పదివేల వాహనాలపై బీఎస్‌3 ప్రభావం | Vinod Dasari on BS3 vehicles prohibition | Sakshi
Sakshi News home page

పదివేల వాహనాలపై బీఎస్‌3 ప్రభావం

Published Fri, Apr 21 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM

పదివేల వాహనాలపై బీఎస్‌3 ప్రభావం

పదివేల వాహనాలపై బీఎస్‌3 ప్రభావం

► అయినా తక్కువగానే ఆర్థిక నష్టం
► బీఎస్‌4 ప్రమాణాలకు  అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం
► అశోక్‌ లేల్యాండ్‌ ఎండీ వినోద్‌ దాసరి


చెన్నై: బీఎస్‌3 వాహనాల నిషేధంతో తమ వాణిజ్య వాహనాల్లో సుమారు 10,664 యూనిట్లపై ప్రతికూల ప్రభావం పడిందని అశోక్‌ లేల్యాండ్‌ తెలిపింది. అయితే, వీటిని అప్‌గ్రేడ్‌ చేయనుండటం వల్ల ఆర్థిక నష్టం తక్కువ స్థాయిలోనే ఉండగలదని పేర్కొంది. తాము కొత్తగా రూపొందించిన ఇంటెలిజెంట్‌ ఎగ్జాస్ట్‌ గ్యాస్‌ రీసర్క్యులేషన్‌ (ఐఈజీఆర్‌) టెక్నాలజీతో బీఎస్‌3 ఇంజిన్లను బీఎస్‌4 ప్రమాణాలకు అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు అశోక్‌ లేల్యాండ్‌ ఎండీ వినోద్‌ దాసరి తెలిపారు.

మొత్తం 10,664 బీఎస్‌3 వాహనాల్లో 95% వాహనాలు డీలర్ల దగ్గర కాకుండా తమ వద్దే ఉన్నాయని ఆయన వివరించారు. వీటిని ఐఈజీఆర్‌ టెక్నాలజీతో అప్‌గ్రేడ్‌ చేస్తామన్నారు. ఇందుకోసం ప్రతి ఇంజిన్‌కు సుమారు రూ. 20,000 మాత్రమే ఖర్చవుతుందని, వీటిని ఆఫ్టర్‌మార్కెట్‌ సేల్స్‌లో కొంత ప్రీమియం ధరకు విక్రయిస్తామని వినోద్‌ దాసరి చెప్పారు. ‘సాధారణంగా బీఎస్‌3 ఇంజిన్‌ ధర సుమారు రూ. 1.5 లక్షలుగా ఉంటుంది. అప్‌గ్రేడ్‌ చేసిన వాటిని దాదాపు రూ. 2 లక్షలకు విక్రయించవచ్చు. కాబట్టి ఆ రకంగా బీఎస్‌3 నిషేధ ప్రభావాలు మా మీద తక్కువగానే ఉండగలవు‘ అని ఆయన వివరించారు.

రూ. 600 కోట్ల పెట్టుబడులు..
క్యాబిన్, ఇంజిన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు కెన్యా, ఐవరీ కోస్ట్‌లలో కొత్తగా అసెంబ్లీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరం సుమారు రూ. 600 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు వినోద్‌ చెప్పారు. దేశీయంగా వాణిజ్య వాహనాల మార్కెట్‌ పరిస్థితులు ఆశావహంగా ఉన్నాయని, పరిశ్రమ ఈ ఏడాది సుమారు 10–15% వృద్ధి సాధించవచ్చని వివరించారు.

ఆంధ్రప్రదేశ్, కెన్యా, ఐవరీ కోస్ట్‌లో చిన్న ప్లాంట్ల ఏర్పాటుపై ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు చెప్పారు. ఇవి ప్రాథమికంగా నెలకు 200 యూనిట్ల సామర్ధ్యంతో పనిచేస్తాయని, తర్వాత 400 యూనిట్లకు పెంచుకోవచ్చన్నారు. తూర్పు ఆఫ్రికాలోని దేశాల కోసం కెన్యా ప్లాంటులో, పశ్చిమ ఆఫ్రికా దేశాల మార్కెట్‌ కోసం ఐవరీ కోస్ట్‌ ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు వినోద్‌ వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement