బ్యాటరీలు లేక.. నెట్వర్క్ పనిచేయక
వినియోగదారుల ఆదరణతో టెలికాం రంగంలో ఓ వెలుగు వెలిగిన బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) సంస్థ క్రమంగా ఉనికి కోల్పోతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టడంతో సంస్థ అభివృద్ధికి ఎటువంటి సహకారం అందడం లేదు. ఫలితంగా బ్యాటరీలు సైతం సమకూర్చుకోలేని దీన స్థితికి ఆ సంస్థ చేరింది. కరెంట్ ఉంటేనే ఫోన్లు పని చేస్తున్నాయి. లేదంటే పని చేయడం లేదు. దీంతో వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు పోర్ట్ అయిపోతున్నారు.
అనంతపురం సిటీ: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో బీఎస్ఎన్ఎల్కు సంబంధించి 2జీ, 3జీ కలిపి మొత్తం 552 టవర్లు ఉన్నాయి. 89 టెలిఫోన్ ఎక్సే్చంజ్‌లు ఉండగా, మొబైల్ ఫోన్లు 4 లక్షలకు పైబడి ఉన్నాయి. ల్యాండ్ ఫోన్లు 11 వేలు, ఫైబర్ నెట్ మరో 11 వేలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, వినియోగదారులకు మెరుగైన సేవలందించడంలో మాత్రం బీఎస్ఎన్ఎల్ విఫలమవుతోంది.
కరెంట్ ఉంటేనే కాల్స్
కరెంట్ ఉంటేనే బీఎస్ఎన్ఎల్ మొబైల్ కాల్స్ వెళ్తున్నాయి. లేని సమయంలో వినియోగదారులకు చుక్కలు కనపడుతున్నాయి. కరెంట్ లేని సమయంలో బ్యాటరీలు వాడితే కొంతైనా ఇబ్బందులు తప్పేవి. అయితే కొన్నేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బ్యాటరీలను సరఫరా చేయడం లేదని తెలిసింది.
దీంతో కరెంట్ సరఫరా లేనప్పుడు టవర్లు పని చేయడం లేదు. ప్రైవేటీకరణ జపం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇండెంట్ ప్రకారం బ్యాటరీలు సరఫరా చేయకపోగా, తగినంత బడ్జెట్ కూడా కేటాయించలేకపోతోందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ప్రైవేటుతో పోటీపడలేక..
టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్.. ప్రైవేటు సంస్థలతో పోటీ పడలేకపోతోంది. ప్రభుత్వరంగ సంస్థపై మమకారంతో ఇన్నాళ్లూ అంటిపెట్టుకొని ఉన్న వినియోగదారులు క్రమంగా దూరమవుతున్నారు. ఇతర నెట్‌వర్క్‌లలోకి పోర్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో ల్యాండ్ఫోన్లు కేవలం ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంటోంది.
కరెంట్ లేకపోతే ఫోన్ పని చేయడం లేదు
మా ఇంట్లో కొన్నేళ్ల నుంచి బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్నాం. గతంలో బాగా పని చేసేది. ఇప్పుడు కరెంట్ ఉంటేనే కాల్స్ వెళ్తున్నాయి. లేకపోతే ఫోన్ మూగబోతోంది. నెట్ కూడా చాలా అధ్వానంగా ఉంది. విసుగెత్తిపోయి ప్రైవేటు నెట్వర్క్కి పోర్ట్ అయ్యాం.
– దర్గా యాస్మిన్, డిగ్రీ విద్యార్థిని, హెచ్ఎల్సీ కాలనీ, అనంతపురం
ప్రైవేటు నెట్‌వర్క్‌లు బాగున్నాయి
బీఎస్ఎన్ఎల్కంటే ప్రైవేటు నెట్వర్క్ బాగా పని చేస్తోంది. ప్రతి నెలా రీచార్జ్ చేసుకోవడమే తప్ప.. బీఎస్ఎన్ఎల్ నుంచి ఎటువంటి సేవలు పొందలేకపోతున్నాం. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. అందుకే ప్రైవేటు నెట్‌వర్క్‌లోకి పోర్ట్ అయ్యాయి.
– ఎం.షాహిద్ ఖాన్, చిరుద్యోగి, ఓబుళదేవరచెరువు
ప్రతిపాదనలు పంపాం
సమస్య ఉన్న మాట వాస్తవమే. బ్యాటరీల కొరతతోనే ఈ పరిస్థితి. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. 14 ఎక్సే్చంజీలకు సరిపడా బ్యాటరీలు రానున్నాయి. పరిస్థితి ఎక్కడైతే తీవ్రంగా ఉందో అక్కడ తొలుత ఏర్పాటు చేస్తాం. సమస్యలన్నీ మరో రెండు నెలల్లో పరిష్కారమవుతాయి.
– బాలగంగాధర్‌రెడ్డి, డీజీఎం, బీఎస్ఎన్ఎల్, అనంతపురం