Tenali Ramakrishna
-
తెలివిజన్
తెనాలి రామకృష్ణ తెలివే తెలివి.. విజనే విజను. ఇంకొకళ్లకు లేవు.. అలాంటి వికటకవులిక లేరు! ఆ తెలివిని, ఆ విజన్‌ని కలిపి దూరదర్శన్ వాళ్లు ‘తెనాలి రామ’గా ప్రసారం చేశారు.పదికాలాల నవ్వుల పువ్వుల్ని పూయించారు. బతుకు బాటలో అతను హాస్య చతురత కల చమత్కారి. కష్టాన్ని తన ప్రతిభతో ఇష్టసఖిగా మార్చుకొని ఇంటి ముంగిట్లో కట్టేసుకున్న ధీశాలి. తలతీసేయాల్సిన పరిస్థితుల్లోనూ తలవంచక చమత్కారంతో మరణం చేతనే మెప్పు సాధించిన మహా మేధావి. తెలుగువారినే కాదు భారతదేశమంతా తన ప్రతిభతో ఆకట్టుకున్నవాడు. అతని పేరు చెప్పగానే పిల్లల నుంచి పెద్దల వరకు అందరి పెదవులపై చిరునవ్వు చేరుతుంది. ఆ తెలివికి జోహార్ అంటుంది. అతడిని పరిచయం చేసుకోవాలంటే రాయల భువనవిజయానికి బయల్దేరాలి. ఆ కాలానికి వెళ్లాలంటే ఇప్పుడు మనకు టైమ్ మిషన్ అక్కర్లేదు. 90ల కాలంలో దూరదర్శన్‌లో వచ్చిన ‘తెనాలి రామ’ సీరియల్‌ను చూస్తే చాలు. నాటి చారిత్రక సంఘటలను కథలుగా పరిచయం చేయడానికి టెలివిజన్ నాడు ఎంతగానో ఉపయోగపడింది. అందుకు ఉదాహరణ ‘తెనాలి రామ’కృష్ణ కవి కథలనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీతో కూడిన సీరియల్స్ ఎన్ని వచ్చినప్పటికీ ‘తెనాలి రామ’ సీరియల్ ప్రస్తావన వస్తే మాత్రం నాటి పిల్లలు ఇప్పటికీ గొప్పగా చెబుతుంటారు. నాటి నుంచి నేటి వరకు టెలివిజన్ ఎన్నో ఆసక్తికర సీరియల్స్‌ను ప్రచారం చేసినప్పటికీ హాస్య సీరియల్స్‌లో తెనాలి రామ పెద్ద లెజండ్. బద్దకిస్టు రామకృష్ణుడు పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. పుట్టింది గుంటూరులో. కొన్నాళ్లకే తండ్రి మరణించడంతో తల్లి ఎంతో కష్టమ్మీద రామకృష్ణను పెంచుతుంటుంది. రామకృష్ణ సోమరిపోతు. ఎప్పుడూ నిద్రపోవాలని చూస్తుంటాడు. తినమని పండు ఇస్తే దాని తొక్క తీయాలి కదా అని బద్ధకించి అలాగే చేతిలో పెట్టుకొని నిద్రపోతాడు. స్కూల్‌కి వెళితే గురువు చెప్పే పాఠాల మీద ఎంత మాత్రమూ ఆసక్తి ఉండదు. తల్లికి రామకృష్ణ పెంపకం చాలా తలనొప్పిగా ఉంటుంది. నదిలో స్నానం చేసి రమ్మని తల్లి పోరితే వెళ్లి అక్కడి బండరాళ్ల మీద పడుకొని నిద్రపోతుంటాడు. నది దగ్గర జపం చేసుకుంటున్న ఒక సాధువు రామకృష్ణ పడుకుని ఉండడం చూసి ఓ రోజు విసుక్కుంటాడు ‘కాళీమాత గుడికి వెళ్లి పడుకోపో.. నా జపానికి విఘాతం కలిగించకు’ అని కోప్పడతాడు. విధిలేక రామకృష్ణ అమ్మవారి గుడికి వెళతాడు. ఆకలేస్తే తనకు కావల్సిన ప్రసాదాన్ని తినేసి అక్కడే పడుకుంటాడు. కలలో దేవత ప్రత్యక్షమై ధనం, జ్ఞానం ఉన్న రెండు గిన్నెల నిండా ప్రసాదం ఇస్తుంది