‘మహిళల్ని అవమానించిన కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి’
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుపై మంత్రులు పొన్నం, సీతక్కలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ మహిళలకు కేటీఆర్ తక్షణమే క్షమాపణలు చెప్పాలంటున్నారు వాళ్లు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బస్సుల్లో బ్రేక్ డాన్స్ లు, రికార్డింగ్ డాన్స్ లు చేసుకోవచ్చు అని కేటీఆర్ అత్యంత జుగుప్సకరంగా మాట్లాడారంటూ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు.‘‘మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్?. ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు. మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్ లు చేస్తున్నారా?. మీ బుర్రలో వున్న బురదకు నిదర్శనం ఈ వ్యాఖ్యలు. గత పది సంవత్సరాలు హైదరాబాద్‌లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నాం. అందులో భాగంగా పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నాం.గుమ్మడికాయ దొంగలు అంటే కేటీఆర్ భుజాలు తడుముకోవడం ఎందుకు?. ఉచిత బస్సు ప్రయాణ ఆలోచన మీకు రాలేదు. ప్రజలకు ఉపయోగపడే పథకాలు మీకు నచ్చవు. మేం చేస్తే దాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీలో ప్రయాణాలు చేసేవాళ్లు తప్పుడు పనులు చేస్తున్నారన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. శ్రమజీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృధా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటి?. ఇంటి వద్ద చేసుకునే చిన్నా చితక పనులు బస్సుల్లో చేసుకుంటే... వారిని బ్రేక్ డాన్స్ లు వేసుకోమనడం దుర్మార్గం. కేటీఆర్, ఆయన బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాల్సిందే అని సీతక్క అన్నారు.మరోవైపు రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. మహిళల ఉచిత ప్రయాణ పథకాన్ని కేటీఆర్ అవమానపరుస్తున్నారు. అల్లం, ఉల్లి పొట్టు తీసుకుంటున్నట్లు ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు బ్రేక్ డాన్స్‌లు చేసుమంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. రాష్ట్ర, కేంద్ర మహిళా కమిషన్లు తక్షణమే కేటీఆర్‌పై కేసు నమోదు చేయాలి అని మంత్రి పొన్నం అన్నారు.