bowl out
-
బౌలౌట్‌లో ఇప్పటికీ ఓడించలేకపోతుంది.. పాపం పాకిస్తాన్
2007లో తొలిసారి నిర్వహించిన టి20 ప్రపంచకప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించి విజేతగా అవతరించిన టీమిండియా తొలి టి20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. అంతకముందు ఇదే ప్రపంచకప్‌లో టీమిండియా, పాకిస్తాన్‌లు గ్రూఫ్ దశలోనే తలపడ్డాయి. అయితే ఆ మ్యాచ్ టై కావడం.. ఆ తర్వాత బౌలౌట్‌లో విజేతను తేల్చడం అభిమానులు ఇప్పటికి గుర్తుపెట్టుకున్నారు. టీమిండియా, పాకిస్తాన్ల మధ్య అప్పటివరకు ఎన్నో మ్యాచ్‌లు జరిగినప్పటికి.. బౌలౌట్ మ్యాచ్‌కు మాత్రం చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది. విషయానికి వస్తే.. తాజాగా వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా టి20 ప్రపంచకప్ 2022లో అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్‌లు మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరుదేశాల అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. పాక్ మాత్రం మరో విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు నెలరోజుల సమయం ఉన్నప్పటికి ఆసక్తి మాత్రం తారాస్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా, పాకిస్తాన్‌కు చెందిన దిగ్గజ క్రికెటర్లు 2007 బౌలౌట్ ఫ్లాష్‌బ్యాక్ పేరిట వీడియోనూ రూపొందించారు. ఈ వీడియోలో బౌలౌట్ ద్వారా ఫలితాన్ని నిర్ణయించాలనుకున్నారు. కాగా భారత్ తరపున దిగ్గజాలు సునీల్ గావస్కర్, శివరామకృష్ణన్, వివిఎస్ లక్ష్మణ్‌లు పాల్గొనగా.. పాకిస్తాన్ నుంచి రమీజ్ రాజా, షోయబ్ అక్తర్, అమీర్ సోహైల్‌లు ఉన్నారు. బౌలౌట్‌లో తొలి బంతిని పాకిస్తాన్ నుంచి రమీజ్ రాజా వేయగా మిస్ అయింది. ఇక భారత్ నుంచి సునీల్ గావస్కర్ వేయగా వికెట్లకు తాకడంతో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో ప్రయత్నంలో పాకిస్తాన్ నుంచి అమీర్ సోహైల్ వేయగా.. ఈసారి కూడా గురి తప్పింది.. ఇక భారత్ నుంచి సొగసరి బ్యాటర్ వివిఎస్ లక్ష్మణ్ వేయగా.. గురి తప్పలేదు.. భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ముచ్చటగా మూడోసారి పాక్ తరపున షోయబ్ అక్తర్ వేయగా.. బంతి చాలా దూరం నుంచి వెళ్లింది. ఇక చివరగా భారత్ నుంచి శివరామకృష్ణన్ వేయగా.. నేరుగా బంతి వికెట్లను గిరాటేసింది. అంతే భారత్ 3-0తో బౌలౌట్‌లో విజయం సాధించింది. ఆ తర్వాత పాక్ ఆటగాళ్లు.. భారత్ దిగ్గజాలకు అభినందనలు తెలిపారు. 2007 bowl out flashbacks 😂 pic.twitter.com/eQOy3YoaRd — Out Of Context Cricket (@GemsOfCricket) September 17, 2022 దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు మాత్రం వినూత్నంగా స్పందించారు. ''2007లో పాకిస్తాన్ తొలిసారి బౌలౌట్‌లో ఓడిపోయింది. అప్పటినుంచి ఇప్పటివరకు బౌలౌట్‌లో ఓడిపోతూనే వస్తుంది''.. ''ఎన్నిసార్లు బౌలౌట్లు నిర్వహించినా విజయం టీమిండియాదే..'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక అప్పటి బౌలౌట్ విషయానికి వస్తే.. 2007 టి20 ప్రపంచకప్‌లో టీమిండియా స్కాట్లాండ్తో తొలి మ్యాచ్ ఆడాల్సింది. కానీ వర్షం కారణంగా రద్దు కావడంతో తర్వాతి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కొంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండయా 141 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో అన్నే పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో అప్పటి నిబంధనల ప్రకారం బౌల్ ఔట్‌కు వెళ్లా్ల్సి వచ్చింది. అంతర్జాతీయ టీ20ల చరిత్రలో బౌలౌట్ నిర్వహించడం ఇది రెండోసారి మాత్రమే.పాకిస్థాన్ బౌలర్లు ముగ్గురూ ఒక్కసారి కూడా వికెట్లను పడగొట్టలేకపోగా.. భారత్ తరఫున వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, రాబిన్ ఉతప్ప ఒక్కో బాల్ వేసి వికెట్లను పడగొట్టారు. దీంతో 3-0 తేడాతో భారత్ గెలుపొందింది. ఆ తర్వాత బౌలౌట్ స్థానంలో సూపర్ ఓవర్ తీసుకొచ్చారు. మరో విషయం ఏంటంటే.. బౌటౌట్ సమయంలో పాకిస్థాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ మాములుగానే వికెట్ల వెనుక నిలబడగా.. ధోనీ మాత్రం తెలివిగా.. బౌలర్ల ఏకాగ్రత చెదరకుండా ఉండటం కోసం వికెట్ల వెనుక మోకాళ్ల మీద కూర్చున్నాడు. ఇది భారత్ విజయానికి ఎంతో ఉపయోగపడిందని చెప్పొచ్చు. -
పాక్‌పై ‘బౌలౌట్’ విజయం.. క్రెడిట్ అతడిదే!
