bogapuram
-
రిసార్ట్స్‌లో మంత్రి రాసలీలలు
ఆయనో యువ మంత్రి. అలా అని ఎక్కడినుంచైనా ఎమ్మెల్యేగా గెలిచారా... అంటే అదేమీ లేదు. అనుకోకుండా ఆ పదవి దక్కింది. వచ్చిన అవకాశాన్ని ఆయన ప్రజాసంక్షేమానికి ఏమేరకు వినియోగించారన్నది పక్కన పెడితే... సొంత అవసరాలకు మాత్రం బాగానే ఉపయోగించుకుంటున్నారు. విలాసాలకోసం... షికార్లకోసం... యథేచ్ఛగా పదవిని అడ్డం పెట్టుకుంటున్నారు. ఏకంగా ఓ రిసార్ట్‌లో తాను తెచ్చుకున్న యువతితో రాసలీలలు సాగించిన వ్యవహారం ఇప్పుడు పోలీసు వర్గాల్లో గుప్పుమంటోంది. ఇంటెలిజెన్స్ విభాగంలో ఈ వ్యవహారం చక్కర్లు కొడుతోంది. సాక్షిప్రతినిధి, విజయనగరం: విశాఖ జిల్లాకు చెందిన ఓ యువ మంత్రి రాసలీలలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. భోగాపురం మండలం, ఎ.రావివలస గ్రామంలో 120 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఓ రిసార్ట్స్ ఉంది. అక్కడ ఒక్క రాత్రి గడపాలంటే రూ.6వేల వరకూ గది అద్దె చెల్లించాలి. ఎక్కడెక్కడి నుంచో ప్రేమ పక్షులు, ప్రముఖులు ఇక్కడికి వచ్చి తమ సరదాలు తీర్చుకుంటుంటారు. ఈ జాబితాలో రాష్ట్ర యువ మంత్రి కూడా చేరారు. విశాఖకు చెందిన ఓ యువతిని తీసుకువచ్చి ఆయన ఆ రిసార్ట్‌లో ఒక రోజు గడిపారు. అయితే వైద్యురాలైన ఆ యువతిని లైంగిక వేధింపులకు గురిచేశారని ఆమె బంధువులు ఆందోళన చేసినట్లు వార్తలు వచ్చా యి. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన ఇంటెలిజెన్స్ అధికారులు మంత్రి, లేడీ డాక్టర్ ఇష్టపూర్వకంగానే ఈ రిసార్ట్స్ లో గడిపినట్లు తేల్చారు. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం యువ మంత్రి గత నెల 15వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు అవివాహితైన లేడీ డాక్టర్‌తో కలసి సన్‌రే రిసార్ట్స్‌కు వచ్చారు. వీరితో పాటు గన్‌మెన్, ఎస్కార్ట్ సిబ్బంది కూడా ఉన్నారు. వీరు బస చేసేందుకు ముందుగా విల్లా లాంటిదేమీ బుక్ చేసుకోలేదు. దీంతో మంత్రి, ఆ యువతి దాదాపు అరగంటపాటు ఏసీ ఇండోర్ స్టేడియంలో ఆడుకున్నారు. అక్కడే రెస్టారెంట్లో మధ్యాహ్న భోజనం చేసి, నాలుగు గదులున్న 9వ నంబర్ విల్లాకు చేరుకున్నారు. వీటిలో 9091, 9092 నంబర్లు గల రూములు మంత్రి పేరుమీద బుక్ చేశారు. వీటిలో యువమంత్రి, యువతి 9091 రూమ్‌లో రెండు గంటలపాటు ఏకాంతంగా గడిపారు. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లి ఓ గంట ఉన్నారు. అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న బీచ్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో మంత్రి కారు నడపగా ఆయన పక్క సీట్లో ఆ యువతి కూర్చుంది. రాత్రి 8.30 గంటలకు వీరు విల్లాకు తిరిగి వచ్చారు. రాత్రి భోజనం చేసి 10.30 గంటలకు విశాఖపట్నం బయలుదేరారు. ఈ మొత్తం విహారంలో మంత్రి, యువతి చాలా దగ్గరగా మెలిగారు. వారితో ఉన్న సహాయకుడి సాయంతో ఫొటోలు తీయించుకున్నారు. ఆ యువతి యువ మంత్రికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని గన్‌మెన్, ఎస్కార్ట్ సిబ్బంది విచారణలో వెల్లడించారు. దీనిని బట్టి ఆ యువతిని లైంగికంగా వేధించినట్లు ఎక్కడా కనిపించలేదని పేర్కొంటూ ఇంటెలిజెన్స్ విభాగం విజయనగరం డీఎస్పీ తన నివేదికను విశాఖ రీజనల్ ఇంటెలిజెన్స్ అధికారికి శనివారం అందజేశారు. కాగా ఒక మంత్రి, తన విలువైన సమయాన్ని, గన్‌మెన్, ఎస్కార్ట్ సిబ్బంది విధులను ఈ విధంగా వ్యక్తిగత విలాసాలకు, సరదాలకు వినియోగించడం కూడా బాధ్యతారాహిత్యమే అవుతుంది. దీనిని ఆ యువమంత్రి, ఎన్నికల్లో గెలవకుండానే ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టిన ముఖ్యమంత్రి ఏ విధంగా సమర్ధించుకుంటారో చూడాలి. -
కొత్త ఎత్తుగడ
భోగాపురం ఎయిర్‌పోర్టుపై రాష్ట్ర ప్రభుత్వం రొజుకో ఎత్తుగడ వేస్తోంది. రైతుల వ్యతిరేకతతో కాసింత వెనక్కి తగ్గి వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. 5311.80 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మిస్తామని గతేడాది ఆగస్టులో ప్రాధమిక నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు 2004ఎకరాలకే పరిమితమని కొత్త పల్లవి అందుకుంది. ఆ మేరకు ఫేజ్1 పేరుతో తుది నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇప్పటికిదే ఫైనల్ అంటూనే తదుపరి సంగతి చెప్పలేమంటున్న అధికార వర్గాల సన్నాయి నొక్కులు సర్కారు వ్యూహాన్ని చెప్పకనే చెబుతున్నాయి. దీనికంతటికీ ఆగస్టు నాటికి ప్రాధమిక నోటిఫికేషన్ కాలం చెల్లనుండటమే కారణం. ఈ లోపే ఎంతో కొంత భూసేకరణ పూర్తి చేయకపోతే మళ్లీ మొదటికొస్తుందనే ఈ నిర్ణయం. సాక్షి ప్రతినిధి, విజయనగరం : భోగాపురం పరిసర ప్రాంతాల్లో 5311.80ఎకరాల్లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తామని గతేడాది ఆగస్టులో సర్కారు ఫ్రిలిమనరీ నోటిఫికేషన్ ఇచ్చింది. తొమ్మిది రెవెన్యూ గ్రామాల పరిధిలో 3686 ఎకరాలను రైతుల నుంచి, 1625.69ఎకరాల ప్రభుత్వ భూమి సేకరిస్తామని అందులో పేర్కొంది. ఆనాటి నుంచి రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నారు. ఆందోళనలు చేస్తూనే న్యాయపోరాటానికి దిగారు. ఉన్నత న్యాయస్థానం కూడా రైతుల అభిప్రాయం లేకుండా ముందుకెళ్లొద్దని మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది. దీంతో అధికారులు భూసేకరణ అడుగులు వేయలేకపోయారు. నాటకీయంగా ప్రిలిమనరీ నోటిఫికేషన్ వాస్తవానికి 2013 కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఎయిర్‌పోర్టు నిర్మించాల్సిందే!. రెండు చాప్టర్ల ప్రకారం ముందుకెళ్లాలి. అందులో ఒకటి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ ప్రకారం గ్రామాల్లో నిర్వాసితుల ఆమోదం మేరకే గ్రామసభలు నిర్వహించాలి. అభ్యంతరం చెబితే మాత్రం గ్రామసభలు నిర్వహించకూడదని చట్టం చెబుతోంది. రెండోది ఫుడ్ సెక్యూరిటీ యాక్టు ప్రకారం ఆయా భూములు వ్యవసాయ యోగ్యమయినవయితే, అక్కడి ప్రజలు వ్యవసాయాన్ని చేసుకునేందుకే ఇష్టపడితే ఆ భూములను సేకరించకూడదు. కానీ ఈ రెండు చాప్టర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సడలింపు ఆర్డినెన్స్ విడుదల చేసింది. ఈ ఆర్డినెన్స్ గతేడాది ఆగస్టు 31 వరకూ అమలులో ఉంటుందని పేర్కొంది. అందుకే 2015 ఆగస్టు 31 అర్ధరాత్రి వరకూ అధికార యంత్రాంగం కుస్తీలు పట్టి ప్రిలిమినరీ నోటిఫికేషన్ వెలువరించింది. ఏడాదిలో ముగియనున్న కాలపరిమితి సాధారణంగా ఫ్రిలిమనరీ నోటిఫికేషన్ కాల పరిమితి ఏడాదే. ఈ లోగా భూసేకరణ చేపట్టాలి. లేదంటే కొత్త భూసేకరణ చట్టం ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాలి. ఒకవేళ రైతులు వ్యతిరేకిస్తే ప్రభుత్వం ముందుకెళ్లడానికి అవకాశం ఉండదు. ప్రస్తుత రైతుల వ్యతిరేకత నేపథ్యంలో ప్రిలిమనరీ నోటిఫికేషన్ ప్రకారం భూసేకరణ చేసే అవకాశం లేదు. ఇదంతా తలనొప్పి వ్యవహారమని, ప్రజా వ్యతిరేకతకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్న భావనతో ప్రభుత్వం ప్రస్తుతానికి కాస్త వెనక్కి తగ్గింది. కొంతమేరకు తగ్గిస్తే రైతులు ముందుకు రావడమే కాకుండా న్యాయపరంగా పోరాటానికి కూడా వెనక్కి తగ్గుతారని ప్రభుత్వం అభిప్రాయపడింది. తుది నోటిఫికేషన్లో కుదింపు సర్కారు తాజాగా 2004ఎకరాలకు కుదిస్తూ తుది నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 1500 ఎకరాలు మాత్రమే రైతుల నుంచి