groom escape
-
పెళ్ళి కుమారుడు ఎస్కేప్
-
మరికాసేపట్లో పెళ్లి.. కనిపించకుండాపోయిన పెళ్లికొడుకు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: మరికాసేపట్లో పెళ్లనగా పెళ్లి కొడుకు కనిపించకుండాపోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. శుక్రవారం పెళ్లికి ముహుర్తం దగ్గరపడుతున్నా పెళ్లికొడుకు కళ్యాణ మండపానికి చేరుకోలేదు. అనుమానం వచ్చి పెళ్లికొడుకుకి ఫోన్ చేస్తే రకరకాల కారణాలు చెప్పి తప్పించుకున్నాడు. చివరగా పెళ్లి చేసుకోవడం లేదని తేల్చి చెప్పాడు. దీంతో పెళ్లిపీటలపైనే ఆ యువతి కన్నీటిపర్యంతమైంది. ఏం చేయాలో తెలియక న్యాయం కోసం పెళ్లి బట్టలతోనే చర్ల పోలీసులను ఆశ్రయించింది. చదవండి: (Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్) -
తెల్లారితే పెళ్లి.. మరో యువతితో వరుడు..
సాక్షి, హైదరాబాద్: తెల్లారితే పెళ్ళి పీటలెక్కాల్సిన వరుడు అంతకుముందే మరో యువతిని పెళ్లి చేసుకొని ఉడాయించాడు. దీంతో నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు.. రాజమండ్రికి చెందిన వెంకట దుర్గాప్రసాద్(29) యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో తన తల్లిదండ్రులతో కలిసి అద్దెకుంటున్నాడు. అమ్మాయిలను మాటలతో మభ్యపెట్టి ప్రేమలోకి దింపుతూ కాలం గడుపుతున్నాడు. నాలుగేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో నివసిస్తున్న యువతి(24)తో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె ప్రేమిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ యువతి తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమించిన యువకుడితో పెళ్లి కుదుర్చుకుంది. ఇందుకుగాను 20 రోజుల క్రితం నిశ్చితార్థం చేశారు. ఈ నెల 22వ తేదీన పెళ్లిజరగాల్సి ఉంది. రూ.3 లక్షలు కట్నం కూడా ఇచ్చారు. తీరా తెల్లారి పెళ్లి అనగా వెంకట దుర్గాప్రసాద్ అసలు రంగు బయటపడింది. ఆరు నెలలుగా మరో యువతితో ప్రేమలో పడ్డాడని ఆమెతోనే పది రోజుల క్రితం పెళ్లి జరిగిందని తెలుసుకొని బాధిత యువతి ఖంగుతినింది. దీంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పరారీలో ఉన్న దుర్గా ప్రసాద్‌ను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
వరుడు అదృశ్యం
తిరువొత్తియూరు: రెండు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా వరుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన కడలూరు జిల్లాలో సంచలనం కలిగించింది. కడలూరు జిల్లా వేంబూర్ సిరుకారంబులూరు గ్రామానికి చెందిన కలియన్ కుమారుడు వీరమణి (26)కి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్ 10వ తేది బుధవారం వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాలు బంధువులకు ఆహ్వాన పత్రికలు పంచిపెట్టారు. ఈ క్రమంలో సోమవారం చెన్నైలో ఉన్న స్నేహితులకు పెండ్లి పత్రికలు ఇచ్చి వస్తానని వెళ్లిన వీరమణి తిరిగి రాలేదు. మంగళవారం వరుడు కల్యాణ మండపానికి రాకపోవడంతో వధువు బంధువులు వీరమణి కుటుంబీకులను ప్రశ్నించారు. అదృశ్యమైనట్లు తెలియడంతో ఆందోళనకు గురయ్యారు. వరుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
పెళ్లయిన తెల్లారే వరుడి పరారీ
బంజారాహిల్స్: ఆలయంలో తనను పెళ్లి చేసుకున్న యువకుడు పెళ్లి జరిగిన మరుసటి రోజే అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడంటూ బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని ఇందిరానగర్‌కు చెందిన పద్మకు ఈ నెల 8న తన స్నేహితురాలు సహకారంతో చిలుకూరి సమీపంలోని మాతాగాయత్రి మందిర్‌లో వీరభద్రతో వివాహం జరిగింది. అదే రోజూ ఇద్దరూ కలిసి ఇందిరానగర్‌లోని తమ గదికి వచ్చారు. మర్నాడు టిఫిన్ తీసుకొని వస్తానని బయటికి వెళ్లిన వీరభద్ర తిరిగి రాకపోవడంతో బాధితురాలు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పీటల మీద నుంచి పెళ్లికొడుకు పరారీ
