Burra Subrahmanya Sastry
-
పద్మ అవార్డుల్లో ‘బుర్రా’కు తీరని అన్యాయం
తెనాలి: భరతముని నాట్య శాస్త్రాన్ని రంగస్థలంపై అనుసరించిన మహానటుడు బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రికి రాష్ట్ర ప్రభుత్వం 14 పర్యాయాలు సిఫార్సు చేసినా, కేంద్రం పద్మశ్రీ అవార్డు ఇవ్వలేకపోయిందని సినీనటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. రంగస్థ్థలంపై స్త్రీ పాత్రలో సహజంగా నటించిన సుబ్రహ్మణ్యశాస్త్రిని అతని భార్యే గుర్తుపట్టలేకపోయారని దీనికి మించిన అవార్డు మరొకటి లేదని తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బుధవారం కళల కాణాచి సంస్థ ఆధ్వర్యంలో బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాన్ని ప్రఖ్యాత నటుడు జీఎస్ఎన్ శాస్త్రికి ప్రదానం చేశారు. ఆర్.నారాయణమూర్తి, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌లు రూ.25 వేల నగదు, జ్ఞాపికతో శాస్త్రి దంపతులను సత్కరించారు. ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ..హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో తెనాలికి చెందిన మహనీయుల విగ్రహాలతో తెనాలి బండ్‌ను త్వరలోనే సాకారం చేయనున్నట్లు చెప్పారు. అవార్డు గ్రహీత శాస్త్రి తనకు పురస్కారంతో పాటు వచ్చిన రూ.25 వేలను సంస్థ కార్యకలాపాలకే వినియోగించాలని కోరుతూ దాన్ని నిర్వాహకులకు అందజేశారు. సభకు వేదగంగోత్రి ఫౌండేషన్, విజయవాడ వ్యవస్థాపకుడు వరప్రసాద్ అధ్యక్షత వహించారు. -
రంగస్థల నటుడు బుర్రా కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: నాట్యాచార్య, అభినయ సరస్వతి, నాట్య మయూరిలాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న ప్రముఖ రంగస్థల నటులు, కవి, కావ్యరచయిత, వెండితెర, బుల్లితెరలపై సుపరిచితులయిన మహాకళాకారుడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి (83) లంగర్‌హౌస్‌లోని తన స్వగృహంలో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. స్త్రీ పాత్రధారణలో గొప్ప నటుడిగా కీర్తి గడించిన శాస్త్రి 1936లో జన్మించారు. ఆయనకు భార్య, ఆరుగురు పిల్లలు ఉన్నారు. శాస్త్రి అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం రాయదుర్గంలోని మహాప్రస్థానంలో నిర్వహించారు. ఆయనదీ ‘మహా ప్రస్థానమే’ 1936, ఫిబ్రవరి 9న కృష్ణాజిల్లా దివి తాలుకా కోడూరులో బుర్రా పద్మనాభ సోమయాజులు, సీతామహాలక్ష్మి దంపతులకు జన్మించిన ఈయన మేనమామ కోటేశ్వరరావు పర్యవేక్షణలో పద్యాలు నేర్చుకున్నారు. వానపాముల సత్యనారాయణ వద్ద కూడా భావయుక్తంగా పద్యాలు పాడడంపై శిక్షణ తీసుకున్నారు. ఈయనలోని నటనా విశిష్టతను బి.వి.