాంట్ ఆస్పత్రిలో ఉంచి శనివారం ఉదయం ఉక్కునగరంలో అత్యక్రియలు జరుపుతామని తెలిపారు. సీఐటీయూ నాయకుడు నర్సింగరావు మాట్లాడుతూ అవినాష్ కుటుంబం సభ్యులకు సానుభూతి తెలిపారు. -
కొనసాగుతున్న అన్వేషణ
తూర్పుగోదావరి, మోతుగూడెం (రంపచోడవరం): వై.రామవరం మండలం మంగంపాడు బెంగాలీ క్యాంపు వద్ద నాటుపడవ మునిగి గల్లంతైన వారి మృతదేహాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం డొంకరాయి పోలీసులు, చింతూరు సీఐ వెంకటేశ్వరావు, మోతుగూడెం ఎస్సై మనోహర్జోషి ఆధ్వర్యంలో ఈ చర్యలు కొనసాగాయి. ఆదివారం సాయంత్రం ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్గుర్రవూరు గ్రామానికి చెందిన పూస సత్తిబాయి కుటుంబంతో పాటు మరో ముగ్గురు సంతకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఒడిశా సరిహద్దు సమీపంలో సీలేరు నదిలో నాటు పడవపై ప్రయాణం చేస్తుండగా ఈదురు గాలులు వీయడంతో పడవ మునిగిపోయింది. అందులో ఉన్న పూస బుల్లమ్మ, రీతూబాయి, గల్లంతు కాగా రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. పడవలో ఉన్న మరో నలుగురిని స్థానిక బెంగాలీ జాలర్లు రక్షించి ఒడ్డుకు చేర్చారు. భద్రమ్మ అనే మహిళ అపస్మారక స్థితికి చేరడంతో చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. చిన్నారి మృతదేహం లభ్యంకాగా బంధువులకు అప్పగించారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడం, సీలేరు నదిలో నిండుగా నీరు ఉండడంతో గల్లంతైన ఇద్దరి మృతదేహాల గాలింపు చర్యలు కష్టతరమయ్యాయి. ఒడిశాకు చెందిన వారు ఈ ప్రమాదంలో మృతి చెందడంతో అక్కడ అధికారులకు సమాచారాన్ని అందించేందుకు డొంకరాయి పోలీసులు చర్యలు చేపట్టారు. స్థానిక వీఆర్ఓ జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు వివరాలను చిత్రకొండ పోలీసులకు సమాచారం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. పడవ మునక ఘటనపై రంపచోడవరం సబ్ కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానిక తహసీల్దార్ ప్రసాద్, సీఐ వెంకటేశ్వరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాల గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని పోలీసులను ఆదేశించారు. జాడలేని ఒడిశా అధికారులు ప్రమాదకరమని తెలిసినా సీలేరు నదిని దాటేందుకు ప్రజలు నాటు పడవలనే ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా ఒడిశా సరిహద్దు ప్రాంతం కావడం, సీలేరు నది పక్కనే ఉండడంతో నిత్యవసర సరుకులు కొనుగోలు, ౖవైద్యానికి ఆంధ్రా రావడం పరిపాటిగా మారింది. ఒడిశా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మారుమూల అటవీ ప్రాంతం కావడంతో రోడ్డు సౌకర్యాలు లేక ఆంధ్రాకు నిత్యం పనులపై వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇకనైనా ఇరు రాష్ట్రాల అధికారులు ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్ధానికులు కోరుతున్నారు. ప్రాణాలతో బయటపడడం పునర్జన్మే చింతూరు (రంపచోడవరం): ‘‘ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదు. నాకు, నా బిడ్డకు ఇది పునర్జన్మే. ఆ దేవుడే మమ్మల్ని కాపాడాడు’’ అంటోంది సీలేరు నదిలో పడవ ప్రమాద బాధితురాలు గుర్రలూరుకు చెందిన కోస భద్రమ్మ. ప్రస్తుతం ఆమె చింతూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాదం నుంచి తాము ఎలా బయటపడిందీ ఆమె ఇలా ‘సాక్షి’కి వివరించింది. ‘‘నేను నా బిడ్డ పదేళ్ల సాయిబాబాతో కలసి పడవ దాటి సమీపంలోని సీలేరు సంతకు వెళ్లాం. సంతలో సరకులు కొనుక్కొని సాయంత్రం నేను, నా బిడ్డ, వదిన బుల్లెమ్మతో సహా ఏడుగురం బెంగాలీ క్యాంపు నుంచి పడవపై స్వగ్రామం పయనమయ్యాం. పడవ నది మధ్యలోకి వెళ్లగానే గాలి రావడంతో అలల తాకిడికి నీరు పడవలో చేరింది. పడవ బరువెక్కి బోల్తాపడింది. మా కళ్లెదుటే మా వదిన బుల్లెమ్మ, మరో మహిళ, ఓ చిన్నారి కొట్టుకుపోయారు. నీటిలో పడిపోయిన మాకు బోల్తాపడిన నావ ఆసరగా లభించడంతో నా బిడ్డతో కలసి దానిని పట్టుకుని అరగంట పాటు అలాగే నదిలోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాను. ఈలోపుగా బెంగాలీ క్యాంపునకు చెందిన బెంగాలీలు మమ్మల్ని గమనించి మరో నావ సాయంతో ఒడ్డుకు చేర్చడంతో ప్రాణాలతో బయటపడ్డాం. ఒడిశాలోని మా గ్రామం నుంచి సీలేరు సంతకు వెళ్లడానికి పడవ ప్రయాణమే దిక్కు. గతంలో కూడా నదిలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుని చాలామంది మృత్యువాత పడ్డారు’’ అంటూ భద్రమ్మ కన్నీళ్ల పర్యంతమయ్యింది. -
మూడు నాటు పడవలు బోల్తా
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపలకంచేరులో ఈదురుగాలులకు సముద్రంలో లంగరువేసివున్న మూడు నాటుపడవలు బోల్తా పడ్డాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విజయనగరం జిల్లాలో సముద్ర తీరప్రాంత కల్లోలంగా మారింది. భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన మత్స్యకార గ్రామాల్లో బలమైన ఈదురు గాలులు వస్తున్నాయి. మరోవైపు సముద్రంలో గాలులు బలంగా వస్తుండటంతో మంగళవారం అర్ధరాత్రి వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. వేట నిలిపివేసి లంగరువేసివున్న మూడు నాటుపడవలు చేపలకంచేరుకు సమీపంలో గాలుల తాకిడికి బోల్తా పడ్డాయి. దీంతో మిగిలిన మత్స్యకారులు వెనక్కి తిరిగొస్తున్నారు. మరోవైపు తీరం వెంబడి బలంగా ఈదురు గాలులు వీస్తున్నాయి . పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా.. రెవెన్యూ అధికారులు ఎవరూ కనీస సమాచారం ఇవ్వలేదని గంగపుత్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.