కార్లతో రోబో బంతాట..
మనం మూడు బంతులు తీసుకుని.. ఒకదాని తర్వాత ఒకటి గాల్లోకి విసురుతూ ఇలా ఆడగలం. కానీ బగ్జగ్లర్ అనే ఈ రోబో ఏకంగా మూడు కార్లను గాల్లోకి ఎగరేసి.. ఆడుకుంటుంది. 70 అడుగుల పొడవుండే ఈ రోబో రూపకల్పన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. డాన్ గ్రానెట్ అనే నాసా మాజీ ఇంజనీర్ దీని రూపకర్త. హైడ్రాలిక్ సిలిండర్ల సాయంతో ఇది ఒక్కోటి 1,200 కిలోల బరువుండే కార్లను గాల్లో విసురుతూ ఆడగలదని ఆయన చెబుతున్నారు.
ప్రస్తుతం తాము రూపొందించిన మోడల్ 112 కిలోల బరువున్న వస్తువులను ఎత్తి విసరగలుగుతుందని.. పూర్తిస్థాయిలో దీన్ని రూపొందించడానికి రూ.14 కోట్లు అవసరమని.. పెట్టుబడుల కోసం తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అయితే.. ఈ రోబో తనంతట తానే పనిచేయదు. దీని తల స్థానంలో ఒక ఆపరేటర్ కూర్చుని.. దీన్ని నియంత్రిస్తుంటాడు. జనాన్ని తన ‘ఆట’లతో ఈ రోబో అలరిస్తుందని.. కార్ల రేసులు వంటి కార్యక్రమాల్లో దీన్తో ప్రదర్శనలు ఇప్పించవచ్చని గ్రానెట్ చెబుతున్నారు.