నర్సింహారావు గుర్తించి నూతన ప్రయోగ రీతులను నేర్పారు. అకుంఠిత దీక్షతో నటన నేర్చుకున్న శాస్త్రి, ఉత్తమ స్త్రీ పాత్రలైన సత్యభామ, చింతామణి, సక్కుబాయి, చంద్రమతి, మోహిని, మాధురి తదితర పాత్రల్లో నటించారు. ఆయన చూపు మన్మథబాణంలా ఉండేదని, ప్రేక్షకుల కరతాళధ్వనులతో మారుమ్రోగిపోయేదని, శృంగార రసాధి దేవతగా ఆయన ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసేవారని నాటక ప్రియులు చెబుతుంటారు. ఆయన వేసిన నాటకాల్లో స్త్రీ పాత్రల్లోనే ఎక్కువగా నటించినందున ‘చింతామణి శాస్త్రి’గా గుర్తింపు పొందారు. సత్యసాయిబాబా నాటక సమాజాన్ని స్థాపించిన ఆయన అనేక ప్రదర్శనల ద్వారా రసజ్ఞులను మెప్పించారు. 1970వ దశకంలో చిత్రరంగ ప్రవేశం చేసిన ఆయన, వీరంకి శర్మ దర్శకత్వంలో ‘నాలాగా ఎందరో’అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన స్వయంకృషి సినిమాలోనూ ఓ పాత్రను పోషించారు. సత్యనారాయణస్వామి అనే సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. శిఖరం, పుత్తడిబొమ్మ, ఆడదే ఆధారం, రుద్రపీఠం సీరియళ్లలో నటించారు. ఈయన దర్శకత్వం వహించిన ‘కృష్ణాతీరం’అనే సీరియల్‌కు నంది అవార్డు కూడా వచ్చింది. ఈయన నటనలోనే కాదు ప్రవచనాలు చెప్పడంలోనూ సిద్ధహస్తులుగా పేరొందారు. దేవీ భాగవతం, హనుమత్‌చరిత్ర ప్రవచాలను చెప్పేవారు. కవిగా వాల్మీకి రామాయణాన్ని తనదైన పంథాలో రాసిన ఘనత ఈయన సొంతం. ‘అష్టావిధ శృంగార నాయికలు’అనే కావ్యంతో ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. వేమన చరిత్ర, ప్రణవక్షేత్రం లాంటి ప్రసిద్ధ నాటకాల్లో నటించారు. ఈయన స్వయంగా రాసిన ‘త్యాగయ్య’అనే నాటకం వేదిక ఎక్కకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణ వార్త తెలియడంతో సినీ, సాహితీ, రంగస్థల రంగాలకు చెందిన పలువురు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
భామనే...సత్యభామనే..!
కళల పట్ల కాస్త ఆసక్తి ఉన్న ఎవరికైనా సరే.. స్థానం నరసింహారావు పేరు తప్పక గుర్తుంటుంది. తెలుగు నాటకరంగంలో తొలి ‘పద్మశ్రీ’ ఆయన. స్థానంవారు రంగస్థలంపై గొప్ప పాత్రలు చాలా పోషించినా.. ఆయనకు బాగా పేరు తెచ్చిన పాత్ర మాత్రం ‘సత్యభామ’. స్త్రీ పాత్ర. ఒక్క సత్యభామే కాదు, చింతామణి లాంటి వేశ్య పాత్రను కూడా పోషించి మెప్పించారాయన. రంగస్థలంపై ఆయన తర్వాత స్త్రీ పాత్రధారణతో మెప్పించిన మహానటుడు బుర్రా సుబ్రమణ్యశాస్త్రి. ఆయనకైతే.. లవ్ ప్రపోజల్స్ కూడా వచ్చాయి. ఆడవారికే మతిపోగొట్టే వయ్యారం శాస్త్రిది. సినిమా అనేది రాకముందు ప్రజానీకానికి ప్రధాన వినోద సాధనం నాటకమే. అప్పట్లో రంగస్థలంపై ఆడవారు కనిపిస్తే, పాపంగా ఫీలయ్యేవారు. ‘హవ్వ’ అని బుగ్గలు నొక్కేసుకునేవారు. అలాంటి టైమ్‌లో ఆడపాత్రలన్నీ పోషించింది మగవారే. నాటి నుంచి నేటి దాకా ఎంతమంది రంగస్థలంపై స్త్రీలుగా అలరించినా... స్థానం, బుర్రా వారి స్థానం మాత్రం చిరస్మరణీయం. ఇప్పుడు వీరి టాపిక్ ఎందుకొచ్చిందంటే... వీరిని ఆదర్శంగా తీసుకొని వెండితెరపై కూడా స్త్రీలుగా అలరించిన, అలరిస్తున్న మేటి నటులు ఎందరో ఉన్నారు.