తినమని. అవి తిన్న రామకృష్ణుడు నిద్రలేచి అమ్మవారి వైపుగా చూస్తాడు. ఆమె పాదాల వద్ద గిన్నెలోని ప్రసాదాన్ని సేవించి, దండం పెట్టుకొని పరుగున ఇంటికి చేరుకుంటాడు. మరుసటి రోజు పొద్దున్నే రామకృష్ణుడు పడుకొని లేకపోవడం చూసిన తల్లి ఆశ్చర్యపోతుంది. ఎక్కడా కనిపించకపోవడంతో నది దగ్గరకు వెళుతుంది. కొడుకు కనిపించడు. అక్కడే ఉన్న సాధువుని అడుగుతుంది తన కొడుకు గురించి. ‘రామకృష్ణుడు బ్రహ్మముహూర్తంలోనే వచ్చి నదీ స్నానం చేసి వెళ్లాడు’ అని చెబుతాడు. తల్లి ఆశ్చర్యపోతూ ఇంటికి చేరుకుంటుంది. రామకృష్ణుడు పూజ చేస్తూ కనిపిస్తాడు. ఆకలేస్తుందని, పాఠశాలకు వెళ్లాలని ఏదైనా తినడానికి ఇమ్మని తల్లిని త్వరపెడతాడు. ఆవుకు మేత తెచ్చి వేస్తాడు. తల్లికి ఇంటి పనుల్లో సాయం చేస్తాడు. ఖాళీ సమయం ఉంటే పాఠాలు వల్లెవేస్తుంటాడు. గురువును మెప్పించిన శిష్యుడు అవుతాడు. తల్లి ఆనందంతో కొడుకును చూసుకొని మురిసిపోతుంది. చిన్ననాటి చమత్కారం ఇంటిలో సరుకులు మోయడానికి కష్టంగా ఉందని తెలుసుకున్న రామకృష్ణుడు ఓ ఆలోచన చేస్తాడు. ఓ రోజు బట్టలు ఉతికే అతని దగ్గరకు వెళ్లి తన మాటలతో మెప్పించి, గాడిదను తీసుకెళతాడు. కొంతదూరం వెళ్లాక గాడిదకు శక్తి లేక అడుగు వేయలేకపోతుంది. మేతకోసం చూస్తాడు. ఒకామె గడ్డిమోపును నెత్తిమీద పెట్టుకొని అమ్ముకోవడానికి వెళ్లడం చూస్తాడు. ఆమెను కొద్దిగా మేత అడిగితే డబ్బు లేనిదే ఇవ్వను అంటుంది. గాడిదను తీసుకెళ్లి ఒకచోట ఉంచి, వచ్చీపోయేవాళ్లను చూస్తుంటాడు. దూరంగా ఒక సంపన్నుడు గుర్రం తీసుకొని రావడం చూస్తాడు. ఆ సమయంలో రామకృష్ణుడు గాడిదను ప్రార్థిస్తూ ఉంటాడు. ఆ సంపన్నుడు ఆశ్చర్యపోయి ‘గాడిదను వేడుకుంటున్నావేం’ అని అడుగుతాడు. అప్పుడు రామకృష్ణుడు ‘ఈ గాడిద మహిమాన్వితమైనది. దీనికి పిడికెడు గడ్డి వేస్తే ఏం కోరుకుంటే అది అవుతుంద’ని, చెబుతాడు. గడ్డి అమ్ముడుపోక నీరసంగా ఒక దగ్గర కూర్చున్న ఆమె దగ్గరకు వెళ్లి పిడికెడు గడ్డి కొని తీసుకొస్తే చాలంటాడు. ఆ సంపన్నుడు అలాగే చేస్తాడు. ఆ తర్వాత దారిన పోయేవారంతా వచ్చి గాడిదకు గడ్డి కొని ఇస్తారు, డబ్బులూ సమర్పించుకుంటారు. ఒకరు ఇద్దరు పోయి వందల మంది గాడిదకు మేత వేయడానికి వస్తారు. సాయంకాలమయ్యాక అంతా వెళ్లిపోయి రేపు రండి అని చెబుతాడు. సాయంకాలం బట్టలు ఉతికే అతను రామకృష్ణుడు తల్లి దగ్గరకు వచ్చి నా గాడిదను ఇవ్వమని వేడుకుంటాడు. తల్లి ఆశ్చర్యపోతుంది. అప్పుడే గాడిదతో వచ్చిన రామకృష్ణుడు ‘గాడిద మహారాజు సంపాదన ఇది. ఇదంతా నీదే’ అని బట్టలు ఉతికే అతనికి ఇస్తాడు. ‘నా సంపాదన ఇది’ అంటూ తల్లికి కొంత