మల్కాపురం(విశాఖ పశ్చిమ): పెళ్లి పీటల నుంచి పెళ్లి కుమారుడు పరారయ్యాడు. ఈ సంఘటన కోరమండల్ సమీపంలో గల ఎంఐజీ కాలనీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జీవీఎంసీ 47వ వార్డు కోరమండల్ సమీపంలో గల ఎంఐజీ కాలనీలో కృష్ణ(28) తన తల్లితో కలిసి నివాసముంటున్నాడు. అతడికి శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమయ్యింది. వీరి వివాహం బుధవారం రాత్రి జరగాల్సి ఉంది. పెళ్లి సందర్భంగా శ్రీహరిపురం సమీప యారాడ పార్కు లోపల గల మైదానంలో బంధువర్గానికి బుధవారం మధ్యాహ్నం భోజనాలు పెట్టారు. మరికొద్ది గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి కుమారుడు అదృశ్యమయ్యాడు. దీంతో పెళ్లి కుమార్తె బంధువులు ఆందోళనకు గురయ్యారు. పెళ్లి కుమారుడికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వస్తోంది. అతడికి ఓ యువతితో గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం సాగుతోందని.. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు పెళ్లి పీటల నుంచి పరారీ అయినట్టు తెలిసింది. దీంతో వధువు బందువులు మల్కాపురం పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయమై తమకు సమాచారం వచ్చిందని, ఫిర్యాదు రాలేదని.. వస్తే విచారించి వివరాలు వెల్లడిస్తామని ఎస్ఐ సురేష్ తెలిపారు. -
ఐదుగురు యువతులను మోసగించి ఆరో పెళ్లి..
చెన్నై , తిరువొత్తియూరు: ఐదుగురు యువతులను మోసగించి పెళ్లి చేసుకుని, ఆరో పెళ్లి చేసుకునేందుకు మరో యువతితో పరారైన వ్యక్తిపై ఐదో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. దిండుక్కల్, తేనాంపట్టికి చెందిన మురుగన్ మల్లిక దుకాణం నడుపుతున్నాడు. అతనికి రాధ అనే యువతితో పరిచయమై ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను రాధ కుటుంబసభ్యులు తిరస్కరించారు. రాధ తల్లిదండ్రులను వద్దనుకుని మురుగన్‌తో వెళ్లి వివాహం చేసుకుంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో వ్యాపారంలో నష్టం ఏర్పడడంతో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. అప్పుల బాధ ఎక్కువ కావడంతో ఎక్కెడికైనా వెళ్లి డబ్బు సంపాదించి తీసుకొస్తానని చెప్పి వెళ్లిన మురుగన్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో రాధ భర్త కోసం అన్ని చోట్ల గాలించినప్పటికీ అతని ఆచూకీ తెలియలేదు. విచారణలో అతనికి ఇదివరకే నలుగురితో వివాహం అయ్యిందని, తాను ఐదో భార్య అని తెలియడంతో దిగ్భ్రాంతి చెందారు. ఇదిలాఉండగా మురుగన్ ఆరో పెళ్లి చేసుకునేందుకు మరో యువతితో కలిసి పరారైనట్టు తెలిసింది. దీంతో అయోమయంలో పడిన రాధ పుట్టింటికి వెళ్లగా ఆమె ప్రేమ వివాహం చేసుకోవడం నచ్చని తల్లిదండ్రులు ఆదరించలేదని తెలిసింది. దీంతో విరక్తి చెందిన రాధ కొన్ని రోజులుగా ఆలయంలో దీనావస్థలో గడుపుతోంది. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న రాధ తనను మోసం చేసి పారిపోయిన భర్తపై వడమదురై పోలీసుస్టేషన్లో గురువారం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. -
కాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్
