లెక్కల్లో చిక్కులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఏ పద్దులోనైనా గత ఏడాది ముగింపు నిల్వను ఈ ఏడాది ప్రారంభ నిల్వగా చూపిస్తారు. కానీ జిల్లా పరిషత్, జిల్లా ఆడిట్ అధికారులు గత ఏడాది ముగింపు నిల్వకు, ఈ ఏడాది ప్రారంభ నిల్వకు సంబంధం లేకుండా పంచాయతీరాజ్ ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చారు. జిల్లా పరిషత్‌కు మంజూరైన బీఆర్జీ నిధుల యుటిలైజేషన్ సర్టిఫికెట్(యూసీ)ల విషయంలో వింతగా వ్యవహరించారు. 2011-12లో మంజూరై న నిధుల్లో వ్యయం పోను సుమారు రూ.76.22 లక్షలు ముగింపు నిల్వ చూపించారు. ఈ క్రమంలో ఆ మొత్తాన్ని 2012-13లో ప్రారంభం నిల్వగా చూపిం చాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా రూ.8.39 కోట్లు ప్రారంభ నిల్వగా ఉన్నతాధికారులకిచ్చిన యూసీలో చూపించారు. దీంతో వారు పంపించిన నివేదికలో కోట్లలో తేడా కనిపించింది.
ఇప్పటికే కోట్లాది రూపాయల నిధుల స్వాహా
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం వస్తున్న బీఆర్జీ నిధులు జిల్లాలో ఇప్పటికే స్వాహా అయ్యాయి. బీఆర్జీ నిధులను సింగిల్ సిగ్నేచర్‌తో సర్పంచ్‌లు డ్రా చేసే అవకాశం ఉం డడంతో పనులు చేపట్టకుండానే అడ్వాన్సుల కింద ఇప్పటివరకు రూ.7.06కోట్లు స్వాహా చేశారు. అందులో అతి కష్టం మీద కేసులు పెట్టి రూ.5.43కోట్లు రికవరీ చేశారు. ఇంకా రూ.1.63కోట్లు మేర బకాయి ఉండిపోయింది. ఇప్పుడా నిధులొచ్చే పరిస్థితి కన్పించడం లేదు.
తాజాగా అంకెల కనికట్టు
2006 నుంచి అమలవుతున్న బీఆర్జీఎఫ్ స్కీమ్‌లో 2011-12లో అంకెల గారడీకి జెడ్పీ అధికారులు దిగారు. ముగింపు నిల్వకు, ప్రారంభ నిల్వకు తేడాగా తయారైన యూసీపై సీఈ ఓ మోహనరావు, ఆడిట్ అధికారి హరిప్రసాద్ సంతకం చేశా రు. దీన్నే పంచాయతీరాజ్ కమిషనర్‌కు పంపించారు. పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు నివేదికలో తేడా ఉన్న విషయా న్ని గుర్తించి కమిషనర్ వరప్రసాద్‌కు నివేదించారు. దీంతో ఆయన కలెక్టర్ కాంతిలాల్ దండేకు మొత్తం వ్యవహారాన్ని వివరిస్తూ లేఖ రాశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వివరణ ఇవ్వాలంటూ జెడ్పీ సీఈఓ మోహనరావును ఆదేశించారు.
ఆదరాబాదరాగా..
ఇదే విషయమై జెడ్పీ సీఈఓ మోహనరావును వివరణ కోరగా అప్పట్లో ఆదరాబాదరాగా పంపించేశామన్నా రు. లోపాలున్నట్లు పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు గు ర్తించారని, దాన్ని సరి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
సర్దుబాట్లు ఉంటాయి: జిల్లా ఆడిట్ అధికారి
‘యూసీలో చిన్న చిన్న సర్దుబాట్లు ఉంటాయి. అదేమీ పెద్ద సమస్య కాదు. నిధులు దుర్వినియోగమైనట్లు కా దు. మీడియాలోకి ఎక్కించే విషయం కాదిది. ఆ తేడా ను సరిచేసే పనిలో జెడ్పీ అధికారులు ఉన్నారు’ అని జిల్లా ఆడిట్ అధికారి హరిప్రసాద్ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. అయితే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు అప్పగించాలనే యోచనలో పంచాయతీ రాజ్ కమిషనర్ వరప్రసాద్ ఉన్నట్లు తెలిసింది.