భాగాన్ని ఇస్తాడు. మాటలతో కోటలు చమత్కారానికో, లేక పిలవడానికి సులువు అనో కానీ.. కొద్ది కాలంలో రామకృష్ణుడినే ఊరివాళ్లు రామలింగా అని పిలిచేవారు. తల్లికి పనుల్లో సాయపడుతూ, విద్యను అభ్యసిస్తూ పెరిగి పెద్దవుతాడు. పెళ్లి చేసుకొని గృహస్థు అవుతాడు. ఒకరోజు ఆ ఊళ్లో ఆచారి అనే వ్యక్తి రామలింగడి కాళ్ల మీద పడతాడు కాపాడమని. విషయం ఏంటని అడుగుతాడు రామకృష్ణుడు. సేట్ తన జాతకం అడిగితే చూసి ‘నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు. నీ పరివారం అంతా ముందే మరణిస్తారు’ అని చెప్పాను. తన పనివాళ్లతో చెప్పి నన్ను కొట్టించడానికి సిద్ధమయ్యాడు. నా దోషమేమీ లేదు ఉన్నదున్నట్టు చెప్పాను’ వగరుస్తూ అన్నాడు ఆచారి. ఆచారికి ఓ రహస్యం చెప్పి సేట్ని కలుస్తాడు రామకృష్ణుడు. కోపంలో ఉన్న సేట్ ఆచారిని తెగ తిడుతుంటాడు. రామకృష్ణుడు వెళ్లగానే ‘ఇంట్లో అందరూ జబ్బు చేసి చచ్చిపోతారని వాడు చెప్పాడు. శాంతి చేయాలి..’ అని టెన్షన్ పడుతూ ఉంటాడు సేట్. ఆ ఆచారి చెప్పింది అబద్ధం. బృహస్పతి వరం పొందిన ఓ సిద్ధుడు చెట్టుకింద కొలువుదీరాడు. ఎవరితోనూ అతను మాట్లాడడు. ఈ రాత్రే వెళ్లి అతన్ని కలవండి’ అని చెబుతాడు రామకృష్ణుడు. అలాగేనని వెళతాడు సేట్. రామకృష్ణుడు చెప్పిన విధంగా చెట్టుకింద ఉన్న స్వామీజీని చూసి ‘స్వామీజీ నేను పెద్ద పరేశాన్లో ఉన్నాను. మా ఇంటి పరిస్థితి ఇది. దయచేసి చెప్పండి’ అని వేడుకుంటాడు. జాతకం చూసిన అతను.. ‘మూడేళ్ల క్రితం మీ తండ్రి మరణించారు. వారం రోజులుగా మీ ఇంట్లో వారంతా మంచం పట్టారు. నువ్వు దీర్ఘాయుష్కుడివి. మీ ఇంట్లో వారందరికంటే నువ్వు రెండేళ్లు ఎక్కువ కాలం బతుకుతావు’ అని చెబుతాడు. అతను చెప్పిన దానికి చాలా సంతోషించిన సేట్ డబ్బు కూడా ఇచ్చి దండం పెట్టుకుంటాడు. ఆ స్వామీజీ వేషం కట్టింది ఆచారియేనని ఆ సేట్‌కి తెలియదు. మాట తీరుతో ఆపదల నుంచి ఎలా బయటపడవచ్చో రామకృష్ణకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని నిరూపిస్తాడు. ఆచారి రామకృష్ణుడిని కలిసి ‘రామా.. నువ్వు చాలా చమత్కారివి. చెప్పినదాన్నే మరో విధంగా చెప్పి నన్ను కాపాడావు’ అని మెచ్చుకొని ‘ఇంత తెలివైనవాడివి ఈ ఊళ్లో ఉంటే ఎలా? నువ్వు రాజ సభలో ఉండాలి. ఎందుకు ప్రయత్నించకూడదు’ అంటాడు. ఆ ఆలోచనతో భార్య సీతతో విజయనగరం బయల్దేరుతాడు రామకృష్ణుడు. కోటలోకి దారేది కోటలోకి వెళ్లడానికి ఎవరి రికమెండేషనూ లేదు. కనీసం పరిచయస్థులెవరూ లేరు. రోజూ కోట దగ్గరకు చేరి వచ్చీపోయేవాళ్లను చూస్తుంటాడు. ఓ రోజు కోటలోకి వెళ్లబోతున్న రాజగురువును కలుసుకుంటాడు. ‘మీరు నాకు తెలుసు.. మీరు ఫలానా కదా! మీరు మా ఊరు వచ్చారు. అప్పుడు నేనే దగ్గరుండి భోజనం వడ్డించాను’ అంటూ.. మాటలు కలుపుతాడు. రాజగురువు సందేహంగా చూసి, అనేక ప్రశ్నలు వేసి, తిట్టి లోపలికి వెళ్లిపోతాడు. ఎలాగైనా లోపలికి వెళ్లాలనే ఆలోచన చేసిన రామకృష్ణుడు రాజ భటులతో ‘రాజగురువుతో మాట్లాడుతుండగా చూశారుగా. రాజు గొప్ప బహుమానం ఇస్తానని చెబితే వచ్చాను. అందులో కొంత భాగం మీకు ఇద్దామనుకున్నాను. కానీ, మీరు లోపలికి వెళ్లనివ్వడం లేదు’ అంటాడు. ఆ మాటలు భటులను ఆకట్టుకుంటాయి. బహుమానంలో తమకూ కొంత భాగం ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటారు వాళ్లు. అలా కోటలోకి వెళతాడు రామకృష్ణుడు. కోటలో మొదటి ఛాలెంజ్ రాయల సభ కొలువుదీరి ఉంటుంది. విదేశాల నుంచి వచ్చిన కాళీచరణ్ అనే ఇంద్రజాలికుడు తన విద్యలన్నీ ప్రదర్శిస్తుంటాడు. అందరూ అతన్ని కీర్తిస్తారు. ‘నాతో పోటీ పడేవారు మీ రాజ్యం లో ఉన్నారా?’ అని సవాల్ విసురుతాడు. ఎవరూ ముందుకు రాకపోవడంతో రామకృష్ణుడు ‘మహారాజా అనుమతి ఇస్తే, నేను ఈ సవాల్‌ను ఎదుర్కొంటాను’ అని ముందుకు వస్తాడు. రాజు అనుమతితో కారం తెప్పించి, ‘ఈ కారం కళ్ల మీదుగా వేసుకొని భరించగలవా?’ అంటాడు. తన వల్ల కాదంటాడు ఇంద్రజాలికుడు. రామకృష్ణుడు రెండు గుప్పిళ్ల నిండుగా కారం తీసుకొని, కళ్లు మూసుకొని ఆ కళ్ల మీదుగా పోసుకుంటాడు. ఇంద్రజాలికుడు తన ఓటమిని ఒప్పుకొని వెనుదిరిగిపోతాడు. రాజు రామకృష్ణుడి తెలివికి మెచ్చుకొని బహుమానం కోరుకోమంటే ‘వంద కొరడా దెబ్బలను ఇప్పించండి ప్రభూ’ అని వేడుకుంటాడు. ఇంత విచిత్రమైన కోరిక ఎవరూ కోరరు. అయినా సరే కానీ, అంటూ కొరడా దెబ్బలను అమలు చేయమంటాడు. అప్పుడు రామకృష్ణుడు ‘ప్రభూ తమకో విజ్ఞప్తి. ముగ్గురు ద్వారపాలకులకు మీరు ఇచ్చే బహుమానం ఇస్తాను అనే మాట మీద లోపలికి వచ్చాను. వాళ్లకు కూడా ఈ ఇనామ్లో భాగం ఉంది మహారాజా’ అని కోరుతాడు. ఆ ద్వారపాలకులను పిలిపించమంటాడు రాజు. లంచగొండులుగా మారిన ఆ ద్వారపాలకులకు అలా శిక్షపడేలా చేస్తాడు రామకృష్ణుడు. అంతేకాదు మహారాజు తన రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకునేలా ఆలోచన చేస్తాడు. రామకృష్ణుడి చాతుర్యాన్ని మెచ్చుకున్న శ్రీకృష్ణదేవరాయలు తన సాహిత్యసభలో కవిగా కొనసాగమని చేతి ఉంగరాన్ని బహుకరిస్తాడు. అలా రామకృష్ణుడు భువన విజయంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకరిగా చేరిపోయాడు. వికటకవిగా పేరొందిన రామకృష్ణుడు 16వ శతాబ్దికి చెందినవాడు. ఇతని జీవిత సంఘటనలన్నీ చమత్కారపు కథనాలుగానే ఆకట్టుకుంటాయి. అక్బర్–బీర్బల్ కథల మాదిరిగానే రాయలు–రామకృష్ణుడు కథలుగా, తెనాలిరామలింగడి కథలుగా చిన్నాపెద్దను ఆకట్టుకున్నాయి. ఈ కథలను దర్శించిన చిన్నా పెద్ద పెదవులపై నవ్వులను పూశాయి. ‘శభాష్ తెనాలి రామ’ అని రామకృష్ణ తెలివికి జనం చేతులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశాయి. – ఎన్.