అనంతపురం, కదిరి: మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. వధువు తల్లిదండ్రులు కట్నం రూపంలో ఇస్తున్న బంగారం స్వచ్ఛమైనది కాదంటూ వరుడు పరారయ్యాడు. గురువారం కదిరి పట్టణంలో చోటుచోసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తనకల్లు మండలం బాలసముద్రం పంచాయతీ టీ సదుంకు చెందిన మహబూబ్‌బాషా ఒక్కగానొక్క కుమారుడు మహమ్మద్ రఫికి కదిరి మున్సిపల్ పరిధిలోని నిజాంవలి కాలనీకి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం 11.30 గంటలకు కదిరిలోని టైటానిక్ ఫంక్షన్ హాల్లో నిఖా(వివాహం) జరగాల్సి ఉంది. పెళ్లి హడావుడిలో ఎవరికి వారు నిమగ్నమై ఉన్నారు. ముహూర్తం సమయానికి పెళ్లి వరుడు కన్పించడం లేదని చెప్పడంతో వధువు తల్లిదండ్రులతో పాటు వారి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ముందురోజు రాత్రే (బుధవారం) తనకు కట్నం రూపంలో ఇస్తున్న 10 తులాలు స్వచ్ఛమైన బంగారం (కేడీఎం) కాదంటూ తమతో గొడవకు దిగారని, పెద్ద మనుషులు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగిందని వధువు తరపు బంధువులు పేర్కొన్నారు. పెళ్లి ఏర్పాట్లతో పాటు పెళ్లి భోజనాల కోసం సుమారు రూ.లక్ష దాకా ఖర్చు అయిందని, బంగార ం కోసమే రూ.3లక్షలు దాకా ఖర్చు చేశామని, తీరా పెళ్లి సమయానికి వరుడు పరారై తమను అవమానం పాలు చేశారని వధువు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బీడీ బంక్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడని, పెళ్లి కొడుకు మంచోడని కొందరు చెప్పడంతో ఈ సంబంధం కుదుర్చుకున్నామని, పెళ్లి కొడుకు ఇంత మోసగాడని ఇప్పుడే తెలుస్తోందని పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పట్టణ సీఐ గోరంట్ల మాధవ్ ఎదుట పోలీస్ స్టేషన్లో వాపోయారు. కట్నం ఇంకా రూ.50 వేలు ఎక్కువ ఇస్తామని వేరే వాళ్లు చెప్పడంతో పెళ్లి కొడుకు పరారై ఆ సంబంధం చేసుకోవడానికి సిద్ధమైనట్లు తమకు తెలిసిందని వారు ఆరోపించారు. పెళ్లి కుమార్తెకు మద్దతుగా నిజాంవలి కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ చేరుకొని బాధిత యువతికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ప్రేమించి..పెళ్లికి ముందు ప్లేటు ఫిరాయింపు
చిక్కడపల్లి: ప్రేమించిన యువతిని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి పెళ్ళికి ముందు రోజు పరారయ్యాడు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ భీంరెడ్డి తెలిపినమేరకు.. చిక్కడపల్లి పీ అండ్ టీ క్వార్టర్స్‌కు చెందిన యువతి(25,) మియాపూర్‌కు చెందిన నవీన్ నాలుగేళ్ళుగా ప్రేమించుకున్నారు. కుటుంబసభ్యులు కూడా పెళ్ళికి ఆంగీకరించారు. ఫిబ్రవరి 28 న వీరి నిశ్చితార్థం జరిగింది. గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లికి రెండు రోజుల ముందు నవీన్ యువతికి పోన్ చేసి పెళ్ళి వాయిదా చేసుకుందామని బలవంతం చేశాడు. అయితే కారణం మాత్రం చెప్పలేదు. తమకుముఖ్యమైన పనులున్నాయని కుటుంబసభ్యులు కూడా పేర్కొన్నారు. దీంతో యువతి చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో కేసు నమోదు చేశారు. నవీన్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. -
పెళ్లి రోజే వరుడు పరారీ
యాకుత్‌పురా:కొన్ని గంటల్లో పెళ్లి జరుగుతుండగా పెళ్లి కొడుకు పరారైన సంఘటన మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగరాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.మొఘల్‌పురా ప్రాంతానికి చెందిన మహ్మద్ గౌస్ కుమార్తె హసినా ఫాతిమాకు, ఆసిఫ్‌నగర్ జిర్రా ప్రాంతానికి చెందిన మహ్మద్ షరీఫ్‌తో వివాహం కుదిరింది. ఈ నెల 29న నాంపల్లిలోని ఓ మసీద్‌లో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతేగాక ఒప్పందం ప్రకారం పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు కట్నకానుకలను అందజేశారు.అయితే గురువారం పెళ్లి కుమారుడు షరీఫ్ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన వధువు కుటుంబ సభ్యులు మొఘల్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. షరీఫ్ కుటుంబ సభ్యులకు 15 తులాల బంగారు ఆభరణాలు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులను ముందుగానే అందజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లి మండపం నుంచి వరుడు పరార్..
ఐదు లక్షల రూపాయల ఖర్చుతో వివాహ నిశ్చితార్థం వైభవంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి రిసెష్షన్ సైతం బంధువుల హడావుడి మధ్య వైభవంగా జరిగింది. పెద్దల దీవెనలు, ఫొటోలు, వీడియోలు, సహచరుల డాన్స్ తదితర వాటితో కల్యాణమండపం వద్ద అర్ధరాత్రి వరకు కోలాహలం నెలకొంది. ముహుర్తానికి సమయం దగ్గరపడడంతో మంగళ వాయిద్యాలు మొదలయ్యాయి. ఇంతలోనే పెద్ద షాక్ పెళ్లికొడుకుతో పాటు అతని తల్లిదండ్రులు సైతం మండపం నుంచి మాయమయ్యారు. పెళ్లి ఆగిపోయింది. పంచాయతీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్‌లో జరిగిన సంఘటన సర్వత్రా చర్చినీయాంశంగా మారింది. సాక్షి, చిత్తూరు: ముందుగా నిర్ణయించిన ప్రకారం 50 సవర్ల బంగారం ఇవ్వలేదన్న కారణంతో మండపం నుంచి వరుడు పరారయ్యాడు. ఈ సంఘటన తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్‌లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్ ప్రాంతానికి చెందిన జానకీరామన్. ఇతను విదేశాల్లో పని చేస్తున్నాడు. ఇతని కుమార్తె శోభాలక్ష్మి(25)కి, చెన్నై ఎగ్మోర్కు చెందిన ప్రభాకరన్ కుమారుడు శరణ్‌కుమార్‌తో గత సెప్టెంబర్‌లో కోలాహలంగా నిశ్చితార్థం నిర్వహించారు. వివాహ నిశ్చితార్థం సమయంలో 50 సవర్ల బంగారంతో పాటు లక్ష నగదు ఇతర వస్తువులను కట్నంగా ఇవ్వాలని పెళ్లి కుమారుడి తరఫున డిమాండ్ చేశారు. కట్నం ఇచ్చేందుకు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు అంగీకరించడంతో జనవరి 21న రిసెప్షన్, 22న ముహుర్తంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం మనవాలనగర్‌లోని ప్రయివేటు కల్యాణమండపంలో రిసెప్షన్ జరిగింది. ఈ స్థితిలో ఆదివారం అర్ధరాత్రి ఇరు కుటుంబాల మధ్య కట్నం ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. మొదట 50 సవర్ల బంగారం ఇస్తామని చెప్పి, తీరా పెళ్లి సమయంలో 40 సవర్ల బంగారం మాత్రమే ఇవ్వడంపై ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. మరో రెండు నెలల్లో పది సవర్ల బంగారం ఇస్తామని వధువు తరపు వారు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అందుకు వరుడి తరపు వారు అంగీకరించలేదు. దీంతో పెళ్లికి నిరాకరించిన వరుడు, అతని బంధువులు సోమవారం ఉదయం మూడు గంటలకు మండపం నుంచి వెళ్లిపోయారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న వధువు బంధువులు ఆవేదన చెందారు. పెళ్లి కొడుకు ఫోన్ సైతం స్విచాఫ్ చేసి ఉండడంతో మనవాలనగర్ పోలీసులను ఆశ్రయించారు. కట్నం తగ్గిందన్న సాకుతో మండపం నుంచి వరుడు పరారయ్యాడని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
యువతితో నిశ్చితార్థం.. వరుడి పరారీ