సేకరిస్తామని సంకేతాలను పంపించింది. దీనివల్ల రైతులు కాసింత వెనక్కి తగ్గితే ఏదోలా తొలుత భూసేకరణ కానిచ్చేస్తే తదుపరి సంగతి చూసుకోవచ్చని, కావాలంటే మళ్లీ భూసేకరణ చేసుకోవచ్చనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ వ్యూహంతోనే భూసేకరణకు సిద్ధమవుతోంది. ప్రభుత్వమిచ్చిన తుది నోటిఫికేషన్లో గూడెపువలస, బెరైడ్డిపాలెం, దల్లిపేట తదితర గ్రామాలకు ఊరట లభించినట్టే చెప్పాలి. వాటి శివారు గ్రామాలు మాత్రమే తాజా నోటిఫికేషన్లోకి వచ్చాయి. భూములిచ్చేది లేదు రైతుల అంగీకారం తెలుసుకోకుండా ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు సరికాదు. కోర్టు ఉత్తర్వులను కూడా లెక్కచేయకుండా అధికారులు అనుసరిస్తున్న విధానంతో మేమంతా ఆందోళన చెందుతున్నాం. ఎటువంటి ధర ఇచ్చినా ఎయిర్‌పోర్టుకి భూములు ఇచ్చేది లేదు. - కొల్లి రామ్మూర్తి, రైతు, గూడెపువలస ప్రజాభిప్రాయం తీసుకోవాలి ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో, భూముల్లో ఉన్న రైతులు, గ్రామస్థులు తమ అసమ్మతి పత్రాలను అధికారులకు ఇచ్చినా పట్టించుకోలేదు. మండలంలో అన్ని పంచాయతీల్లో ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసి ఇచ్చినా పట్టించుకోకుండా బలవంతపు భూ సేకరణకు ప్రభుత్వం సిద్దం అవుతుంది. భూములు తీసుకోవాలంటే గ్రామసభలు పెట్టి వారి సమ్మతితోనే తీసుకోవాలి. - కాకర్లపూడి శ్రీనివాసరాజు, ఎయిర్‌పోర్టు వ్యతిరేక కమిటీ సభ్యుడు 2013 చట్టం ప్రకారమే చేయాలి ప్రభుత్వ అవసరాలకు భూమి కావాలంటే 2013 చట్టం ప్రకారం మాత్రమే అధికారులు చర్యలు చేపట్టాలి. అంతే తప్ప ఏకపక్షంగా నియంతృత్వధోరణితో భూములు సేకరిద్దామంటే ఊరుకునేదిలేదు. గ్రామసభలు ఏర్పాటుచేసి 80శాతం మంది అంగీకారం తీసుకోవాలి. అలాగే బహిరంగ మార్కెట్లో ఉన్న ధరకు రెండున్నర రెట్లు అదనంగా అందించాలి. - ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, ఎయిర్‌పోర్టు వ్యతిరేక కమిటీ సభ్యుడు -
'అది ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం'
విశాఖ: విజయనగరం జిల్లా, భోగాపురం వద్ద గ్రీన్ ఫీల్ట్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయడం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమని ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత రామకోటయ్య వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ భోగాపురం ఎయిర్ పోర్టు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. విశాఖ కు మెట్రో వస్తేనే..ఎయిర్ పోర్టు వల్ల లాభం ఉంటుందని ఆయన తెలిపారు. కాగా 5 వేల ఎకరాల్లో ఎయిర్ పోర్టు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కానీ పరిసర ప్రాంతాల రైతులు విమానాశ్రయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. 9 పంచాయతీలు, 8 రెవెన్యూ గ్రామాలు విమానాశ్రయం పరిధిలోకి వస్తాయి. -
5040 ఎకరాల్లో భోగాపురం విమానాశ్రయం
విజయనగరం: భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుపై గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ..5040 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భూసేకరణ, సమీకరణలో రైతులు దేనికి ముందుకు వస్తే ఆ విధానం లో భూమిని సేకరిస్తామని మృణాళిని తెలిపారు. భూమి కోల్పోయిన రైతులకు విమానాశ్రయం సమీపంలోనే ప్రభుత్వ భూములు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. లేని పక్షంలో రాజధాని పరిహారం కంటే ఎక్కువ పరిహారం ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. 9 పంచాయతీలు, 8 రెవెన్యూ గ్రామాలు విమానాశ్రయం పరిధిలోకి వస్తాయని చెప్పారు.