భామనే...సత్యభామనే..! | hero in lady getups | Sakshi
Sakshi News home page

భామనే...సత్యభామనే..!

Published Tue, Feb 4 2014 12:13 AM | Last Updated on Thu, May 24 2018 12:20 PM

hero in lady getups

కళల పట్ల కాస్త ఆసక్తి ఉన్న ఎవరికైనా సరే.. స్థానం నరసింహారావు పేరు తప్పక గుర్తుంటుంది. తెలుగు నాటకరంగంలో తొలి ‘పద్మశ్రీ’ ఆయన. స్థానంవారు రంగస్థలంపై గొప్ప పాత్రలు చాలా పోషించినా.. ఆయనకు బాగా పేరు తెచ్చిన పాత్ర మాత్రం ‘సత్యభామ’. స్త్రీ పాత్ర. ఒక్క సత్యభామే కాదు, చింతామణి లాంటి వేశ్య పాత్రను కూడా పోషించి మెప్పించారాయన. రంగస్థలంపై ఆయన తర్వాత స్త్రీ పాత్రధారణతో మెప్పించిన మహానటుడు బుర్రా సుబ్రమణ్యశాస్త్రి. ఆయనకైతే.. లవ్ ప్రపోజల్స్ కూడా వచ్చాయి. ఆడవారికే మతిపోగొట్టే వయ్యారం శాస్త్రిది. సినిమా అనేది రాకముందు ప్రజానీకానికి ప్రధాన వినోద సాధనం నాటకమే.
 
 
 అప్పట్లో రంగస్థలంపై ఆడవారు కనిపిస్తే, పాపంగా ఫీలయ్యేవారు. ‘హవ్వ’ అని బుగ్గలు నొక్కేసుకునేవారు. అలాంటి టైమ్‌లో ఆడపాత్రలన్నీ పోషించింది మగవారే. నాటి నుంచి నేటి దాకా ఎంతమంది రంగస్థలంపై స్త్రీలుగా అలరించినా... స్థానం, బుర్రా వారి స్థానం మాత్రం చిరస్మరణీయం. ఇప్పుడు వీరి టాపిక్ ఎందుకొచ్చిందంటే... వీరిని ఆదర్శంగా తీసుకొని వెండితెరపై కూడా స్త్రీలుగా అలరించిన, అలరిస్తున్న మేటి నటులు ఎందరో ఉన్నారు.సినీ హీరోల్లో స్త్రీ పాత్ర అనగానే.. ముందు గుర్తొచ్చేది అక్కినేని. నిజానికి వెండితెరపై ఆయన స్త్రీగా కనిపించింది తక్కువే. వీరుడిగా, భగ్న ప్రేమికునిగా, లవర్‌బోయ్‌గానే ఎక్కువగా కనిపించారు. రంగస్థలంపై మాత్రం ఎన్నో స్త్రీ పాత్రలు పోషించారు.
 
 అక్కినేని వెండితెరపై స్త్రీగా కనిపించిన సినిమా ‘తెనాలి రామకృష్ణ’(1956). కృష్ణసాని బండారాన్ని బట్టబయలు చేయడానికి రామకృష్ణుడు స్త్రీ వేషం కడతాడు. ఆ పాత్రలో అక్కినేని అభినయం అద్భుతం. పైగా కృష్ణసానిగా చేసింది భానుమతి. ఆమెకు దీటుగా స్త్రీ వేషంలో అక్కినేని ఆ సన్నివేశాన్ని నిజంగా చూసి తీరాల్సిందే. సహజంగా వయ్యారం అక్కినేని సొంతం. మరోవైపు నాటకానుభవం. ఇంకేం... ఆ సన్నివేశాన్ని పండించారు.చర్చ ఆడ వేషాల గురించే అయినా, ‘నర్తనశాల’(1963)లోని బృహన్నల పాత్రను కూడా ఇక్కడ స్మరించుకోవాల్సిందే. ‘బృహన్నల’ అంటే పేడి. స్త్రీ కాదు. అయినా... వయ్యారం, హొయలు, ఆహార్యం, ఆంగికం, నడక, నడత... ఇవన్నీ స్త్రీనే పోలి ఉంటాయి. ఈ సినిమా చేసే సమయానికి ఎన్టీఆర్ తెలుగుతెరకు మకుటం లేని మహారాజు.
 
 ప్రేక్షకులు ఆయనలో జగదేకవీరుణ్ణి చూసుకుంటున్న రోజులవి. అలాంటి రోజుల్లో ఈ హిజ్రా వేషం కట్టారాయన. పేడితనంలో అంతర్లీనంగా ఉండే ఆడతనాన్ని నభూతో నభవిష్యతి అనేలా పలికించారు. భారతదేశ చలనచిత్ర చరిత్రలో సినిమా ఆద్యంతం హిజ్రాగా నటించిన ఏకైక సూపర్‌స్టార్ ఎన్టీఆర్ మాత్రమే. ఇది గొప్ప సాహసం. మళ్లీ ఆయనే... అదే పాత్రను ‘శ్రీమద్విరాటపర్వం’(1979)లో చేసినా.. అంత గొప్పగా రాణించలేకపోయారు. ఎన్టీఆర్ స్త్రీ పాత్రల విషయానికొస్తే... దేవాంతకుడు(1960), పిడుగురాముడు(1966) చిత్రాలనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ‘పిడుగురాముడు’లో అయితే, ‘రంగులు రంగులు రంగులు.. హోయ్ రమణులు వలపుల పొంగులు’ పాటలో లేడీగా..  ఎన్టీఆర్ స్టెప్పులు మాస్‌ని కట్టిపడేశాయి. 
 
 ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల తరంలో హీరోలకు మీసం తప్పనిసరి కాదు. ఆ తరం హీరోలందరూ పాత్రోచితంగా మీసాలు లేకుండా కూడా నటించేశారు. అందుకే స్త్రీ పాత్రలనూ తేలిగ్గా పోషించగలిగారు. కానీ 80ల్లోకొచ్చేసరికి హీరోకి మీసం కంపల్సరీ అయ్యింది. హీరో అనేవాడు మీసం తీయడం సాహసంతో కూడిన విషయంగా మారింది. అలాంటి సందర్భంలోనూ దర్శకుని మాటను శిరసావహిస్తూ చాలా ధైర్యంగా మీసం తీసేశారు  చిరంజీవి. ‘నా పేరు మిస్సు మేరీ...’ అంటూ లేడీ గెటప్పులో అదరగొట్టేశారు. ఆ సినిమానే ‘చంటబ్బాయి’ (1986). నిజానికి అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ చిరంజీవి ఎప్పుడూ మీసం తీయలేదు. ఆయనకు మీసమే అందం కూడా. పాత్ర కోసం ఆ మీసాన్నే త్యాగం చేశారాయన.
 
 ఇక స్త్రీ పాత్ర అనగానే... కచ్చితంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి నరేష్. జంధ్యాల ‘చూపులు కలిసిన శుభవేళ’ (1988)లో తొలిసారి ఆయన లేడీ గెటప్ వేశారు. సుత్తివీరభద్రరావు, నరేష్‌లపై ‘చూపులు కలిసిన శుభవేళ...’ అంటూ... ఓ పేరడీ యుగళగీతాన్ని కూడా తీశారు జంధ్యాల. ఆ తర్వాత వచ్చింది ‘చిత్రం భళారే విచిత్రం’(1992). ఇక ఈ సినిమాలోని నరేష్ చేసిన స్త్రీ పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రోజారమణి డబ్బింగ్ ఆ పాత్రకు మరింత వన్నె తెచ్చింది. కళ్లలో అమాయకత్వం, ఒళ్లంతా వయ్యారం, సిగ్గు పడుతూ ఆ కొంటెనవ్వు.. అవన్నీ చూసి ఆడవారు సైతం అసూయ పడ్డారంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమా విజయానికి ఆ గెటప్ ప్రధాన పాత్రే పోషించింది. రీసెంట్‌గా ‘కార్తీకమాసం’ చిత్రంలో కూడా లేడీ గెటప్ వేశారు నరేష్. 
 
 సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ నిర్మించి, నటించిన చిత్రం ‘మేడమ్’ (1993). ఇందులో రాజేంద్రప్రసాద్ స్త్రీగా నటించడమే కాదు, సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. ధీరవనితగా నటకిరీటి అభినయం విమర్శకుల ప్రశంలందుకుంది. ‘మహిళా ఇక నిదుర నుంచి మేలుకో...’ అంటూ మహిళాలోకానికి లేడీ గెటప్పులో పిలుపును కూడా ఇస్తారు ఇందులో రాజేంద్రప్రసాద్. ఆ పాటను ఎస్పీ బాలు పాడటం విశేషం. ఇక ‘భామనే సత్యభామనే’ (1996)లో భామా రుక్మిణిగా కమల్‌హాసన్ ఒలికించిన వయ్యారాన్ని తేలిగ్గా మరిచిపోగలమా! బాలకృష్ణ కూడా ‘పాండురంగడు’(2008)లో స్త్రీగా కనిపించి, పలువురి ప్రశంసలు పొందారు. 
 
 తాత అక్కినేని స్ఫూర్తిగా సుమంత్ కూడా ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ చిత్రంలో లేడీ గెటప్ వేశారు. తాత పోలికలు ఉండటం వల్లనో ఏమో.. ఆ వేషంలో జనానికి తెగ నచ్చేశారు. వీరి తర్వాత ఇప్పుడు మంచు మనోజ్ వంతు వచ్చింది. ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో  దాదాపు ద్వితీయార్ధమంతా లేడీ గెటప్‌తోనే అలరించేశారు మనోజ్. ఇందులో మనోజ్ పాత్రే హైలైట్. ఏది ఏమైనా... మగవాళ్లు ఆడవారిగా నటించడం కత్తి మీద సామే. హాస్యం హద్దు మీరితే అపహాస్యం అవుతుంది. అలాగే... స్త్రీ పాత్ర పోషణలో ఏ మాత్రం తప్పులు దొర్లినా... పేడి లక్షణాలుగా బహిర్గతమవుతాయి. యువనటులు అయినా కూడా ‘స్త్రీ పాత్రలు’ చేయడానికి ధైర్యంగా ముందుకు రావడం నిజంగా ఆనందించదగ్గ విషయమే.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement