మరణించగానే మాయం.. ఆమె ఎవరు?
హయత్నగర్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే, అప్పటి వరకూ ఆసుపత్రిలో ఉండి చికిత్స చేయించిన మహిళ అతడి శవాన్ని తీసుకెళ్లకుండా అనాథగా విడిచిపోయింది. హయత్నగర్ ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం... భాగ్యలతకాలనీ వద్ద ఈనెల 9న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడగా.. ధనలక్ష్మి అనే మహిళ ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించింది. అతడి పేరు పి.రామారావు (66), తండ్రి వెంకటయ్య, నివాసం.. హయత్నగర్ పరిధిలోని భాగ్యలతకాలనీ అని రిజిస్టర్లో రాయించింది.
గత తొమ్మిది రోజులుగా ఆసుపత్రిలో ఉండి అతడికి చికిత్స చేయింది. అయితే, ఆరోగ్యం విషమించడంతో వృద్ధుడు సోమవారం మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే అప్పటి వరకూ అతడి వద్దే ఉన్న మహిళ కనిపించకుండాపోయింది. 24 గంటలు గడిచినా ఇప్పటి వరకూ వృద్ధుడి కోసం ఎవరూ రాలేదని, ఫొటోలో ఉన్న ఈ మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ కోరారు.