తెల్లారితే పెళ్లి.. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతలోనే ఊహించని సంఘటన... నగలు, నగదుతో పెళ్లి కొడుకు పరారయ్యాడు.
చిత్తూరు: తెల్లారితే పెళ్లి.. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతలోనే ఊహించని సంఘటన... నగలు, నగదుతో పెళ్లి కొడుకు పరారయ్యాడు. దాంతో మనస్థాపానికి గురైన వధువు ఆత్మహత్యా యత్నం చేసిన సంఘటన చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో చోటుచేసుకుంది. సాతంబేడుకు చెందిన రాజేశ్వరికి యానాదివెట్టుకు చెందిన రాజారామ్‌కు ఈ నెల 4వ తేదీ ఉదయం పెళ్లి చేయడానికి పెద్దలు నిశ్చితార్థం పెట్టుకున్నారు.
వరుడు రాజారామ్ కోరిక మేరకు ముందుగానే 2లక్షల నగదు, 5తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. అయితే సరిగ్గా పెళ్లి సమయానికి రాజారామ్ నగదు, బంగారంతో ఉడాయించాడు. దీంతో మనస్థాపం చెందిన వధువు ఆత్మహత్యాయత్నం చేసింది. బంధువులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వధువు కుటుంబసభ్యులు వరదయ్యపాళెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలంటూ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం శ్రీకాళహస్తి-చెన్నై రహదారిపై బైఠాయించిన బాధితురాలి బంధువులు.... పరారైన వరుడిని అరెస్ట్ చేయాలని ఆందోళనకు దిగారు.