ఆర్ దొంగల చేత నీళ్లు ఓ రాత్రి పూట తన ఇంట్లో దొంగలు పడి సొత్తు దోచుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకుంటాడు రామకృçష్ణుడు. భార్యతో గట్టిగా అరిచి చెబుతూ ‘మన ఇంట్లో దొంగలు పడి, సర్వమూ దోచుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ‘నగలు, డబ్బు అంతా మూట గట్టి బావిలో వేద్దాం’ అని దొంగలకు వినపడేలా చెప్పి, ఓ మూటను బావిలో వేస్తాడు. రామకృష్ణుడు బావిలో వేసింది నగలు, డబ్బు ఉన్న మూటనే అని నమ్మిన దొంగలు తెల్లవార్లూ బావిలో నీటిని తోడుతూనే ఉంటారు. రామకృష్ణుడు ఆ నీటిని తన తోటకు పాదులు తీసి, మళ్లించుకుంటూ ఉంటాడు. తెల్లవారు జామున అలసిపోయిన దొంగలతో తోటకు నీళ్లు సరిపోయేలా పనిచేశారని కృతజ్ఞతలు చెబుతాడు రామకృష్ణుడు. అంతే! దొంగలు పారిపోతారు. తెనాలి రామ ►‘తెనాలి రామ’ సీరియల్‌ను తీసిన దర్శకుడు టి.ఎస్.నాగభరణ. రామకృష్ణుడిగా నాగభరణయే ఈ సీరియల్లో నటించారు. ►చిన్ననాటి రామకృష్ణుడిగా మాస్టర్ కార్తీక్ నటనలో మెప్పించాడు. ►కథా రచయిత్రి కమలా లక్ష్మణ్ (ఆర్కే లక్ష్మణ్ సతీమణి) రాసిన కథలే తెనాలి రామ సీరియల్‌కు మూలం. ►ఆర్కేలక్ష్మణ్ ఈ సీరియల్‌కి కార్టూన్ లైన్స్ ఇచ్చారు. ►రామకృష్ణుడు పెరిగింది తెనాలి అగ్రహారమైన తూములూరులో.ఇంటిపేరు గార్లపాటి కన్నా తెనాలి అనేపేరే రామకృష్ణుడి ఇంటిపేరుగా స్థిరపడింది.రామకృష్ణుడికే రామలింగడు అనే మరో పేరు ఉంది. -
పద్యానవనం: సమయస్ఫూర్తితోనే కవికి కీర్తి!
రంజన జెడి పాండవులరి భంజనులై విరటుగొల్వ పాల్పడిరకటా! సంజాతమేమి చెప్పుదు కుంజర యూదంబు దోమ కుత్తుకజొచ్చెన్! ఏనుగుల సమూహము దోమ కుత్తకలో జొచ్చింది! అన్న అసాధారణ విషయాన్ని, ‘‘కుంజర యూదంబు దోమ కుత్తుకజొచ్చెన్’’ అనే సమస్యాపూరణంగా ఇచ్చారు ప్రాజ్ఞులు సభలో. దానికి, సరసకవి తెనాలి రామకృష్ణుడు ఏ మాత్రం తడుముకోకుండా, సాహితీ సమరాంగన సార్వభౌముడైన కృష్ణదేవరాయల సమక్షంలో పై విధంగా పూరించాడు. మహాపరాక్రమవంతులైన పాండవులు తలరాత బాగోలేక సాదాసీదా విరాటరాజును కొలిచే స్థితికి వచ్చారు. విధి ఎంత బలీయమైనదో చెప్పజాలమంటూ, ఏనుగుల సమూహం దోమ గొంతుకలో జొచ్చిందనే పోలికచెప్పడమన్నమాట! అవధాన ప్రక్రియల్లో తరచూ జరిగేదే కదా! ఇందులో సరసమేముంది? విశేషమేముంది? అనిపించవచ్చు. కానీ, విషయం ఇది