నగదుతో ఉడాయించిన కొత్త పెళ్లి కూతురు
పెళ్లయి నెల రోజులు కాకముందే భర్త ఇంటి నుంచి బంగారు నగలు, నగదుతో ఉడాయించింది ఓ నవవధువు. ఆ సంఘటన తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలో చోటు చేసుకుంది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్ ప్రాంతానికి చెందిన కళ అనే యువతి చేపల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తుంది. ఆమె నాలుగు నెలల క్రితం రైలులో చెన్నై నుంచి తిరువళ్లూరు వస్తుండగా, అదే రైలులో ప్రయాణిస్తున్న కళతో కవి అనే యువతి పరిచయం చేసుకుంది. తన స్వస్థలం సేలం అని కళకు కవి వెల్లడించింది. తాను బీఎస్పీ చదువుకున్నట్లు తెలిపింది. తన తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోయారని, దాంతో తాను అనాథగా మిగిలిపోయానని ఈ నేపథ్యంలో తనకు ఆశ్రయం కల్పించాలని కళను ఆ యువతి కోరింది. దాంతో ఆ యువతికి కళ తన ఇంట్లో ఆశ్రయం కల్పించింది.
ఆ క్రమంలో మనవాలనగర్ ప్రాంతంలో మినీలారీ డ్రైవర్గా పని చేస్తున్న రాజశేఖర్ కుమారుడు వినోద్కు కళతో ఎంతో కాలంగా పరిచయం ఉంది. అయితే తాను పెళ్లి చేసుకోవానుకుంటున్నట్లు... ఎవరైన మంచి అమ్మాయి ఉంటే చెప్పాలని కళను వినోద్ కోరారు. దాంతో తన ఇంట్లో ఆశ్రయం పొందుతున్న కవి మంచి అమ్మాయి అని ఆమెను పెళ్లి చేసుకుంటే అన్ని విధాల బాగుంటుందని వినోద్కు కళ సూచించింది. దీంతో ఇరువురికి వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. దాంతో గత నెల 5వ తేదీన వినోద్ కుమార్, కవిలకు పెళ్లి చేశారు. అయితే ఈ నెల 16న రాత్రి కరెంట్ పోవడంతో ఇంట్లో వారంత బయట నిద్రిస్తున్నారు. దీనినే అదునుగా భావించి కవి బీరువాలోని
రూ.15 వేల నగదు, బంగారు నగలతో ఉడాయించింది. భార్య కవి కోసం భర్త వినోద్కుమార్, అతడి బంధువులు తీవ్రంగా గాలించారు. అయిన ఫలితం లేకపోవడంతో బుధవారం రాత్రి వినోద్కుమార్ తల్లి కమల మనవాలనగర్ పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.