సాక్షి, బెంగళూరు(హుబ్బళ్లి): ఓ యువతిని వివాహం చేసుకునేందుకు బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న ఓ యువకుడు.. పెళ్లి కొద్ది రోజుల్లో ఉందనగా చెప్పాపెట్టకుండా ఉడాయించాడు. దీంతో యువతి తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేశ్వాపుర పోలీసుల కథనం మేరకు..హుబ్బళ్లి నగరం బెంగేరిలోని సాయి లేఔట్లో నివాసం ఉంటున్న బ్యాంకు ఉద్యోగి కిషోర్ కటారేకు ఇదే నగరానికి చెందిన యువతితో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. ఈనెల 28న నగరంలోనే వారిద్దరికీ వివాహం చేయాలని వధూవరుల తరఫు వారు నిర్ణయించారు. ఈమేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈక్రమంలో తనకు ఈ వివాహం ఇష్టం లేదని చెబుతూ సదరు యువకుడు ఇంటి నుంచి ఉడాయించాడు. యువతి తల్లిదండ్రులు ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో కేశ్వాపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు యువకుడి కోసం గాలింపు చేపట్టారు. -
నగలు, నగదుతో ఉడాయించిన పెళ్లికొడుకు
చిత్తూరు: తెల్లారితే పెళ్లి.. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతలోనే ఊహించని సంఘటన... నగలు, నగదుతో పెళ్లి కొడుకు పరారయ్యాడు. దాంతో మనస్థాపానికి గురైన వధువు ఆత్మహత్యా యత్నం చేసిన సంఘటన చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో చోటుచేసుకుంది. సాతంబేడుకు చెందిన రాజేశ్వరికి యానాదివెట్టుకు చెందిన రాజారామ్‌కు ఈ నెల 4వ తేదీ ఉదయం పెళ్లి చేయడానికి పెద్దలు నిశ్చితార్థం పెట్టుకున్నారు. వరుడు రాజారామ్ కోరిక మేరకు ముందుగానే 2లక్షల నగదు, 5తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. అయితే సరిగ్గా పెళ్లి సమయానికి రాజారామ్ నగదు, బంగారంతో ఉడాయించాడు. దీంతో మనస్థాపం చెందిన వధువు ఆత్మహత్యాయత్నం చేసింది. బంధువులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వధువు కుటుంబసభ్యులు వరదయ్యపాళెం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలంటూ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం శ్రీకాళహస్తి-చెన్నై రహదారిపై బైఠాయించిన బాధితురాలి బంధువులు.... పరారైన వరుడిని అరెస్ట్ చేయాలని ఆందోళనకు దిగారు. -
పెళ్లికి 2 గంటల ముందు పెళ్లికొడుకు పరార్
మెదక్: పెళ్లికి రెండు గంటల ముందు పెళ్లికొడుకు కుటుంబం, పెళ్లికొడుకు పరారయ్యారు. జగదేవ్‌పూర్ మండలం అంగడి కిష్టాపూర్‌లో ఈ ఘటన జరిగింది. జగదేవ్‌పూర్ మండలం అంగడి కిష్టాపూర్‌కు చెందిన యువతికి హైదరాబాద్‌కు చెందిన విజయ రెడ్డికి పెళ్లి కుదిరింది. ఈ రోజు పెళ్లి చేయాలని ఇరువైపుల పెద్దలు నిర్ణయించారు. అయితే పెళ్లికి ఇంకా రెండు గంటలు సమయం ఉందనగా పెళ్లికొడుకుతోపాటు అతని కుటుంబ సభ్యులు అందరూ చెప్పాపెట్టకుండా పారిపోయారు.