మాత్రమే కాదు. తన సరస-సమర్థ హాస్య, సాహితీ ప్రతిభతో ప్రతిసారీ రాయలవారి వద్ద మార్కులు కొట్టేసే రామకృష్ణ కవిని ఎలాగైనా దెబ్బతీయాలన్న ప్రత్యర్థుల ఆటలు సాగకపోవడం ఇందులో విశేషం. విచిత్రమైన సమస్యనిచ్చి, సమస్యాపూరణం చేయాల్సిందిగా అంతఃపురంలో సేవకుడిగా ఉండే ఒక పరిచారకుడితో రామకృష్ణ కవిని అడిగిస్తారు అతనంటే ఈర్ష్య కలిగిన వారు. ఏం చెబుతాడో చూద్దామన్నది ఉత్సుకత. తాము తెరవెనుక ఉండి గోప్యంగా ఇదంతా నడిపిస్తారు. అడిగేవాడిని బట్టి రామకృష్ణుడు ఎలాగూ పెడార్థమొచ్చే పూరణమే చేస్తాడు, ఒకడుగు ముందుకేసి బూతులు మాట్లాడినా మాట్లాడొచ్చు! అప్పుడు సభలో రాజుగారి ముందు ఇదే సమస్యనిచ్చి పూరించమంటూ రామకృష్ణ కవిని ఇబ్బందుల్లో పెట్టాలన్నది వారి ఎత్తుగడ. అనుకున్నట్టుగానే వారి అంచనా కొంతమేర నిజమైంది. సహజంగానే రామకృష్ణకవి విపరీతంగా స్పందించాడు. ‘అయ్యవారూ, ఇదుగో ఈ సమస్యను మీరు పూరించగలరా!’ అని, తెలిసీ తెలియక సేవకుడడిగినపుడు, ‘ఆ... దానికేం భాగ్యం’ అంటూ, ‘‘గంజాయి తాగి, తురకల సంజాతము తోడ కల్లు చవిగొన్నావా? లంజల కొడుకా ఎక్కడ కుంజర యూదంబు దోమ కుత్తుక జొచ్చెన్?’ అని తిడుతూ కందపద్యంతో సమస్యా పూరణం చేశారు రామకృష్ణుడు. నాటి పదిహేనో శతాబ్ద కాలంలో ఉత్తర భారతం నుంచి దక్షిణాది వైపు విస్తరిస్తున్న బహమనీ సుల్తానుల హయాంలో ఆ తురుష్కుల సేవకులు, పరివారం గంజాయితో పాటు కల్లును మత్తుపానీయంగా సేవించేవారు. వారితో కూడి తాగి ఉన్నావా? అని తిడుతూ, ఎక్కడరా! ఎక్కడ, ఏనుగుల సమూహమెక్కడైనా దోమ కుత్తుకలో జొరబడగలదా? ఎక్కడ చెప్పు! అన్న అర్థం వచ్చేలా మందలిస్తూ సమస్యా పూరణం చేస్తాడు. పాపం, దానర్థం తెలియని సేవకుడు యధాతథంగా తీసుకువెళ్లి, వ్యూహకర్తలకు అప్పజెప్పాడు. ‘ఆహా! అనుకున్నంతా అయింది, మన రొట్టె విరిగి నేతిలో పడింది, ఇక ఇదేదీ జరుగనట్టు గుంభనంగా ఉండి, నిండు సభలో రాజుగారి ముందు రామకృష్ణుడికి ఇదే సమస్యనిస్తే... అయ్యో ఎంత పనిచేశానని ఆయన నాలుక్కరచుకోవడం ఖాయమ’ని సంబరపడ్డారు. తర్వాతి రోజు ఏమీ తెలియనట్టు సభలో ఓ సందర్భం సృష్టించి, ‘ఇదుగో ఈ సమస్యను రామకృష్ణుడైతే ఎలా పూరిస్తాడో అడగండి మహారాజా!’ అని, అదే సమస్యను సభ ముందుంచారు. నిన్నటి సంఘటనను గుర్తుకు తెచ్చుకొని, క్షణాల్లో విషయం గ్రహించిన తెనాలి రామకృష్ణుడు అప్పటికప్పుడు ఆశువుగా పైన పేర్కొన్న స్కీమ్-2 పద్యం సృష్టించారు. ఆయన ప్రతిభకు అబ్బురపడి, అభినందించారట కృష్ణదేవరాయలు. ఎప్పటిలాగే ప్రశంసలు తెనాలి రామకృష్ణుడికి, భంగపాటు ప్రత్యర్థులకు. అదీ సమయస్పూర్తి. - దిలీప్‌రెడ్డి -
భామనే...సత్యభామనే..!
