ఐదు లక్షల రూపాయల ఖర్చుతో వివాహ నిశ్చితార్థం వైభవంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి రిసెష్షన్ సైతం బంధువుల హడావుడి మధ్య వైభవంగా జరిగింది. పెద్దల దీవెనలు, ఫొటోలు, వీడియోలు, సహచరుల డాన్స్ తదితర వాటితో కల్యాణమండపం వద్ద అర్ధరాత్రి వరకు కోలాహలం నెలకొంది. ముహుర్తానికి సమయం దగ్గరపడడంతో మంగళ వాయిద్యాలు మొదలయ్యాయి. ఇంతలోనే పెద్ద షాక్ పెళ్లికొడుకుతో పాటు అతని తల్లిదండ్రులు సైతం మండపం నుంచి మాయమయ్యారు. పెళ్లి ఆగిపోయింది. పంచాయతీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్‌లో జరిగిన సంఘటన సర్వత్రా చర్చినీయాంశంగా మారింది.
సాక్షి, చిత్తూరు: ముందుగా నిర్ణయించిన ప్రకారం 50 సవర్ల బంగారం ఇవ్వలేదన్న కారణంతో మండపం నుంచి వరుడు పరారయ్యాడు. ఈ సంఘటన తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్‌లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్ ప్రాంతానికి చెందిన జానకీరామన్. ఇతను విదేశాల్లో పని చేస్తున్నాడు. ఇతని కుమార్తె శోభాలక్ష్మి(25)కి, చెన్నై ఎగ్మోర్‌కు చెందిన ప్రభాకరన్ కుమారుడు శరణ్‌కుమార్‌తో గత సెప్టెంబర్‌లో కోలాహలంగా నిశ్చితార్థం నిర్వహించారు. వివాహ నిశ్చితార్థం సమయంలో 50 సవర్ల బంగారంతో పాటు లక్ష నగదు ఇతర వస్తువులను కట్నంగా ఇవ్వాలని పెళ్లి కుమారుడి తరఫున డిమాండ్ చేశారు. కట్నం ఇచ్చేందుకు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు అంగీకరించడంతో జనవరి 21న రిసెప్షన్, 22న ముహుర్తంగా నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం మనవాలనగర్‌లోని ప్రయివేటు కల్యాణమండపంలో రిసెప్షన్ జరిగింది. ఈ స్థితిలో ఆదివారం అర్ధరాత్రి ఇరు కుటుంబాల మధ్య కట్నం ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. మొదట 50 సవర్ల బంగారం ఇస్తామని చెప్పి, తీరా పెళ్లి సమయంలో 40 సవర్ల బంగారం మాత్రమే ఇవ్వడంపై ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. మరో రెండు నెలల్లో పది సవర్ల బంగారం ఇస్తామని వధువు తరపు వారు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అందుకు వరుడి తరపు వారు అంగీకరించలేదు. దీంతో పెళ్లికి నిరాకరించిన వరుడు, అతని బంధువులు సోమవారం ఉదయం మూడు గంటలకు మండపం నుంచి వెళ్లిపోయారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న వధువు బంధువులు ఆవేదన చెందారు. పెళ్లి కొడుకు ఫోన్ సైతం స్విచాఫ్ చేసి ఉండడంతో మనవాలనగర్ పోలీసులను ఆశ్రయించారు. కట్నం తగ్గిందన్న సాకుతో మండపం నుంచి వరుడు పరారయ్యాడని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment