సీలేరు నదిలో ప్రమాదానికి కారణమైన నాటు పడవలు
తూర్పుగోదావరి, మోతుగూడెం (రంపచోడవరం): వై.రామవరం మండలం మంగంపాడు బెంగాలీ క్యాంపు వద్ద నాటుపడవ మునిగి గల్లంతైన వారి మృతదేహాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం డొంకరాయి పోలీసులు, చింతూరు సీఐ వెంకటేశ్వరావు, మోతుగూడెం ఎస్సై మనోహర్‌జోషి ఆధ్వర్యంలో ఈ చర్యలు కొనసాగాయి. ఆదివారం సాయంత్రం ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్‌గుర్రవూరు గ్రామానికి చెందిన పూస సత్తిబాయి కుటుంబంతో పాటు మరో ముగ్గురు సంతకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఒడిశా సరిహద్దు సమీపంలో సీలేరు నదిలో నాటు పడవపై ప్రయాణం చేస్తుండగా ఈదురు గాలులు వీయడంతో పడవ మునిగిపోయింది. అందులో ఉన్న పూస బుల్లమ్మ, రీతూబాయి, గల్లంతు కాగా రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. పడవలో ఉన్న మరో నలుగురిని స్థానిక బెంగాలీ జాలర్లు రక్షించి ఒడ్డుకు చేర్చారు. భద్రమ్మ అనే మహిళ అపస్మారక స్థితికి చేరడంతో చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. చిన్నారి మృతదేహం లభ్యంకాగా బంధువులకు అప్పగించారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడం, సీలేరు నదిలో నిండుగా నీరు ఉండడంతో గల్లంతైన ఇద్దరి మృతదేహాల గాలింపు చర్యలు కష్టతరమయ్యాయి. ఒడిశాకు చెందిన వారు ఈ ప్రమాదంలో మృతి చెందడంతో అక్కడ అధికారులకు సమాచారాన్ని అందించేందుకు డొంకరాయి పోలీసులు చర్యలు చేపట్టారు. స్థానిక వీఆర్‌ఓ జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు వివరాలను చిత్రకొండ పోలీసులకు సమాచారం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. పడవ మునక ఘటనపై రంపచోడవరం సబ్ కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానిక తహసీల్దార్ ప్రసాద్, సీఐ వెంకటేశ్వరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాల గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని పోలీసులను ఆదేశించారు.
జాడలేని ఒడిశా అధికారులు
ప్రమాదకరమని తెలిసినా సీలేరు నదిని దాటేందుకు ప్రజలు నాటు పడవలనే ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా ఒడిశా సరిహద్దు ప్రాంతం కావడం, సీలేరు నది పక్కనే ఉండడంతో నిత్యవసర సరుకులు కొనుగోలు, ౖవైద్యానికి ఆంధ్రా రావడం పరిపాటిగా మారింది. ఒడిశా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మారుమూల అటవీ ప్రాంతం కావడంతో రోడ్డు సౌకర్యాలు లేక ఆంధ్రాకు నిత్యం పనులపై వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇకనైనా ఇరు రాష్ట్రాల అధికారులు ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్ధానికులు కోరుతున్నారు.
ప్రాణాలతో బయటపడడం పునర్జన్మే
చింతూరు (రంపచోడవరం): ‘‘ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదు. నాకు, నా బిడ్డకు ఇది పునర్జన్మే. ఆ దేవుడే మమ్మల్ని కాపాడాడు’’ అంటోంది సీలేరు నదిలో పడవ ప్రమాద బాధితురాలు గుర్రలూరుకు చెందిన కోస భద్రమ్మ. ప్రస్తుతం ఆమె చింతూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాదం నుంచి తాము ఎలా బయటపడిందీ ఆమె ఇలా ‘సాక్షి’కి వివరించింది. ‘‘నేను నా బిడ్డ పదేళ్ల సాయిబాబాతో కలసి పడవ దాటి సమీపంలోని సీలేరు సంతకు వెళ్లాం. సంతలో సరకులు కొనుక్కొని సాయంత్రం నేను, నా బిడ్డ, వదిన బుల్లెమ్మతో సహా ఏడుగురం బెంగాలీ క్యాంపు నుంచి పడవపై స్వగ్రామం పయనమయ్యాం. పడవ నది మధ్యలోకి వెళ్లగానే గాలి రావడంతో అలల తాకిడికి నీరు పడవలో చేరింది. పడవ బరువెక్కి బోల్తాపడింది. మా కళ్లెదుటే మా వదిన బుల్లెమ్మ, మరో మహిళ, ఓ చిన్నారి కొట్టుకుపోయారు. నీటిలో పడిపోయిన మాకు బోల్తాపడిన నావ ఆసరగా లభించడంతో నా బిడ్డతో కలసి దానిని పట్టుకుని అరగంట పాటు అలాగే నదిలోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాను. ఈలోపుగా బెంగాలీ క్యాంపునకు చెందిన బెంగాలీలు మమ్మల్ని గమనించి మరో నావ సాయంతో ఒడ్డుకు చేర్చడంతో ప్రాణాలతో బయటపడ్డాం. ఒడిశాలోని మా గ్రామం నుంచి సీలేరు సంతకు వెళ్లడానికి పడవ ప్రయాణమే దిక్కు. గతంలో కూడా నదిలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుని చాలామంది మృత్యువాత పడ్డారు’’ అంటూ భద్రమ్మ కన్నీళ్ల పర్యంతమయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment