bride suicide attempt
-
నవవధువు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె సిటీ: పెళ్లైన రెండు నెలలకే భర్త రైలు ప్రమాదంలో మృతి చెందడంతో తట్టుకోలేక ఓ నవ వధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం బి.కొత్తకోటలో చోటుచేసుకుంది. బాధితుల కథనం..బి.కొత్తకోటకు చెందిన భరత్, శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన లావణ్య(25) గత ఏడాది డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. బీఎస్సీ నర్సింగ్ చేస్తున్న ఇద్దరూ మూడు రోజుల క్రితం టెక్కలి నుంచి బి.కొత్తకోటకు వచ్చేందుకు నౌపడ రైల్వేస్టేషన్లో రైలు ఎక్కుతూ ప్రమాదశాత్తు జారి పడి భరత్ మృతి చెందాడు. భర్త కర్మకాండలకు బి.కొత్తకోటలో ఉన్న లావణ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో టాయిలెట్ క్లీనర్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి రోజే వధువు ఆత్మహత్యాయత్నం
తోగ్గూడెం(పాల్వంచరూరల్) : ప్రేమించి పెళ్లి చేసుకుని 24గంటలు గడవక ముందే నవ వధువు క్వారీ బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పాల్వంచ మండలం తోగ్గూడెంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండల పరిధిలోని తోగ్గూడెంలో ఉన్న క్వారీ క్యాంప్‌లో నివాసం ఉంటున్న ఒడిశాకు చెందిన మంజుల, లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ ప్రేమించుకున్నారు. పెద్దమ్మతల్లి గుడి వద్ద గురువారం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత ప్రశాంత్ కుటుంబీకులు వారి వివాహాన్ని అంగీకరించలేదు. దీంతో గురువారం సాయంత్రం మంజుల గ్రామ సమీపంలోని క్వారీ బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అటుగా వెళ్తున్న క్వారీ కార్మికులు గమనించి నీటిలో నుంచి బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స జరిపించారు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మంజుల భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ .బి.సత్యనారాయణ తెలిపారు. -
నగలు, నగదుతో ఉడాయించిన పెళ్లికొడుకు
చిత్తూరు: తెల్లారితే పెళ్లి.. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతలోనే ఊహించని సంఘటన... నగలు, నగదుతో పెళ్లి కొడుకు పరారయ్యాడు. దాంతో మనస్థాపానికి గురైన వధువు ఆత్మహత్యా యత్నం చేసిన సంఘటన చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో చోటుచేసుకుంది. సాతంబేడుకు చెందిన రాజేశ్వరికి యానాదివెట్టుకు చెందిన రాజారామ్‌కు ఈ నెల 4వ తేదీ ఉదయం పెళ్లి చేయడానికి పెద్దలు నిశ్చితార్థం పెట్టుకున్నారు. వరుడు రాజారామ్ కోరిక మేరకు ముందుగానే 2లక్షల నగదు, 5తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. అయితే సరిగ్గా పెళ్లి సమయానికి రాజారామ్ నగదు, బంగారంతో ఉడాయించాడు. దీంతో మనస్థాపం చెందిన వధువు ఆత్మహత్యాయత్నం చేసింది. బంధువులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వధువు కుటుంబసభ్యులు వరదయ్యపాళెం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలంటూ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం శ్రీకాళహస్తి-చెన్నై రహదారిపై బైఠాయించిన బాధితురాలి బంధువులు.... పరారైన వరుడిని అరెస్ట్ చేయాలని ఆందోళనకు దిగారు.