BS4 standards
-
రక్తికట్టని జేసీ డ్రామా!
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి చేస్తున్న డ్రామాలు రక్తి కట్టడం లేదు. తాను అవినీతి పరుడిని కాను అని నిరూపించుకునేందుకు ఆయన పడుతున్న పాట్లు చూసి జనం నవ్వుకుంటున్నారు. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా నమ్మడం లేదు. కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి నానా హంగామా చేస్తుండడం చూసి ఈసడించుకుంటున్నారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి కొత్త రకం డ్రామాలకు తెరతీస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలోనే సంచలనం సృష్టించిన బీఎస్3 వాహనాల అమ్మకాల కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డి కీలక నిందితులు. అత్యున్నత దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలే ఈ కేసులపై విచారణ చేసి కోర్టుల్లో ఛార్జ్ షీట్లు వేశాయి. దీంతో కొన్ని రోజులుగా న్యాయస్థానాల్లో కేసుల విచారణ జరుగుతోంది. విషయం ఇలా ఉంటే.. రవాణా శాఖ అధికారులేదో తనకు అన్యాయం చేసినట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. ధర్నాలు.. ఫిర్యాదులతో నవ్వుల పాలు జేసీ ప్రభాకర్‌రెడ్డి బీఎస్3 వాహనాలను తుక్కు కింద కొని, నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ఇక్కడ బీఎస్4 కింద అమ్మారనేది ప్రధాన ఆరోపణ. దీంతో పాటు పర్మిట్లు లేకపోయినా వాహనాలను తిప్పిన కేసులో ఈయన వాహనాలను సీజ్ చేశారు. పక్కా ఆధారాలతో కేసు నమోదు చేయడమే కాదు, ఈ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిరోజునుంచే జిల్లాలో అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.ఆర్టీఏ అధికారులు, పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. వారం రోజుల క్రితం మందీమార్బలంతో అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చారు. అప్పటి మంత్రి, రవాణా అధికారులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తాడిపత్రిలో రోజూ ఒక వివాదాన్ని సృష్టించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నా తాను నిజాయితీ పరుడిని అని చెప్పుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. జేసీ ధర్నాలు, ఫిర్యాదులు చూసి కామెడీ చేస్తున్నట్టు జనం భావిస్తున్నారు. సొంత పార్టీ నేతలే ఖండించలేదు.. జేసీ కుటుంబానికి తన సొంత పారీ్టలోనే ఎవరి మద్దతూ లేదు. కేసులు నమోదైనప్పుడు గానీ, విచా రణ జరుగుతున్నప్పుడు గానీ, జైలుకు వెళ్లినప్పుడు గానీ ఎవరూ మాట్లాడలేదు. దర్యాప్తు సంస్థల నివేదిక తప్పు అని ఏ ఒక్కరూ ఖండించలేదు. ఈ పరిస్థితుల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి తనకు న్యాయం జరగాలంటే విచారణ సంస్థలను ఆశ్రయించాల్సి పోయి పోలీసులను టార్గెట్ చేసి ముందుకెళ్తుండడంపై సొంతపారీ్టలోనే తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా.. చంద్రబాబునే ఆశ్రయించి కేసులు కొట్టివేయించుకోవచ్చు కదా అని ఒక రిటైర్డ్ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.జోక్యం చేసుకోలేం జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. వాటిపై జోక్యం చేసుకోలేం. ఇప్పటికే దీనిపై పూర్తిస్థాయి నివేదిక రవాణా శాఖ కమిషనర్‌కు అందజేశాం. జేసీ ప్రభాకర్‌రెడ్డికి కూడా లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చాం. ఈ పరిస్థితుల్లో సీజ్చేసిన వాహనాలను విడుదల చేయలేం. కోర్టు నిర్ణయాన్ని బట్టి రవాణా శాఖ అప్పీల్‌కు వెళ్లాలా, కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలా అన్నది ఉంటుంది. హైకోర్టుతో పాటు జిల్లా కోర్టులోనూ కేసులున్నాయి. కోర్టుల తీర్పు తర్వాతే వాహనాల విడుదలకు సంబంధించిన అంశం తేల్చాల్సి ఉంటుంది. –వీర్రాజు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ -
ఇది ‘బీఎస్-4’ను మించిన స్కాం
సాక్షి, అనంతపురం: తప్పుడు రికార్డులతో వాహనాలను రిజిస్ట్రేషన్ చేసిన ‘నయాదందా’ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం రవాణా శాఖ కార్యాలయంలోని తన చాంబర్లో జిల్లా రవాణా ఉప కమిషనర్ (డీటీసీ) శివరామప్రసాద్ మీడియాకు వెల్లడించారు. నాగాలాండ్‌లో బీఎస్–3 లారీలను తుక్కు కింద కొనుగోలు చేసి బీఎస్–4గా రిజిస్ట్రేషన్లు చేయించిన స్కామ్‌ను మించిన స్కాంగా ఈ ఘటనను అభివర్ణించారు. జిల్లాకు చెందిన ఓ బృందం ఖరీదైన ఇన్నోవా, షిఫ్ట్ కారులను మరో ప్రాంతంలో చోరీ చేసి ఇక్కడకు తీసుకొచ్చి ఆన్లైన్లోని లొసుగుల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించిందంటూ వివరించారు. రూ.50 లక్షలకు పైగా అవినీతి! వాహనం విక్రయం మొదలు... రిజిస్ట్రేషన్ వరకు దాదాపు రూ.50 లక్షలకు పైగా అవినీతి ఇందులో చోటు చేసుకున్నట్లు ఉప రవాణా కమిషనర్ తెలిపారు. ఈ స్కాంలో బాధితులకు ఏమీ తెలియదని స్పష్టం చేశారు. దాదాపు రూ.25 లక్షలు విలువజేసే వాహనాలు రూ.10 లక్షల నుంచి రూ.15లక్షలకే అందుబాటులోకి రావడంతో వారంతా ఆశపడి కొనుగోలు చేసినట్లుగా తమ విచారణలో వెలుగు చూసిందన్నారు. ఇప్పటికే ఆరు వాహనాలను గుర్తించి, వాటి యజమానుల కోసం ఆరా తీయగా వారంత డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, పాస్టర్, రైతులుగా తేలిందన్నారు. ఈ ఆరు వాహనాలే కాకుండా మరో 70 వాహనాల వరకూ అక్రమ రిజిస్ట్రేషన్లు ఉన్నట్లుగా తమ ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసిందన్నారు. వారం రోజుల్లోపు వీటి చిట్టా కూడా బయటపెడతామని పేర్కొన్నారు. అక్రమాలకు ఊతమిచ్చిన ‘వినోద్’ ప్రజలకు రవాణా శాఖ సేవలను మరింత వేగవంతంగా అందించాలనే లక్ష్యంతో ఈ వ్యవస్థను మొత్తం ఆన్లైన్ చేసినట్లు తెలిపారు. దీని ద్వారా కార్యాలయం చుట్టూ ఎవరూ తిరగకుండా ఇంటి పట్టునే ఉంటూ రవాణా శాఖ సేవలను పొందవచ్చునన్నారు. అయితే ఇందులో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని అనంతపురం నగరంలోని వినోద్ ఆర్టీఏ ఆన్లైన్ సర్వీసెస్ సెంటర్ అక్రమాలకు ఊతమిస్తూ వచ్చిందన్నారు. ఇందులో పాత్రధారులైన ఇన్చార్జ్ ఆర్టీఓ మహబూబ్‌బాషా, సీనియర్ అసిస్టెంట్ మాలిక్బాషాను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు గుర్తు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు కొనుగోలు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మొత్తం స్కాంను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, త్వరలో సూత్రధారులపై కూడా చర్యలు ఉంటాయని వివరించారు. జాగ్రత్త పడండి... కార్యాలయం చుట్టూ తిరగకుండానే ఆన్లైన్ ద్వారా ఆర్టీఏ సేవలను మరింత వేగవంతంగా పొందవచ్చునని ప్రజలకు డీటీసీ సూచించారు. ఈ విషయమై చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆర్టీఏకు సంబంధించి 65 రకాల సేవలను సచివాలయాలకు బదలాయించినట్లు తెలిపారు. వాహనాల కొనుగోలుపై అనుమానాల నివృత్తి కోసం రవాణా శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. విలేకరుల సమావేశంలో హిందూపురం ఆర్టీఓ నిరంజన్‌రెడ్డి, ఎంవీఐలు వరప్రసాద్, నరసింహులు పాల్గొన్నారు. -
బైబై బీఎస్– 4.. మార్చి 31 వరకే రిజిస్ట్రేషన్
కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా భారత్ స్టేజ్–6 వాహనాలు మార్కెట్లోకి వచ్చేశాయి. ఇప్పటి వరకూ మార్కెట్లో ఉన్న బీఎస్–4 వాహనాల విక్రయాలు నిలిచిపోనున్నాయి. రవాణాశాఖ అధికారులు మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఈ వాహనాలకురిజిస్ట్రేషన్లు చేయనున్నారు. సుప్రీం ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్–6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. దీంతో ఆయా షోరూంల్లో ఉన్న బీఎస్–4 వాహనాలను విక్రయించేందుకు, డీలర్లు ప్రయత్నాలుప్రారంభించారు. నెల్లూరు(టౌన్): ప్రస్తుతం జిల్లాలో పలు షోరూంల్లో ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ బీఎస్–4 వాహనాలను కొనుగోలు చేసిన వారికి ఇబ్బందులు తప్పేలా లేదు. ఇప్పటి నుంచి కొనుగోలు చేసిన వాహనాలను తాత్కాలిక, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతే వారికి అప్పగించాలని జిల్లా రవాణాశాఖ అధికారులు ఆయా షోరూం డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా వాహనాన్ని అప్పగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే కొనుగోలు చేసి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోని వాహనాలను గుర్తించి వెంటనే వాటికి రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు. మార్చి 31వ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బీఎస్–4 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితుల్లేవు. వాహన డీలర్లు సైతం నిర్ణీత గడువులోపు తమ షోరూంల్లోని బీఎస్–4 వాహనాలను విక్రయిస్తుండంతో పాటు వాటికి రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. షోరూం డీలర్లతో సమావేశం నిర్వహిస్తున్న డీటీసీ సుబ్బారావు ఇక నుంచి వాటికి మాత్రమే.. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్–6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఇప్పటికే బీఎస్–4 వాహనాలు ఆయా షోరూంల్లో వందల సంఖ్యలో నిల్వ ఉన్నట్లు తెలిసింది. వాటిని త్వరగా విక్రయించడం లేదా తయారీ కంపెనీలకు అప్పగించడం చేయాల్సి ఉంటుంది. 2017 మార్చి 31తో బీఎస్–3 వాహనాలను నిలిపి వేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్–4 వాహనాలను విక్రయించారు. అయితే మార్చి 31వ తేదీ లోపు కొనుగోలు చేసిన బీఎస్–3 వాహనాలకు ఏప్రిల్ తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి ఉండదు.రాయితీలు ప్రకటిస్తారా... గతంలో బీఎస్–3 వాహనాలకు గడువు విధించిన సమయంలో ఆయా షోరూం యజమానులు వాహనాల కోనుగోలు కోసం భారీగా రాయితీలు ప్రకటించారు. ఒక్కో వాహనం మీద ధరను బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు రాయితీ ఇచ్చారు. అయితే ఈసారి అదే విధంగా రాయితీలు ఇస్తారా లేక నిర్ణయించిన ధరకే అమ్ముతారన్నది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ విభాగాల్లో వాహనాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదు. గతంలో రోజుకు అన్ని వాహనాలు