
మల్కాపురం(విశాఖ పశ్చిమ): పెళ్లి పీటల నుంచి పెళ్లి కుమారుడు పరారయ్యాడు. ఈ సంఘటన కోరమండల్ సమీపంలో గల ఎంఐజీ కాలనీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జీవీఎంసీ 47వ వార్డు కోరమండల్ సమీపంలో గల ఎంఐజీ కాలనీలో కృష్ణ(28) తన తల్లితో కలిసి నివాసముంటున్నాడు. అతడికి శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమయ్యింది. వీరి వివాహం బుధవారం రాత్రి జరగాల్సి ఉంది. పెళ్లి సందర్భంగా శ్రీహరిపురం సమీప యారాడ పార్కు లోపల గల మైదానంలో బంధువర్గానికి బుధవారం మధ్యాహ్నం భోజనాలు పెట్టారు.
మరికొద్ది గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి కుమారుడు అదృశ్యమయ్యాడు. దీంతో పెళ్లి కుమార్తె బంధువులు ఆందోళనకు గురయ్యారు. పెళ్లి కుమారుడికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వస్తోంది. అతడికి ఓ యువతితో గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం సాగుతోందని.. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు పెళ్లి పీటల నుంచి పరారీ అయినట్టు తెలిసింది. దీంతో వధువు బందువులు మల్కాపురం పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయమై తమకు సమాచారం వచ్చిందని, ఫిర్యాదు రాలేదని.. వస్తే విచారించి వివరాలు వెల్లడిస్తామని ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment