అరుణ ఊపిరి ఆగిపోయింది..
ముంబై : గత 42 ఏళ్లుగా కోమాలో ఉన్న అరుణా షాన్ బాగ్ (68) ఎట్టకేలకు తుదిశ్వాస విడిచింది. ముంబైలోని కింగ్ అడ్వర్డ్స్ మెమోరియల్ (కెఇఎమ్) ఆస్పత్రిలో ఆమె సోమవారం మృతి చెందినట్లు ఆస్పత్రి డీన్ అవినాష్ సుపే వెల్లడించారు. 26 ఏళ్ల వయసులో అరుణా షాన్ బాగ్ ఆసుపత్రిలో నర్సుగా చేస్తుండగా అత్యాచారానికి గురైంది. విధి నిర్వహణలో ఉన్న ఆమెపై ఆస్పత్రి వార్డ్బాయ్ సోహన్ లాల్ వాల్మీకి అతి దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టి, తీవ్రంగా గాయపరిచాడు. దాంతో షాక్ తిన్న అరుణా షాన్ బాగ్ కోమాలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె కోమాలోనే ఉంది.
ఆస్పత్రిలో మందులను దొడ్డిదారిన అమ్ముకుంటున్న సోహన్ లాల్‌ను అరుణ ప్రశ్నించటంతో పాటు అధికారుల దృష్టికి తీసుకు వెళతానని హెచ్చిరించడంతో ఆమె అత్యాచారానికి గురైంది. ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను నిర్బంధించిన వార్డు బాయ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. దాంతో మెదడు పని చేయక పోవటంతో కోమాలోకి జారుకుంది.
అప్పటి నుంచి కెఇఎమ్ ఆసుపత్రిలోనే అరుణా షాన్ బాగ్ జీవచ్ఛవంగా బతుకుతోంది. ఈ నేపథ్యంలో అరుణకు కారుణ్య మరణాన్ని అర్ధిస్తూ ఆమెపై పుస్తకం రాసిన రచయిత్రి పింకీ విరానీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే అరుణా షాన్ బాగ్ సహజ మరణం ఆసన్నమయ్యేవరకూ కంటికి రెప్పలా చూసుకుంటామని ఆసుపత్రి సిబ్బంది హామీ ఇవ్వడంతో సుప్రీంకోర్టు ఆమెకు కారుణ్య మరణాన్ని నిరాకరించింది.