బ్లాక్ మార్కెట్కు తరలిన టూవీలర్లు
టూ వీలర్ల అమ్మకాల మీద భారీ డిస్కౌంటులు ప్రకటించడంతో ఒక్కసారిగా ద్విచక్ర వాహనాలు చాలావరకు బ్లాక్ మార్కెట్కు తరలిపోయాయి. జంట నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ద్విచక్ర వాహనాలు దొరకడం లేదు. ఒక్కోవాహనం మీద పది వేల నుంచి రూ. 22 వేల వరకు భారీ డిస్కౌంట్లు ప్రకటించడంతో ఎప్పటి నుంచో బైకులు కొందామని ఆలోచనలో ఉన్న వినియోగదారులు షోరూంలకు పోటెత్తారు. పత్రికలలో కూడా ఈ డిస్కౌంట్లకు సంబంధించిన కథనాలు రావడంతో అవి చూసి అంతా వెళ్లారు. కానీ, అప్పటికే చాలా వరకు షోరూంలలో నో స్టాక్ బోర్డులు పెట్టారు. దాంతో వినియోగదారులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.
బీఎస్-3 తరహా వాహనాల అమ్మకాలకు మార్చి 31 చివరి తేదీ అని సుప్రీంకోర్టు ప్రకటించడంతో తమ వద్ద పెద్దమొత్తంలో పేరుకుపోయిన వాహనాలను వదిలించుకోడానికి ఆటోమొబైల్ కంపెనీలు ఈ తరహాలో డిస్కౌంట్లు ప్రకటించగా, దాన్ని కొందరు వ్యాపారులు అవకాశంగా మార్చుకున్నారు. ముందుగానే మార్చి 31వ తేదీతో ఇన్వాయిస్లు తయారుచేసి, వాటి మీద వాహనాల వివరాలన్నీ రాసేస్తున్నారు. ఆ తర్వాత తీరిగ్గా డిస్కౌంట్లు అయిపోయిన తర్వాత వాటిని అమ్ముకుని డిస్కౌంట్ మార్జిన్ జేబులో వేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఇన్వాయిస్ తేదీ మార్చి 31 లేదా ఆలోపు ఉంటే తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేసుకోడానికి వీలుంటుంది కాబట్టి ఈ కొత్త టెక్నిక్ ఉపయోగిస్తున్నారు.