ఆయనో యువ మంత్రి. అలా అని ఎక్కడినుంచైనా ఎమ్మెల్యేగా గెలిచారా... అంటే అదేమీ లేదు. అనుకోకుండా ఆ పదవి దక్కింది. వచ్చిన అవకాశాన్ని ఆయన ప్రజాసంక్షేమానికి ఏమేరకు వినియోగించారన్నది పక్కన పెడితే... సొంత అవసరాలకు మాత్రం బాగానే ఉపయోగించుకుంటున్నారు. విలాసాలకోసం... షికార్లకోసం... యథేచ్ఛగా పదవిని అడ్డం పెట్టుకుంటున్నారు. ఏకంగా ఓ రిసార్ట్‌లో తాను తెచ్చుకున్న యువతితో రాసలీలలు సాగించిన వ్యవహారం ఇప్పుడు పోలీసు వర్గాల్లో గుప్పుమంటోంది. ఇంటెలిజెన్స్ విభాగంలో ఈ వ్యవహారం చక్కర్లు కొడుతోంది.
సాక్షిప్రతినిధి, విజయనగరం: విశాఖ జిల్లాకు చెందిన ఓ యువ మంత్రి రాసలీలలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. భోగాపురం మండలం, ఎ.రావివలస గ్రామంలో 120 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఓ రిసార్ట్స్ ఉంది. అక్కడ ఒక్క రాత్రి గడపాలంటే రూ.6వేల వరకూ గది అద్దె చెల్లించాలి. ఎక్కడెక్కడి నుంచో ప్రేమ పక్షులు, ప్రముఖులు ఇక్కడికి వచ్చి తమ సరదాలు తీర్చుకుంటుంటారు. ఈ జాబితాలో రాష్ట్ర యువ మంత్రి కూడా చేరారు. విశాఖకు చెందిన ఓ యువతిని తీసుకువచ్చి ఆయన ఆ రిసార్ట్‌లో ఒక రోజు గడిపారు. అయితే వైద్యురాలైన ఆ యువతిని లైంగిక వేధింపులకు గురిచేశారని ఆమె బంధువులు ఆందోళన చేసినట్లు వార్తలు వచ్చా యి. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన ఇంటెలిజెన్స్ అధికారులు మంత్రి, లేడీ డాక్టర్ ఇష్టపూర్వకంగానే ఈ రిసార్ట్స్ లో గడిపినట్లు తేల్చారు.
ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం
యువ మంత్రి గత నెల 15వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు అవివాహితైన లేడీ డాక్టర్‌తో కలసి సన్‌రే రిసార్ట్స్‌కు వచ్చారు. వీరితో పాటు గన్‌మెన్, ఎస్కార్ట్ సిబ్బంది కూడా ఉన్నారు. వీరు బస చేసేందుకు ముందుగా విల్లా లాంటిదేమీ బుక్ చేసుకోలేదు. దీంతో మంత్రి, ఆ యువతి దాదాపు అరగంటపాటు ఏసీ ఇండోర్ స్టేడియంలో ఆడుకున్నారు. అక్కడే రెస్టారెంట్‌లో మధ్యాహ్న భోజనం చేసి, నాలుగు గదులున్న 9వ నంబర్ విల్లాకు చేరుకున్నారు. వీటిలో 9091, 9092 నంబర్లు గల రూములు మంత్రి పేరుమీద బుక్ చేశారు. వీటిలో యువమంత్రి, యువతి 9091 రూమ్‌లో రెండు గంటలపాటు ఏకాంతంగా గడిపారు. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లి ఓ గంట ఉన్నారు. అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న బీచ్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో మంత్రి కారు నడపగా ఆయన పక్క సీట్లో ఆ యువతి కూర్చుంది. రాత్రి 8.30 గంటలకు వీరు విల్లాకు తిరిగి వచ్చారు.
రాత్రి భోజనం చేసి 10.30 గంటలకు విశాఖపట్నం బయలుదేరారు. ఈ మొత్తం విహారంలో మంత్రి, యువతి చాలా దగ్గరగా మెలిగారు. వారితో ఉన్న సహాయకుడి సాయంతో ఫొటోలు తీయించుకున్నారు. ఆ యువతి యువ మంత్రికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని గన్‌మెన్, ఎస్కార్ట్ సిబ్బంది విచారణలో వెల్లడించారు. దీనిని బట్టి ఆ యువతిని లైంగికంగా వేధించినట్లు ఎక్కడా కనిపించలేదని పేర్కొంటూ ఇంటెలిజెన్స్ విభాగం విజయనగరం డీఎస్పీ తన నివేదికను విశాఖ రీజనల్ ఇంటెలిజెన్స్ అధికారికి శనివారం అందజేశారు. కాగా ఒక మంత్రి, తన విలువైన సమయాన్ని, గన్‌మెన్, ఎస్కార్ట్ సిబ్బంది విధులను ఈ విధంగా వ్యక్తిగత విలాసాలకు, సరదాలకు వినియోగించడం కూడా బాధ్యతారాహిత్యమే అవుతుంది. దీనిని ఆ యువమంత్రి, ఎన్నికల్లో గెలవకుండానే ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టిన ముఖ్యమంత్రి ఏ విధంగా సమర్ధించుకుంటారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment