
బెంగళూరుకు చెందిన మీడియం, హెవీ ఎలక్ట్రిక్ ట్రక్కుల తయారీ సంస్థ ట్రెసా మోటర్స్ బోర్డు ఛైర్మన్‌గా వినోద్ కె దాసరిని నియమించింది. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో వినోద్‌కు ఉన్న విశేష అనుభవం తమ కంపెనీ దేశీయ మార్కెట్‌లో పట్టు సాధించడంతోపాటు అంతర్జాతీయ వ్యాపార అవకాశాల అన్వేషణకు తోడ్పడుతుందని ట్రెసా మోటార్స్ విశ్వసిస్తోంది.
ఇదీ చదవండి ➤ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్న వారికి షాక్! డిస్కౌంట్ డబ్బు వెనక్కి కట్టాలి?
వినోద్ దాసరి గతంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓగా, అశోక్ లేలాండ్ సీఈవో, ఎండీగా పనిచేశారు. అపెక్స్ ఇండస్ట్రీ బాడీ ఎస్‌ఐఏఎంకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2016లో ఆటోకార్ ప్రొఫెషనల్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. ట్రెసా మోటర్స్ చైర్మన్‌గా వినోద్ దాసరి నియామకం తక్షణమే అమల్లోకి రానుంది. ట్రెసా మోటర్స్‌లో కీలక బాధ్యతలను చేపట్టనున్న ఆయన కంపెనీ వ్యూహాత్మక దిశానిర్దేశం, ఆవిష్కరణలను నడపడంలో కీలకంగా వ్యవహరించనున్నారు.
ట్రెసా మోటార్స్ కుటుంబానికి వినోద్ కె దాసరిని స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపక సీఈఓ రోహన్ శ్రవణ్ అన్నారు. ఆటోమోటివ్ రంగంలో వినోద్ విశేష అనుభవం, అద్భుతమైన విజయాలు తమ కంపెనీ వృద్ధి ప్రయాణానికి కీలక వనరులుగా మారుతాయని, ఆయన నాయకత్వంలో ట్రెసా మోటర్స్ కొత్త శిఖరాలకు చేరుకుంటుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రెసా మోటర్స్ ఛైర్మన్‌గా తన నియామకంపై వినోద్ కె దాసరి మాట్లాడుతూ, ట్రెసా మోటార్స్‌లో చేరడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు.
ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్‌పై జీఎస్టీ! పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వర్తింపు
ట్రెసా మోటర్స్ కంపెనీని 2022లో రోహన్ శ్రవణ్, రవి మచాని స్థాపించారు. పారిశ్రామిక డిజైన్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్, బ్యాటరీ సంబంధిత టెక్నాలజీలో ఈ కంపెనీకి విశేష సామర్థ్యం ఉంది. ఇది ప్రస్తుతం 18T-55T GVW విభాగంలో ఎలక్ట్రిక్ ట్రక్కులను అభివృద్ధి చేస్తోంది. దాని మొదటి వాహనం మోడల్ V0.1ని ఇటీవలె ఆవిష్కరించింది. అధికారిక ఉత్పత్తి లాంచ్ 2024 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జరగనుంది.