హైదరాబాద్: టీ20 ప్రపంచకప్-2007లో భాగంగా లీగ్దశలో పాకిస్తాన్‌పై ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రత్యేక విజయాన్ని టీమిండియా నమోదు చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ చూడనిది.. ప్రస్తుత క్రికెట్లోనూ కనిపించని ‘బౌలౌట్’ అనే కొత్త విధానంతో ధోని నాయకత్వంలోని అప్పటి యువ భారత జట్టు అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు, వెటరన్ క్రికటెర్ రాబిన్ ఊతప్ప ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ జట్టు నిర్వహించిన ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆనాటి మధుర స్మృతులను గుర్తుచేసుకున్నాడు. ‘బౌలౌట్ విజయం ఎప్పటికీ ప్రత్యేకమనే చెప్పాలి. పాక్‌పై ఈ విధానంతో గెలిచామంటే పూర్తి క్రెడిట్ అప్పటి సారథి, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనికే దక్కుతుంది. ఎందుకంటే టోర్నీ ఆరంభానికి ముందు ధోని అందరిచేత ‘బౌలౌట్’ ప్రాక్టీస్ చేయించాడు. అంతేకాకుండా మ్యాచ్ టై అయి ఫలితం కోసం బౌలౌట్‌కు వెళ్లినప్పుడు వికెట్ల వెనకాల ధోని చేసిన కీపింగ్ విధానం వెరీవెరీ స్పెషల్ అని చెప్పాలి. పాక్ కీపర్ కమ్రాన్ ఆక్మల్ రెగ్యులర్‌గా వికెట్ల వెనకాల నిల్చుంటే.. ధోని మాత్రం విభిన్నంగా వికెట్ల వెనకాల కూర్చొని ఉన్నాడు. దీంతో మేము ధోనిని లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ చేసి సులువుగా స్టంప్స్ పడగొట్టాము. అందుకే ఆ విజయం క్రెడిట్ ధోనికే దక్కుతుంది’ అని ఊతప్ప వ్యాఖ్యానించాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్-పాక్ జట్ల స్కోర్లు సమమవ్వడంతో అందరిలో ఒకటే ఉత్కంఠ. అంపైర్లు బౌలౌట్ విధానం ద్వారా ఫలితాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం టీమిండియా సెహ్వాగ్, ఊతప్ప, శ్రీశాంత్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్‌సింగ్ పేర్లను ప్రకటించగా.. పాకిస్థాన్ జట్టు ఉమర్‌గుల్, సోహైల్ తన్వీర్, అరాఫత్, షాహిద్ అఫ్రిది, అసిఫ్‌లను ఎంచుకుంది. తొలి బంతిని సెహ్వాగ్ బౌల్డ్ చేయగా పాక్ బౌలర్ అరాఫత్ మిసయ్యాడు. రెండో బంతిని హర్భజన్‌సింగ్ వేయగా అది కూడా వికెట్లను తాకింది. ఇక ఉమర్‌గుల్ వేసిన రెండో బంతి సైతం వికెట్లను తాకలేదు. రాబిన్ ఊతప్ప మూడో బంతిని బౌల్డ్ చేయగా షాహిద్ అఫ్రిదీ దాన్ని కూడా వృథా చేశాడు. దీంతో ఒక్కసారిగా ధోనీసేనతో పాటు యావత్ భారత దేశం గెలుపు సంబరాల్లో మునిగిపోయింది. చదవండి: 'ఆ నిర్ణయం నా కెరీర్‌ను ముంచేసింది' 'తండ్రిగా నా కోరికలు నెరవేర్చుకుంటున్నా' View this post on Instagram An MSD masterclass & some practice 👉 @indiancricketteam's successful Bowl Out in the 2007 WT20 Watch @robinaiyudauthappa on EP 8 of the Royals Podcast. Airing now on our Facebook page. #HallaBol | #RoyalsFamily | @mahi7781 A post shared by Rajasthan Royals (@rajasthanroyals) on May 19, 2020 at 7:29am PDT -
భారత్-పాక్ టీ20.. ఓ అద్భుతం
సాక్షి, స్పోర్ట్స్: క్రికెట్ చరిత్రలో అభిమానులు కొత్త అనుభూతి చెందిన రోజు. టీ20 ఫార్మటే కొత్తగా అనిపిస్తున్న తరుణంలో అందరినీ ఆశ్యర్చపరిచింది.. ఎప్పుడూ వినని, చూడని ‘బౌల్ ఔట్’ . అప్పట్లో మ్యాచ్ టై అయితే ఇరుజట్లకు చెరో పాయింట్.. అదే ఇప్పుడు సూపర్ ఓవర్. కానీ 2007 టీ20 ప్రపంచకప్‌లో ‘బాల్ ఔట్’ అనే కొత్త విధానం క్రీడా జనాలను ఆకట్టుకుంది. ఈ విధానంతో బొక్క బోర్లాపడ్డ జట్టు పాక్ అయితే గెలిచిన జట్టు టీమిండియా. సరిగ్గా 11ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ప్రపంచ కప్‌లో భాగంగా గ్రూప్ దశలో పాకిస్తాన్‌పై టీమిండియా గెలిచింది బాల్ ఔట్ విధానంతోనే. దానికి సంబంధించిన వీడియో ఐసీసీ ట్వీట్ చేసింది. కొత్తగా సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంఎస్ ధోనికి అసలు సవాలు 2007 టీ20 ప్రపంచకప్‌లో ఎదురైంది. కొత్త ఆట, యువ ఆటగాళ్లు, ప్రత్యర్థులకు అప్పటికే అలవాటైన ‘బాదుడు’ ఆట. కానీ పక్కావ్యూహాలు అమలు చేసి టీమిండియా సగర్వంగా విశ్వవిజేతగా నిలిచింది. అయితే గ్రూప్ దశలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ మాత్రం ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది పాక్. మహ్మద్ ఆసిఫ్(4/18) చెలరేగి బౌలింగ్ చేసినా.. ఊతప్ప(50), ధోని(33)లు రాణించటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. అనంతరం 142 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన పాక్.. టీమిండియా బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్లు కోల్పోయి 141 పరుగులే చేసింది. ‘బౌల్ ఔట్’తో విజయం అందరూ మ్యాచ్ టై అయిందని నిరుత్సాపడుతున్న సమయంలో ఐసీసీ కొత్తగా ప్రవేశ పెట్టిన ‘బౌల్ ఔట్’ విధానం అందరినీ ఆకట్టుకుంది. కొత్త విధానం ప్రకారం టీమిండియా ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, రాబిన్ ఊతప్ప, హర్భజన్ సింగ్‌లు నేరుగా బంతి వికెట్లను తాకేలా బౌలింగ్ చేయగా.. పాక్ బౌలర్లు యాసిర్ ఆరాఫత్, ఉమర్ గుల్, షాహిద్ ఆఫ్రిదిలు విఫలమయ్యారు. దీంతో టీమిండియా 3-0 తేడాతో విజయం సాధించింది. ✅ @virendersehwag ❌ @YasArafat12 ✅ @harbhajan_singh ❌ @mdk_gul ✅ @robbieuthappa ❌ @SAfridiOfficial#OnThisDay in 2007 India v Pakistan at #WT20 finished in a tie… and India won the bowl-out! pic.twitter.com/sN2dZMyLN2 — ICC (@ICC) 14 September 2018 -
అభిమానుల చేతిలో ‘క్లీన్ బౌల్డ్’
అలరించిన ‘సన్‌రైజర్స్’ ఆటగాళ్లు మాదాపూర్, న్యూస్‌లైన్: క్రికెట్ ప్రేమికులు తమ అభిమాన ఆటగాళ్లను ఔట్ చేశారు. ఇక్కడి ఇనార్బిట్ మాల్లో కింగ్‌ఫిషర్ బెవరేజెస్ ఆధ్వర్యంలో జరిగిన ‘బౌల్ ఔట్’ కార్యక్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు సందడి చేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో రైజర్స్ సభ్యులు హెన్రిక్స్, నమన్ ఓజా, కరణ్ శర్మ పాల్గొన్నారు. అభిమానులు ఒక్కొక్కరికి మూడు బంతుల చొప్పున బౌలింగ్ చేసే అవకాశాన్ని నిర్వాహకులు కల్పించారు. ఇందుకోసం ఆన్‌గ్రౌండ్, డిజిటల్ పోటీ ద్వారా పది మందిని, ఇనార్బిట్ మాల్లో మరో ఐదుగురిని ఎంపిక చేశారు. వీరంతా ఐపీఎల్ క్రికెటర్లను క్లీన్‌బౌల్డ్ చేసే పనిలో పడ్డారు. మొదటి బంతికి ఔట్ చేస్తే రూ.50 వేలు, రెండు, మూడు బంతులకు బౌల్డ్ చేస్తే రూ. 10 వేల నగదు బహుమతి అందజేశారు. ఇందులో నగరానికి చెందిన భాస్కర్, జెస్సికాలు తొలి బంతిలోనే నమాన్ ఓజాను బౌల్డ్ చేయడంతో చెరో రూ. 50 వేల నగదు లభించింది. మరో క్రికెటర్ హెన్రిక్స్‌ను సతీష్ రెండో బంతికి ఔట్ చేయడంతో రూ. 10 వేలు అందుకున్నాడు. ఐపీఎల్ ఆటగాళ్లను అవుట్ చేసి నగదు గెలుచుకోవడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.