Papaya Farming: బొప్పాయి.. ఇలా పండిస్తే లక్షల్లో లాభాలు, ఫుల్ డిమాండ్
సంప్రదాయ పంటలతో విసిగిన రైతన్న ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండే పండ్లలో బొప్పాయి ఒకటి. బొప్పాయి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో గిరాకీ ఉన్న బొప్పాయి పంటను సాగు చేసేందుకు బాపట్ల జిల్లాలో రైతులు మొగ్గుచూపుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతికూల పరిస్థితులను అధిగమించి బొప్పాయి పంటను జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తూ లాభాల బాటలో నడుస్తున్నారు బొప్పాయి రైతులు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించి బొప్పాయిని సాగు చేసుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చని తద్వారా రైతులకు లాభాలు వస్తాయని ఉద్యానశాఖ అధికారిణి దీప్తి పేర్కొన్నారు.
324 ఎకరాల్లో బొప్పాయి సాగు
జిల్లాలోని కొల్లూరు మండలంలో 9.02, భట్టిప్రోలులో 18.23, సంతమాగులూరులో 155.74, బల్లికురవ 45.54, మార్టూరు 12.85, యద్దనపూడి 11.79, జే.పంగులూరు 21.93, అద్దంకి 32.18, కొ రిశపాడు 16.74 ఎకరాల్లో బొప్పాయి సాగు చేస్తున్నారు. రెండు సంవత్సరాల పంటకాలంలో ఎకరాకు 90 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. పెట్టుబడి ఖర్చుపోను నికరంగా రూ.2లక్షల వరకు ఆదాయం రావడంతో జిల్లా రైతులు బొప్పాయి సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే గతంలో నామమాత్రంగా సాగు చేపట్టిన బొప్పాయి ఈ ఏడాది అత్యధికంగా 324 ఎకరాలకు పైగా సాగు చేపట్టారు. బొప్పాయి సాగులో రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టడం వలన పండిన పంట ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కాయలకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని రైతులు చెప్తున్నారు.
అనుకూలమైన రకాలతో మంచి దిగుబడి
జిల్లాలో సాగు చేపట్టాలనుకునే రైతులు రెడ్ లేడీ, వాషింగ్టన్, కో 1,2,3 రకాలు అనువైనవి. బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత ట్రైకోడెర్మావిరిడితో విత్తనశుద్ధి చేసుకోవాలి. మొక్కలు నాటే సమయంలో గుంతల్లో ప్రతి గుంతకూ 20 కిలోల పశువుల ఎరువు, 20 గ్రాముల అజోప్పైరిల్లమ్, 20 గ్రాముల ఫాస్ఫోబాక్టీరియా, 40 గ్రా ముల మైకోరైజాను బాగా కలుపుకొని వేసుకోవాలి. నాటే సమయం జూన్, జులై, అక్టోబర్, నవంబర్ మాసాల్లో నాటుకోవచ్చు. 40 నుంచి 60 రోజుల వయస్సున్న 15 సెంటీమీటర్ల పొడవు గల మొక్కలను సాయంత్రం సమయంలో నాటుకోవాలి.
ఎరువుల యాజమాన్యం
ప్రతి మొక్కకూ రెండు కిలోల నాడెప్ కంపోస్టు, ఒక కిలో వేపపిండి, అర కిలో ఘనజీవామృతం వేసుకొని మొక్కలను నాటుకోవాలి. తరువాత ప్రతి 20 రోజులకు ఒకసారి ద్రవ జీవామృతాన్ని పారించుకోవాలి. మొక్కలపై ప్రతి 15 రోజుల కొకసారి పంచగవ్యను పిచికారీ చేసుకోవాలి. ప్రతి 25 రోజులకు ఒకసారి శొంఠి పాల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి.
బొప్పాయిలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక లాభాలు సాధించవచ్చు. ప్రకృతి సాగు చేయడం వలన కాయలు బరువుగా నాణ్యత కలిగి ఉంటాయి. వేసవిలో కూడా బెట్టకు రాకుండా అధిక దిగుబడులు వస్తాయి. అలాగే పండుగ సమయాల్లో టన్ను రూ.22 వేల వరకు పలుకుతుంది. మార్కెట్లో కిలో బొప్పాయి రూ.90 వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్ లేని సమయంలో కూడా టన్ను రూ.10 నుంచి 15 వేలు ధర పలుకుతుంది.
– దీప్తి, ఉద్యానశాఖ అధికారిణి