‘బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్’లో మేజిక్ మధు
జిన్నూరు (పోడూరు), న్యూస్‌లైన్ : పోడూరు మండలం జిన్నూరు జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు, మెజీషియన్ ఖండవల్లి మధుసూదనరావుకు ‘బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్’లో స్థానం లభించింది. గతేడాది డిసెంబర్ 12న ప్రపంచశాంతి, సామాజిక చైతన్యం కోసం 12 గంటల 12 నిముషాల 12 సెకన్లకు వీరవాసరం మండలం రాయకుదురులో కళ్లకుగంతలు కట్టుకుని 12 కి.మీ.దూరం 12 మోటర్ సైకిళ్లు మారుతూ 12 ఫైర్రింగ్లను దాటుకుంటూ మధుసూదనరావు విన్యాసం చేశారు. ఇందుకు ఆయనకు అరుదైన గౌరవం అభించింది. జెడ్పీ హైస్కూల్లో బుధవారం జ్యూరీ మెంబర్ చింతా శ్యామ్‌కుమార్ (శ్యామ్ జాదూగర్) నుంచి ‘బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్’ ధ్రువీకరణపత్రాన్ని మధు అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేజిక్ విద్యను మూఢనమ్మకాలను పారద్రోలేందుకు, ఎయిడ్స్ నివారణ, పర్యావరణ పరిరక్షణ, నీటి కాలుష్యం, విద్య, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వినియోగిస్తున్నట్టు చెప్పారు. వాకర్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఆకి రామకృష్ణ, జీవీ సుబ్బారావు, హైస్కూల్ హెచ్ఎం సీహెచ్ సురేష్‌బాబు, వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, ఆనందరావు, కలిదిండి వెంకటపతివర్మ, మెజీషియన్లు ప్రవీణ్, లిఖిత ఆయన్ను అభినందించారు.