కలిపి 350కి పైగా రిజిస్ట్రేషన్ అయ్యేవి. ఇప్పుడు పదుల సంఖ్యలో కూడా రిజిస్ట్రేషన్ కాకపోవడంతో డీలర్లు డీలా పడిన పరిస్థితి ఉంది. డీలర్లతో సమావేశం రవాణా కార్యాలయంలో గురువారం ఉప రవాణా కమిషనర్ సుబ్బారావు జిల్లాలోని ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహన డీలర్లతో సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఇప్పటి నుంచి షోరూంల్లో కొనుగోలు చేసిన బీఎస్–4 మోడల్‌కు సంబంధించి ప్రతి వాహనానికి తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్‌ను చేసిన తర్వాతే యజమానులకు అప్పగించాలని తెలిపారు. ఈ ఆదేశాలను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. గతంలో విక్రయించి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కాని వాహనాలను గుర్తించి వాటికి మార్చి 31వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. -
పదివేల వాహనాలపై బీఎస్3 ప్రభావం
► అయినా తక్కువగానే ఆర్థిక నష్టం ► బీఎస్4 ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేస్తున్నాం ► అశోక్ లేల్యాండ్ ఎండీ వినోద్ దాసరి చెన్నై: బీఎస్3 వాహనాల నిషేధంతో తమ వాణిజ్య వాహనాల్లో సుమారు 10,664 యూనిట్లపై ప్రతికూల ప్రభావం పడిందని అశోక్ లేల్యాండ్ తెలిపింది. అయితే, వీటిని అప్‌గ్రేడ్ చేయనుండటం వల్ల ఆర్థిక నష్టం తక్కువ స్థాయిలోనే ఉండగలదని పేర్కొంది. తాము కొత్తగా రూపొందించిన ఇంటెలిజెంట్ ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ (ఐఈజీఆర్) టెక్నాలజీతో బీఎస్3 ఇంజిన్లను బీఎస్4 ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేయనున్నట్లు అశోక్ లేల్యాండ్ ఎండీ వినోద్ దాసరి తెలిపారు. మొత్తం 10,664 బీఎస్3 వాహనాల్లో 95% వాహనాలు డీలర్ల దగ్గర కాకుండా తమ వద్దే ఉన్నాయని ఆయన వివరించారు. వీటిని ఐఈజీఆర్ టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. ఇందుకోసం ప్రతి ఇంజిన్‌కు సుమారు రూ. 20,000 మాత్రమే ఖర్చవుతుందని, వీటిని ఆఫ్టర్‌మార్కెట్ సేల్స్‌లో కొంత ప్రీమియం ధరకు విక్రయిస్తామని వినోద్ దాసరి చెప్పారు. ‘సాధారణంగా బీఎస్3 ఇంజిన్ ధర సుమారు రూ. 1.5 లక్షలుగా ఉంటుంది. అప్‌గ్రేడ్ చేసిన వాటిని దాదాపు రూ. 2 లక్షలకు విక్రయించవచ్చు. కాబట్టి ఆ రకంగా బీఎస్3 నిషేధ ప్రభావాలు మా మీద తక్కువగానే ఉండగలవు‘ అని ఆయన వివరించారు. రూ. 600 కోట్ల పెట్టుబడులు.. క్యాబిన్, ఇంజిన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు కెన్యా, ఐవరీ కోస్ట్‌లలో కొత్తగా అసెంబ్లీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరం సుమారు రూ. 600 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు వినోద్ చెప్పారు. దేశీయంగా వాణిజ్య వాహనాల మార్కెట్ పరిస్థితులు ఆశావహంగా ఉన్నాయని, పరిశ్రమ ఈ ఏడాది సుమారు 10–15% వృద్ధి సాధించవచ్చని వివరించారు. ఆంధ్రప్రదేశ్, కెన్యా, ఐవరీ కోస్ట్‌లో చిన్న ప్లాంట్ల ఏర్పాటుపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు చెప్పారు. ఇవి ప్రాథమికంగా నెలకు 200 యూనిట్ల సామర్ధ్యంతో పనిచేస్తాయని, తర్వాత 400 యూనిట్లకు పెంచుకోవచ్చన్నారు. తూర్పు ఆఫ్రికాలోని దేశాల కోసం కెన్యా ప్లాంటులో, పశ్చిమ ఆఫ్రికా దేశాల మార్కెట్ కోసం ఐవరీ కోస్ట్ ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు వినోద్ వివరించారు.