కళల పట్ల కాస్త ఆసక్తి ఉన్న ఎవరికైనా సరే.. స్థానం నరసింహారావు పేరు తప్పక గుర్తుంటుంది. తెలుగు నాటకరంగంలో తొలి ‘పద్మశ్రీ’ ఆయన. స్థానంవారు రంగస్థలంపై గొప్ప పాత్రలు చాలా పోషించినా.. ఆయనకు బాగా పేరు తెచ్చిన పాత్ర మాత్రం ‘సత్యభామ’. స్త్రీ పాత్ర. ఒక్క సత్యభామే కాదు, చింతామణి లాంటి వేశ్య పాత్రను కూడా పోషించి మెప్పించారాయన. రంగస్థలంపై ఆయన తర్వాత స్త్రీ పాత్రధారణతో మెప్పించిన మహానటుడు బుర్రా సుబ్రమణ్యశాస్త్రి. ఆయనకైతే.. లవ్ ప్రపోజల్స్ కూడా వచ్చాయి. ఆడవారికే మతిపోగొట్టే వయ్యారం శాస్త్రిది. సినిమా అనేది రాకముందు ప్రజానీకానికి ప్రధాన వినోద సాధనం నాటకమే. అప్పట్లో రంగస్థలంపై ఆడవారు కనిపిస్తే, పాపంగా ఫీలయ్యేవారు. ‘హవ్వ’ అని బుగ్గలు నొక్కేసుకునేవారు. అలాంటి టైమ్‌లో ఆడపాత్రలన్నీ పోషించింది మగవారే. నాటి నుంచి నేటి దాకా ఎంతమంది రంగస్థలంపై స్త్రీలుగా అలరించినా... స్థానం, బుర్రా వారి స్థానం మాత్రం చిరస్మరణీయం. ఇప్పుడు వీరి టాపిక్ ఎందుకొచ్చిందంటే... వీరిని ఆదర్శంగా తీసుకొని వెండితెరపై కూడా స్త్రీలుగా అలరించిన, అలరిస్తున్న మేటి నటులు ఎందరో ఉన్నారు.సినీ హీరోల్లో స్త్రీ పాత్ర అనగానే.. ముందు గుర్తొచ్చేది అక్కినేని. నిజానికి వెండితెరపై ఆయన స్త్రీగా కనిపించింది తక్కువే. వీరుడిగా, భగ్న ప్రేమికునిగా, లవర్‌బోయ్‌గానే ఎక్కువగా కనిపించారు. రంగస్థలంపై మాత్రం ఎన్నో స్త్రీ పాత్రలు పోషించారు. అక్కినేని వెండితెరపై స్త్రీగా కనిపించిన సినిమా ‘తెనాలి రామకృష్ణ’(1956). కృష్ణసాని బండారాన్ని బట్టబయలు చేయడానికి రామకృష్ణుడు స్త్రీ వేషం కడతాడు. ఆ పాత్రలో అక్కినేని అభినయం అద్భుతం. పైగా కృష్ణసానిగా చేసింది భానుమతి. ఆమెకు దీటుగా స్త్రీ వేషంలో అక్కినేని ఆ సన్నివేశాన్ని నిజంగా చూసి తీరాల్సిందే. సహజంగా వయ్యారం అక్కినేని సొంతం. మరోవైపు నాటకానుభవం. ఇంకేం... ఆ సన్నివేశాన్ని పండించారు.చర్చ ఆడ వేషాల గురించే అయినా, ‘నర్తనశాల’(1963)లోని బృహన్నల పాత్రను కూడా ఇక్కడ స్మరించుకోవాల్సిందే. ‘బృహన్నల’ అంటే పేడి. స్త్రీ కాదు. అయినా... వయ్యారం, హొయలు, ఆహార్యం, ఆంగికం, నడక, నడత... ఇవన్నీ స్త్రీనే పోలి ఉంటాయి. ఈ సినిమా చేసే సమయానికి ఎన్టీఆర్ తెలుగుతెరకు మకుటం లేని మహారాజు. ప్రేక్షకులు ఆయనలో జగదేకవీరుణ్ణి చూసుకుంటున్న రోజులవి. అలాంటి రోజుల్లో ఈ హిజ్రా వేషం కట్టారాయన. పేడితనంలో అంతర్లీనంగా ఉండే ఆడతనాన్ని నభూతో నభవిష్యతి అనేలా పలికించారు. భారతదేశ చలనచిత్ర చరిత్రలో సినిమా ఆద్యంతం హిజ్రాగా నటించిన ఏకైక సూపర్‌స్టార్ ఎన్టీఆర్ మాత్రమే. ఇది గొప్ప సాహసం. మళ్లీ ఆయనే... అదే పాత్రను ‘శ్రీమద్విరాటపర్వం’(1979)లో చేసినా.. అంత గొప్పగా రాణించలేకపోయారు. ఎన్టీఆర్ స్త్రీ పాత్రల విషయానికొస్తే... దేవాంతకుడు(1960), పిడుగురాముడు(1966) చిత్రాలనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ‘పిడుగురాముడు’లో అయితే, ‘రంగులు రంగులు రంగులు.. హోయ్ రమణులు వలపుల పొంగులు’ పాటలో లేడీగా.. ఎన్టీఆర్ స్టెప్పులు మాస్‌ని