Brutal murder of woman
-
గిరిజన యువతి దారుణ హత్య
అరకులోయ: భార్య ఉండగానే, నెల రోజుల క్రితం రెండో వివాహం చేసుకొని ఆమెను అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన అరకులోయలో కలకలం సృష్టించింది. విశాఖ ఏజెన్సీ అరకులోయ మండలం చినలబుడు గ్రామానికి చెందిన కిల్లో పుష్ప (20) అనే గిరిజన యువతిని, అరకులోయకు చెందిన గిరిజనుడు కె.రమేష్ (25) ప్రేమించాడు. అతనికి అప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ పుష్పను రెండో వివాహం చేసుకుని, స్థానిక సి.కాలనీలో కాపురం పెట్టాడు. రమేష్ రెండో వివాహం చేసుకున్న తరువాత కుటుంబ కలహాలు అధికమైనట్టు తెలిసింది. గిరిజనేతర యువతి రాజేశ్వరిని కూడా ఐదేళ్ల క్రితం రమేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి ఒత్తిడి అధికం కావడంతో పుష్పను అడ్డు తొలగించుకునేందుకు భర్త రమేష్ ఈ హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. మొదటి భార్య రాజేశ్వరి, ఆమె తల్లిదండ్రులు కూడా పుష్ప హత్యకు సహకరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుష్ప మీసేవ కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తోంది. పుష్పను శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో భర్త రమేష్ బయటకు తీసుకువెళ్లినట్టు చుట్టు పక్కల వారు చెబుతున్నారు. శనివారం ఉదయాన్నే శరభగుడ సమీపంలోని నీలగిరి తోటలలో సగం వరకు బట్టలు లేకుండా ఉన్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, సీఐ పైడయ్య, ఎస్ఐ అరుణ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రమేష్‌పై అనుమానం వచ్చి పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని మొదటి భార్య రాజేశ్వరి, ఆమె తల్లిదండ్రులు ధర్మారావు, అనసూయలను కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పుష్ప ధరించిన చున్నీనే ఆమె మెడకు బిగించి హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. కాగా, హత్యకు గురైన పుష్ప తల్లిదండ్రులు కిల్లో పరశురామ్, పుణ్యవతితో పాటు, కుటుంబ సభ్యులు, బంధువులు అరకులోయలో ఆందోళన చేపట్టారు. నిందితులను అరెస్టు చేశామని, కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హమీ ఇవ్వడంతో వారు శాంతించారు. మొదటి భార్య, ఆమె తల్లిదండ్రులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
మరొకరితో సన్నిహితంగా మెలుగుతోందని..
సాక్షి, నల్గొండ : ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన కోదాడ మండల పరిధిలోని గణపవరం శివారులో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ దశరథ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా కొయలగూడేనికి చెందిన రమాదేవి(28)కి అదే జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన ఏసుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. దంపతుల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా రమాదేవి ఏడాదిన్నర క్రితం భర్త నుంచి విడిపోయింది. అప్పటినుంచి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం మందులగూడెంలో నివాసముంటున్న తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. బతుకుదెరువు నిమిత్తం రమాదేవి ఏడాదిన్నర క్రితమే డబ్బా శ్రీను అనే సర్కస్ కపెనీలో పనిచేస్తోంది. అయితే అదే కంపెనీలో పనిచేస్తున్న నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన సిండే సవాల్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. పది రోజుల క్రితం.. ఊరూరా తిరుగుతూ సర్కస్ నిర్వహించే బృందంతో కలిసి సిండే సవాల్, రమాదేవి కూడా ఇటీవల మండల పరిధిలోని గణపవరం గ్రామానికి వచ్చా రు. బృందం సభ్యులు గ్రామ శివారులో డేరాలు ఏర్పాటు చేసుకుని సర్కస్ నిర్వహిస్తూ అక్కడే జీవనం సాగిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా రమాదేవి మరొకరితో సఖ్యతగా మెలుగుతోందని, అతడితోనే ఫోన్లో ఎక్కువ మాట్లాడుతోందని సిండే సవాల్ అనుమానించారు. ఈ నేపథ్యంలోనే పది రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరగడం తో రమాదేవి మందులగూడేనికి వెళ్లిపోయింది. కూలి డబ్బులు తీసుకునేందుకు.. సర్కస్‌లో పని చేసినందుకు గాను కూలి డబ్బులు తీసుకున్న సిండే సవాల్ స్వగ్రామం వెళ్లిపోతున్నానని సర్కస్ బృందానికి చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోయాడు. అయితే ఆ బృందం మేస్త్రీ రమాదేవికి కూడా ఫోన్ చేసి సిండే సవాల్ వెళ్లిపోయాడని, నీకు రావాల్సిన కూలి డబ్బులు తీసుకుపోవాలని రమాదేవికి ఫోన్ చేశాడు. దీంతో రమాదేవి బుధవారం సోదరుడు హరిని వెంటబెట్టుకుని గణపవరం గ్రామానికి వచ్చింది. కూలి డబ్బులు సోదరుడికి ఇవ్వడంతో వెళ్లిపోగా తాను మాత్రం సర్కస్ బృందం సభ్యులతో డేరాలోనే ఉంది. అర్ధరాత్రి వచ్చి.. అయితే తాను స్వగ్రామం వెళ్లిపోయాయని తెలిస్తే రమాదేవి కూలి డబ్బులకు కచ్చితంగా రమాదేవి వస్తుందని భావించిన సిండే సవాల్ బుధవారం అర్ధరాత్రి గణపవరం శివారులోని సర్కస్ బృందం వేసుకున్న డేరాల వద్దకు వచ్చాడు. అతడు ఉహించినట్టుగానే రమాదేవి అక్కడే ఉండడంతో ఇకపై కలిసే మంచిగా ఉందామని మాయమాటలు చెప్పాడు. అక్కడి నుంచి అలా పక్కకి వెళ్లి మాట్లాడుకుందామని తీసుకుపోయాడు. కాసేపటికి ఇద్దరి మధ్య వాగ్వాదం కాస్తా గొడవకు దారి తీయడంతో ఆగ్రహానికి లోనైన సిండే సవాల్ పక్కనే ఉన్న కూరగాయలు కోసే కత్తితో ఆమో ఛాతిభాగంలో పొడిచి పారిపోయాడు. దీంతో రమాదేవి కేకలు వేస్తూ నేలకొరగడంతో సర్కస్ బృందం సభ్యులు వచ్చి చూసే సరికి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు విడిచింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రమాదేవి సోదరుడు హరి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చేవెళ్లలో మహిళ దారుణ హత్య
- గొంతు కోసి చంపిన దుండగులు - వివరాలు సేకరించిన పోలీసులు చేవెళ్ల రూరల్: చేవెళ్ల మండల కేంద్రంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఒంటరిగా ఉంటున్న ఆమెను గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి చంపేశారు. ఈ సంఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఆలూరు గ్రామానికి చెందిన నయికుడి రాంచంద్రయ్య, అంజమ్మ దంపతుల కూతురు తులసి(25)ని కొన్నేళ్ల క్రితం యాప్రాల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె భర్తను వదిలేసి ఐదు సంవత్సరాల క్రితం పుట్టింటికి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తులసి ఆరు నెలలుగా చేవెళ్ల మండలకేంద్రంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. తల్లిదండ్రులు తరచూ ఆమె వద్దకు వచ్చి వెళ్తుండేవారు. మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రించిన తులసి బుధవారం ఉదయం బయటకు రాలేదు. తలుపులు మూసి ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో నల్లానీళ్లు రావడంతో పట్టుకోమని పొరుగువారు కేకలు వేసినా తులసి నుంచి స్పందన లేకుండాపోయింది. స్థానికులు వెళ్లి చూడగా తలుపులు తీసి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా మంచంపై విగతజీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజశేఖర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తులసి గొంతుపై కోసిన ఆనవాళ్లను గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఆమెకు తెలిసిన వ్యక్తులే ఇంట్లోకి వచ్చి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. హతురాలి తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.