గజ..గజ
భువనగిరి, న్యూస్‌లైన్: మూడు రోజులుగా చలి తీవ్రత అధికం కావడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పడమర, ఉత్తరం వైపు నుంచి వీస్తున్న బలమైన చలిగాలులతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాలేకపోతున్నారు. అలాగే ఉత్తర భారతం నుంచి విపరీతంగా వీస్తున్న చలిగాలులతో ప్రజలు వణికిపోతున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల నుంచి 14 డిగ్రీల కనిష్టస్థాయికి చేరాయి.
రోజురోజుకూ ఉష్ణోగ్రతలు క్షీణిస్తుండడంతో ప్రజలు చలి నుంచి రక్షించుకోవడానికి ప్రత్నామ్నాయమార్గాలను అవలంబిస్తున్నారు. ప్రధానంగా శనివారం ఉదయం నుంచి చలి ప్రభావం విపరీతంగా కనిపిస్తోంది. దీంతో ఉదయం వేళపనులకు వెళ్లేవారు, రాత్రి పూట విధుల్లో ఉన్న వారు చలికి గజగజలాడుతున్నారు. కొందరు అందుబాటులో ఉన్న ఉన్ని దుస్తులను వాడుతున్నారు.
రోగాల బారిన పడే అవకాశం
పేద కుటుంబాల్లో చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకునేవారు లేక చలి గాలులతో జలుబు, దగ్గు, అస్తమా, నిమోనియా వంటి శ్వాస సంబంధమైన రోగాల బారిన పడుతున్నారు. ఈ సమస్యలు పసి పిల్లల్లో మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మధ్యాహ్నం చలితోపాటు ఎండ
సాయంత్రం నుంచి ఉదయం 10 గంటల వరకు చలి ప్రభావం తీవ్రంగా చూపుతుండగా, మధ్యాహ్నం వేళ ఎండ వేడిమితో పాటు చలి కూడా ఉంటోంది. వాతావరణంలో వస్తున్న మార్పులతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.
ఉన్ని దుస్తులకు పెరిగిన గిరాకీ
ఒక్కసారిగా పెరిగిన చలినుంచి తట్టుకోవడానికి ప్రజలు ఉన్ని వస్త్రాలను ఆశ్రయిస్తున్నారు. పాత వాటిని బయటకు తీయడంతోపాటు కొత్తవాటిని కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు.