సూచనలు భేష్.. అమలు మాటేంటో మరి!
దేశంలో ప్రభుత్వ పాలనను మరింత మెరుగుపర్చడానికి, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి అవసరమైన సూచనలు, సలహాలను ఇవ్వాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి స్పందన భారీగా ఉంది. ప్రభుత్వం సూచించిన వెబ్సైట్ 'మైగవ్ డాట్ ఇన్'కు ఇప్పటివరకు 70 వేల సూచనలు వచ్చాయని, వాటిలో 50 వేలు సాధారణ బడ్జెట్‌కు సంబంధించినవి కాగా, మిగతా 20 వేల సూచనలు రైల్వే బడ్జెట్‌కు సంబంధించినవి ఉన్నాయి.
అందులో కొన్ని ప్రభుత్వానికి పనికొచ్చే సృజనాత్మక సూచనలు ఉన్నాయని విశ్వసనీయ ప్రభుత్వవర్గాలు గురువారం వెల్లడించాయి. వాటిని తదుపరి పరిశీలన కోసం పీఎంవోకు, సంబంధిత విభాగాలకు పంపామని ఆ వర్గాలు తెలిపాయి. ఆ సూచనల్లో కొన్ని ఇలా ఉన్నాయి..
1. పన్నులపై డబ్బు ఆదా చేసుకునేందుకు దొంగబిల్లుల దాఖలుకు వీలు కల్పిస్తున్న నిబంధనను రద్దు చేయాలి. చెల్లించిన పన్నులపై కొంత మొత్తాన్ని రీఎంబెర్స్ చేసుకోవడానికి ఉద్యోగులు దొంగ బిల్లులను సమర్పించడం ఎప్పుడూ జరిగేదే.
2. నల్ల డబ్బును అరికట్టేందుకు ఆదాయం పన్ను రిటర్న్స్‌లో కుటుంబసభ్యుల వివరాలు, తమమీద ఆధారపడి బతుకుతున్న వారి వివరాలు, వారందరి పాన్ నెంబర్ల వివరాలను ఇవ్వడం తప్పనిసరి చేయాలి. అలా చేస్తే మొత్తం కుటుంబానికి వస్తున్న ఆదాయం వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.
3. అలాగే ఆదాయం పన్ను రిటర్న్స్‌లో బ్యాంకు ఖాతా వివరాలను ఇచ్చినట్లే తాను, తన కుటుంబ సభ్యులు, బంధువుల ఆస్తుల వివరాలను, వాటి మార్కెట్ విలువను, వాటి చిరునామాలను తప్పనిసరిగా సమర్పించాలనే నిబంధనను తీసుకరావాలి. ఎందుకంటే కొంత మంది నల్లడబ్బును తెల్లగా మార్చుకునేందుకు కుటుంబ సభ్యులు, బంధువుల పేర్ల మీదున్న ఆస్తులను ఉపయోగించుకుంటున్నారు.
4. ఈసారి సాధారణ బడ్జెట్లో ఔషధాలపై సబ్సిడీలు ఇవ్వాలి. వైన్, సిగరెట్, బీడీ, పాన్ మసాలా, గుట్కా తదితరాలపై పన్నులను పది శాతం పెంచాలి.
5. రైల్వేల ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు అన్ని రైళ్లలోని అన్ని బోగీలపై వాణిజ్య ప్రకటనలకు అనుమతించాలి. రైల్వే ఆస్తులను, మౌలిక సౌకర్యాలను కూడా వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించాలి. ఈ విషయంలో అవసరమైతే కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం చేసుకోవాలి.
6. పన్నుల విధానాన్ని సులభతరం చేయాలి. ఆస్తిపన్నును రద్దుచేయాలి. దేశంలో యోగాను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పన్ను రాయతీని కల్పించాలి.
సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్లను రూపొందించడానికి ముందు ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సూచన మేరకు ఆర్థిక, రైల్వేశాఖలు సూచనలను ఇవ్వాలని గత డిసెంబర్ నెలలో ప్రజలను కోరాయి. గత బడ్జెట్‌కు ముందు కూడా ప్రభుత్వం ఇలాంటి సూచనలే కోరింది. అప్పడు ప్రజలనుంచి వచ్చిన కొన్ని సూచనలను జనరల్, రైల్వే బడ్జెట్లో పొందుపర్చారు కూడా.