కేజీబీవీ విద్యార్థిని అదృశ్యం
గూడూరు : గూడూరు శివారు బ్రాహ్మణపల్లిలోని కస్తూర్భాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి అదృశ్యమైన ఓ బాలిక సోమవారం ఉదయం ప్రత్యక్షమైనట్లు తెలిసింది. వివరాలిలా.. మట్టెవాడకు చెందిన బాలిక స్థానిక కేజీబీవీలో 6వ తరగతి చదువుతోంది. ఆదివారం సాయంత్రం బాలిక తల్లి పాఠశాలకు వచ్చి, కూతురును కల్సి, తనకు జ్వరం వస్తోందని చెప్పింది. కూతురును బాగా చదువుకోమ్మని చెప్పి వెళ్లింది. కాగా, బాలిక రాత్రి ఎవరికీ చెప్పకుండా గేటు దూకి బయటికి వెళ్లిందని, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బ్రాహ్మణపల్లిలోని ఆమె పిన్ని ఇంటి వద్ద నిలబడి ఉందని తెలిసింది. ఆదే సమయంలో పాఠశాలకు పాల వ్యాన్ వస్తుండగా, ముందుగా వస్తున్న పనిమనిషికి బాలిక కనిపించింది. ‘ఈ సమయంలో ఇక్కడ ఎందుకు ఉన్నావ్, ఏం చేస్తున్నావ్, ఎలా వచ్చావ్’ అని మందలించి తనతో పాఠశాలకు తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ మాధవిని వివరణ కోరగా బాలిక తల్లిపై బెంగతో ఉదయం 3 గంటలకు గేటు దూకి పిన్ని వాళ్లింటికి వెళ్లిందని, గుర్తించిన పనిమనిషి వెంటనే పాఠశాలకు తీసుకొచ్చిందని తెలిపారు.