సినీ హీరోల్లో స్త్రీ పాత్ర అనగానే.. ముందు గుర్తొచ్చేది అక్కినేని. నిజానికి వెండితెరపై ఆయన స్త్రీగా కనిపించింది తక్కువే. వీరుడిగా, భగ్న ప్రేమికునిగా, లవర్‌బోయ్‌గానే ఎక్కువగా కనిపించారు. రంగస్థలంపై మాత్రం ఎన్నో స్త్రీ పాత్రలు పోషించారు. అక్కినేని వెండితెరపై స్త్రీగా కనిపించిన సినిమా ‘తెనాలి రామకృష్ణ’(1956). కృష్ణసాని బండారాన్ని బట్టబయలు చేయడానికి రామకృష్ణుడు స్త్రీ వేషం కడతాడు. ఆ పాత్రలో అక్కినేని అభినయం అద్భుతం. పైగా కృష్ణసానిగా చేసింది భానుమతి. ఆమెకు దీటుగా స్త్రీ వేషంలో అక్కినేని ఆ సన్నివేశాన్ని నిజంగా చూసి తీరాల్సిందే. సహజంగా వయ్యారం అక్కినేని సొంతం. మరోవైపు నాటకానుభవం. ఇంకేం... ఆ సన్నివేశాన్ని పండించారు.చర్చ ఆడ వేషాల గురించే అయినా, ‘నర్తనశాల’(1963)లోని బృహన్నల పాత్రను కూడా ఇక్కడ స్మరించుకోవాల్సిందే. ‘బృహన్నల’ అంటే పేడి. స్త్రీ కాదు. అయినా... వయ్యారం, హొయలు, ఆహార్యం, ఆంగికం, నడక, నడత... ఇవన్నీ స్త్రీనే పోలి ఉంటాయి. ఈ సినిమా చేసే సమయానికి ఎన్టీఆర్ తెలుగుతెరకు మకుటం లేని మహారాజు. ప్రేక్షకులు ఆయనలో జగదేకవీరుణ్ణి చూసుకుంటున్న రోజులవి. అలాంటి రోజుల్లో ఈ హిజ్రా వేషం కట్టారాయన. పేడితనంలో అంతర్లీనంగా ఉండే ఆడతనాన్ని నభూతో నభవిష్యతి అనేలా పలికించారు. భారతదేశ చలనచిత్ర చరిత్రలో సినిమా ఆద్యంతం హిజ్రాగా నటించిన ఏకైక సూపర్‌స్టార్ ఎన్టీఆర్ మాత్రమే. ఇది గొప్ప సాహసం. మళ్లీ ఆయనే... అదే పాత్రను ‘శ్రీమద్విరాటపర్వం’(1979)లో చేసినా.. అంత గొప్పగా రాణించలేకపోయారు. ఎన్టీఆర్ స్త్రీ పాత్రల విషయానికొస్తే... దేవాంతకుడు(1960), పిడుగురాముడు(1966) చిత్రాలనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ‘పిడుగురాముడు’లో అయితే, ‘రంగులు రంగులు రంగులు.. హోయ్ రమణులు వలపుల పొంగులు’ పాటలో లేడీగా.. ఎన్టీఆర్ స్టెప్పులు మాస్‌ని కట్టిపడేశాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల తరంలో హీరోలకు మీసం తప్పనిసరి కాదు. ఆ తరం హీరోలందరూ పాత్రోచితంగా మీసాలు లేకుండా కూడా నటించేశారు. అందుకే స్త్రీ పాత్రలనూ తేలిగ్గా పోషించగలిగారు. కానీ 80ల్లోకొచ్చేసరికి హీరోకి మీసం కంపల్సరీ అయ్యింది. హీరో అనేవాడు మీసం తీయడం సాహసంతో కూడిన విషయంగా మారింది. అలాంటి సందర్భంలోనూ దర్శకుని మాటను శిరసావహిస్తూ చాలా ధైర్యంగా మీసం తీసేశారు చిరంజీవి. ‘నా పేరు మిస్సు మేరీ...’ అంటూ లేడీ గెటప్పులో అదరగొట్టేశారు. ఆ సినిమానే ‘చంటబ్బాయి’ (1986). నిజానికి అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ చిరంజీవి ఎప్పుడూ మీసం తీయలేదు. ఆయనకు మీసమే అందం కూడా. పాత్ర కోసం ఆ మీసాన్నే త్యాగం చేశారాయన. ఇక స్త్రీ పాత్ర అనగానే... కచ్చితంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి నరేష్. జంధ్యాల ‘చూపులు కలిసిన శుభవేళ’ (1988)లో తొలిసారి ఆయన లేడీ గెటప్ వేశారు. సుత్తివీరభద్రరావు, నరేష్‌లపై ‘చూపులు కలిసిన శుభవేళ...’ అంటూ... ఓ పేరడీ యుగళగీతాన్ని కూడా తీశారు జంధ్యాల. ఆ తర్వాత వచ్చింది ‘చిత్రం భళారే విచిత్రం’(1992). ఇక ఈ సినిమాలోని నరేష్ చేసిన స్త్రీ పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రోజారమణి డబ్బింగ్ ఆ పాత్రకు మరింత వన్నె తెచ్చింది. కళ్లలో అమాయకత్వం, ఒళ్లంతా వయ్యారం, సిగ్గు పడుతూ ఆ కొంటెనవ్వు.. అవన్నీ చూసి ఆడవారు సైతం అసూయ పడ్డారంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమా విజయానికి ఆ గెటప్ ప్రధాన పాత్రే పోషించింది. రీసెంట్గా ‘కార్తీకమాసం’ చిత్రంలో కూడా లేడీ గెటప్ వేశారు నరేష్. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ నిర్మించి, నటించిన చిత్రం ‘మేడమ్’ (1993). ఇందులో రాజేంద్రప్రసాద్ స్త్రీగా నటించడమే కాదు, సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. ధీరవనితగా నటకిరీటి అభినయం విమర్శకుల ప్రశంలందుకుంది. ‘మహిళా ఇక నిదుర నుంచి మేలుకో...’ అంటూ మహిళాలోకానికి లేడీ గెటప్పులో పిలుపును కూడా ఇస్తారు ఇందులో రాజేంద్రప్రసాద్. ఆ పాటను ఎస్పీ బాలు పాడటం విశేషం. ఇక ‘భామనే సత్యభామనే’ (1996)లో భామా రుక్మిణిగా కమల్‌హాసన్ ఒలికించిన వయ్యారాన్ని తేలిగ్గా మరిచిపోగలమా! బాలకృష్ణ కూడా ‘పాండురంగడు’(2008)లో స్త్రీగా కనిపించి, పలువురి ప్రశంసలు పొందారు. తాత అక్కినేని స్ఫూర్తిగా సుమంత్ కూడా ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ చిత్రంలో లేడీ గెటప్ వేశారు. తాత పోలికలు ఉండటం వల్లనో ఏమో.. ఆ వేషంలో జనానికి తెగ నచ్చేశారు. వీరి తర్వాత ఇప్పుడు మంచు మనోజ్ వంతు వచ్చింది. ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో దాదాపు ద్వితీయార్ధమంతా లేడీ గెటప్‌తోనే అలరించేశారు మనోజ్. ఇందులో మనోజ్ పాత్రే హైలైట్. ఏది ఏమైనా... మగవాళ్లు ఆడవారిగా నటించడం కత్తి మీద సామే. హాస్యం హద్దు మీరితే అపహాస్యం అవుతుంది. అలాగే... స్త్రీ పాత్ర పోషణలో ఏ మాత్రం తప్పులు దొర్లినా... పేడి లక్షణాలుగా బహిర్గతమవుతాయి. యువనటులు అయినా కూడా ‘స్త్రీ పాత్రలు’ చేయడానికి ధైర్యంగా ముందుకు రావడం నిజంగా ఆనందించదగ్గ విషయమే.