వెనక్కి తగ్గిన పాక్.. ఆగుతున్న కాల్పులు!
అంతర్జాతీయంగా విపరీతమైన ఒత్తిడి వస్తుండటంతో పాకిస్థాన్ వెనక్కి తగ్గుతోంది. జమ్ము కాశ్మీర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దుల్లో గత వారం రోజులుగా విపరీతంగా కాల్పులు, బాంబుదాడులకు పాల్పడుతూ పౌర ఆవాస ప్రాంతాల్లో కూడా భయాందోళనలు కలిగిస్తున్న పాకిస్థాన్ విషయంలో భారత్ సహా అన్ని దేశాలు విపరీతమైన ఒత్తిడి తెచ్చాయి. దీంతో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ జాతీయ భద్రతా మండలితో శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేసి, తర్వాత ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా, ఇప్పటికే అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ రేంజర్ల వైపు నుంచి కాల్పులు భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. బీఎస్ఎఫ్ దళాలు అంతలా తిరగబడతాయని కూడా పాక్ దళాలు ఊహించలేదు. వాస్తవానికి పాక్ బలగాలకంటే రెట్టింపు సంఖ్యలో సరిహద్దుల్లో భారత సైన్యం ఉంది. తొలుత కొంత ఊరుకున్నా.. ప్రధాని వైపు నుంచి దీటుగా స్పందించాలన్న సంకేతాలు రావడంతో భారీగా విరుచుకుపడ్డారు.
ఈ కాల్పులకు భారతదేశమే కారణమని, తాము ముందు కాల్పులు ప్రారంభించలేదని పాక్ చేస్తున్న వాదనలను భారత రక్షణ వర్గాలు తిప్పికొట్టాయి. మరోవైపు ఇరువైపులా పౌరులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక కాల్పులను ఇప్పటికిప్పుడే ఆపేందుకు శుక్రవారం నాటి సమావేశంలో పాక్ ఓ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.