రాజేశ్వరికి ‘సుద్దాల’ పురస్కారం
సిరిసిల్ల: రాష్ట్రస్థాయిలో ప్రతిష్టాత్మకంగా అంది స్తున్న సుద్దాల హన్మంతు జానకమ్మ పురస్కారం కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన కుమారి బూర రాజేశ్వరికి లభించింది. ఈ నెల 6న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్టు ఫౌండేషన్ అధ్యక్షుడు సుద్దాల అశోక్‌తేజ ప్రకటించారు.
రాజేశ్వరి అంగవైకల్యంతో బాధపడుతూ ఏడో తరగతి వరకు చదువుకున్నారు. సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆమెకు చేతులు లేకపోవడంతో కాలుతోనే కవితలు రాస్తుంది. ఆమె గురించి తెలుసుకున్న ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ సిరిసిల్లకు వచ్చి కలిశారు. ‘సంకల్పం ముందు వైకల్యం ఎంత.. దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత.. ఎదురీత ముందు విధిరాత ఎంత.. పోరాటం ముందు ఆరాటం ఎంత’ అంటూ రాజేశ్వరి సా హిత్యాన్ని అశోక్‌తేజ కవిత్వీకరించారు. రాజేశ్వరి కవితలను సుద్దాల ఫౌండేషన్ ద్వారా ముద్రిం చారు. ఆ పుస్తకాన్ని సిరిసిల్ల రాజేశ్వరి కవిత్వం గా జనవరి 6న రవీంద్రభారతి వేదికగా ఆవిష్కరిస్తున్నారు. ఈ పుస్తకానికి డాక్టర్ సినారె ముందు మాట రాశారు.
పుస్తక ఆవిష్కరణోత్సవంలో సినారె, ఐటీ, పీఆర్ శాఖ మంత్రి కేటీఆర్, ప్రభు త్వ సలహాదారు కేవీ రమణాచారి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, సినీ నట దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి, నటుడు ఉత్తేజ్, ప్రజాగాయని సుద్దాల భారతి పాల్గొంటారని సుద్దాల ఫౌండేషన్ పేర్కొంది. సుద్దాల హన్మంతు పురస్కారాలను ఇప్పటివరకు ప్రముఖ సినీ దర్శక నిర్మాత బి.నర్సింగరావు, ప్రజాగాయకుడు గద్ద ర్, పద్మభూషన్ డాక్టర్ తీజన్బాయ్, కెన్యా దేశ రచయిత ప్రొఫెసర్ ఎన్.గుగి వాథియాంగో అందుకున్నారు.