పని ఇస్తామని చెప్పి ....చావగొట్టాడు!
కరీంనగర్(ఎల్కతుర్తి): బతుకుదెరువు నిమిత్తం పొట్ట చేతపట్టుకుని వచ్చిన వారిని ఓ మేస్త్రీ గదిలో నిర్బంధించి చావగొట్టిన సంఘటన కరీంనగర్ జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది. బాధితులు తెలిపిన వివరాలు.. వైఎస్సార్ జిల్లా బద్వేల్ మండలానికి చెందిన సిద్దు పెంచలయ్య, సిద్దు విజయ్, తుపాకుల వెంకటేష్, పోలి కుమార్ వారం రోజుల క్రితం కోరుట్లకు చెందిన గురువయ్య అనే మధ్యవర్తి పని కల్పిస్తానని ఎల్కతుర్తి మండలం దామెరకు చెందిన బండారు శ్రీను అనే మేస్త్రికి అప్పగించాడు. వీరికి అడ్వాన్స్‌గా రూ.వెయ్యి చొప్పున ఇచ్చి మూడు పూటలా భోజనం, ఉండేందుకు చోటు కల్పిస్తానని చెప్పాడు.
వారు యజమాని చెప్పిన పని చేస్తున్నప్పటికీ కారం, పచ్చడితో భోజనాలు పెడుతున్నాడు. ఎంత పని చేసినా సరిగా చేయడం లేదని దూషిస్తున్నాడు. దీంతో సదరు కూలీలు అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బుల వరకు పని చేసి, గురువారం మధ్యాహ్నం స్వగ్రామాలకు బయల్దేరి వరంగల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. విషయం తెలుసుకున్న మేస్త్రీ శ్రీనివాస్ ఆటోలో వరంగల్ స్టేషన్‌కు వెళ్లి వారిని భయపెట్టి, మభ్యపెట్టి తిరిగి దామెరకు తీసుకొచ్చాడు. రాత్రి బాగా మద్యం తాగివచ్చి కూలీలను గదిలో నిర్బంధించి విచక్ష ణారహితంగా కర్రతో చితకబాదాడు. రాత్రి వారిని గదిలోనే బంధించి .. తాళం వేసుకుని శుక్రవారం కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లాడు. ఉదయం గదిలో నుంచి అరుపులు వినిపిస్తుండడంతో చుట్టుపక్కల వారు తాళం పగులగొట్టి వారిని బయటకు తీశారు. వారి శరీరాల నిండా కమిలిన గాయాలున్నాయి. గ్రామస్తుల సహకారంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.