Budget Target
-
అంచనాలు మించనున్న ద్రవ్యలోటు
⇒ఇప్పటికే బడ్జెట్ లక్ష్యంలో 99% చేరిక ⇒నవంబర్ వరకూ పరిస్థితిపై గణాంకాలు న్యూఢిల్లీ: కేంద్ర ద్రవ్య పరిస్థితి క్లిష్టతను సూచిస్తూ ‘లోటు’ గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. ఏప్రిల్-నవంబర్ మధ్య ద్రవ్యలోటు రూ.5.25 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2014-15 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లక్ష్యంలో (రూ.5.31 లక్షల కోట్లు) ఈ పరిమాణం ఇప్పటికే దాదాపు 99 శాతానికి చేరినట్లయ్యింది. ఆర్థిక సంవత్సరంలో ఇంకా నాలుగు నెలలు మిగిలి ఉండగానే ద్రవ్యలోటు 99 శాతానికి చేరిపోవడం స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి చర్చనీయాంశం. గత ఏడాది ఇదే నెలకు ద్రవ్యలోటు 93.9 శాతంగా ఉంది. కేంద్రానికి ఒక నిర్దిష్ట ఏడాదిలో వచ్చే మొత్తం ఆదాయం-చేసే వ్యయం మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పేర్కొంటాం. రెవెన్యూ భారీగా తగ్గడమే తాజా పరిస్థితికి కారణమని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం మొత్తంగా రూ.9.77 లక్షల కోట్ల నికర పన్ను వసూళ్లను బడ్జెట్ అంచనా వేసింది. అయితే నవంబర్ నాటికి ఈ మొత్తం రూ.4.13 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ తాజాగా ఈ గణాంకాలను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటును 4.1 శాతం (రూ.5.31 లక్షల కోట్లు) వద్ద కట్టడి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటికే ఈ పరిమాణం 98.9 శాతానికి చేరడంతో లక్ష్యసాధన కష్టమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2013-14లో జీడీపీలో ద్రవ్యలోటు 4.5 శాతం (రూ.5.08 లక్షల కోట్లు). 2012-13లో ఇది 4.9 శాతంగా ఉంది. -
ద్రవ్యలోటును కట్టడి చేస్తాం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును జీడీపీలో 4.8%కు లోపు కట్టడి చేయగలమని ఆర్థిక మంత్రి పి. చిదంబరం తాజాగా స్పష్టం చేశారు. 4.8% దాటి తే ఆందోళనకరమని, అయితే దీనిని దాటబోమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఈ నవంబర్ చివరికి బడ్జెట్ అంచనాల్లో 94%కు ద్రవ్యలోటు చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందిస్తూ చిదంబరం డిసెంబర్లో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, వెరసి లోటు తగ్గుముఖం పడుతుందని వివరించారు. డిసెంబర్లో ముందస్తు పన్ను చెల్లింపులు వసూలుకావడంతోపాటు, ప్రభుత్వ వ్యయాలు క్షీణిస్తాయని చెప్పారు. దీంతో ద్రవ్యలోటుకు కళ్లెం పడుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాదికి ద్రవ్యలోటును జీడీపీలో 4.8%కు పరిమితం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ బాటలో 2016-17కల్లా 3%కు తగ్గించాలని భావిస్తోంది. గడిచిన ఏడాది (2012-13)లో లోటు 4.9%గా నమోదైన సంగతి తెలిసిందే. కష్టమే... ఆదాయాలు క్షీణించడం, డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని సాధించలేకపోవడం వంటి అంశాల నేపథ్యంలో ద్రవ్యలోటును కట్టడి చేయడం ప్రభుత్వానికి కష్టతరమైన అంశంగా నిలవనుంది. లోటు కట్టడికి ప్రణాళికా వ్యయాలను రూ. లక్ష కోట్లమేర ప్రభుత్వం తగ్గించుకోవలసి ఉంటుంది. డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ. 40,000 కోట్ల సమీకరణ లక్ష్యం కాగా, ప్రభుత్వం కేవలం రూ. 3,000 కోట్లను సమకూర్చుకోగలిగింది. ఏప్రిల్-నవంబర్’13 కాలంలో ద్రవ్యలోటు రూ. 5,09,557 కోట్లకు చేరింది. ఇది వార్షిక లక్ష్యంలో దాదాపు 94%కాగా, గతేడాది ఇదే కాలానికి 80% స్థాయిలో లోటు నమోదైంది. ఈ ఏడాదికి ఆదాయాలు, వ్యయాల మధ్య లోటును రూ. 5,42,499 కోట్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.