కట్టిపడేశాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల తరంలో హీరోలకు మీసం తప్పనిసరి కాదు. ఆ తరం హీరోలందరూ పాత్రోచితంగా మీసాలు లేకుండా కూడా నటించేశారు. అందుకే స్త్రీ పాత్రలనూ తేలిగ్గా పోషించగలిగారు. కానీ 80ల్లోకొచ్చేసరికి హీరోకి మీసం కంపల్సరీ అయ్యింది. హీరో అనేవాడు మీసం తీయడం సాహసంతో కూడిన విషయంగా మారింది. అలాంటి సందర్భంలోనూ దర్శకుని మాటను శిరసావహిస్తూ చాలా ధైర్యంగా మీసం తీసేశారు చిరంజీవి. ‘నా పేరు మిస్సు మేరీ...’ అంటూ లేడీ గెటప్పులో అదరగొట్టేశారు. ఆ సినిమానే ‘చంటబ్బాయి’ (1986). నిజానికి అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ చిరంజీవి ఎప్పుడూ మీసం తీయలేదు. ఆయనకు మీసమే అందం కూడా. పాత్ర కోసం ఆ మీసాన్నే త్యాగం చేశారాయన. ఇక స్త్రీ పాత్ర అనగానే... కచ్చితంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి నరేష్. జంధ్యాల ‘చూపులు కలిసిన శుభవేళ’ (1988)లో తొలిసారి ఆయన లేడీ గెటప్ వేశారు. సుత్తివీరభద్రరావు, నరేష్‌లపై ‘చూపులు కలిసిన శుభవేళ...’ అంటూ... ఓ పేరడీ యుగళగీతాన్ని కూడా తీశారు జంధ్యాల. ఆ తర్వాత వచ్చింది ‘చిత్రం భళారే విచిత్రం’(1992). ఇక ఈ సినిమాలోని నరేష్ చేసిన స్త్రీ పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రోజారమణి డబ్బింగ్ ఆ పాత్రకు మరింత వన్నె తెచ్చింది. కళ్లలో అమాయకత్వం, ఒళ్లంతా వయ్యారం, సిగ్గు పడుతూ ఆ కొంటెనవ్వు.. అవన్నీ చూసి ఆడవారు సైతం అసూయ పడ్డారంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమా విజయానికి ఆ గెటప్ ప్రధాన పాత్రే పోషించింది. రీసెంట్గా ‘కార్తీకమాసం’ చిత్రంలో కూడా లేడీ గెటప్ వేశారు నరేష్. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ నిర్మించి, నటించిన చిత్రం ‘మేడమ్’ (1993). ఇందులో రాజేంద్రప్రసాద్ స్త్రీగా నటించడమే కాదు, సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. ధీరవనితగా నటకిరీటి అభినయం విమర్శకుల ప్రశంలందుకుంది. ‘మహిళా ఇక నిదుర నుంచి మేలుకో...’ అంటూ మహిళాలోకానికి లేడీ గెటప్పులో పిలుపును కూడా ఇస్తారు ఇందులో రాజేంద్రప్రసాద్. ఆ పాటను ఎస్పీ బాలు పాడటం విశేషం. ఇక ‘భామనే సత్యభామనే’ (1996)లో భామా రుక్మిణిగా కమల్‌హాసన్ ఒలికించిన వయ్యారాన్ని తేలిగ్గా మరిచిపోగలమా! బాలకృష్ణ కూడా ‘పాండురంగడు’(2008)లో స్త్రీగా కనిపించి, పలువురి ప్రశంసలు పొందారు. తాత అక్కినేని స్ఫూర్తిగా సుమంత్ కూడా ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ చిత్రంలో లేడీ గెటప్ వేశారు. తాత పోలికలు ఉండటం వల్లనో ఏమో.. ఆ వేషంలో జనానికి తెగ నచ్చేశారు. వీరి తర్వాత ఇప్పుడు మంచు మనోజ్ వంతు వచ్చింది. ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో దాదాపు ద్వితీయార్ధమంతా లేడీ గెటప్‌తోనే అలరించేశారు మనోజ్. ఇందులో మనోజ్ పాత్రే హైలైట్. ఏది ఏమైనా... మగవాళ్లు ఆడవారిగా నటించడం కత్తి మీద సామే. హాస్యం హద్దు మీరితే అపహాస్యం అవుతుంది. అలాగే... స్త్రీ పాత్ర పోషణలో ఏ మాత్రం తప్పులు దొర్లినా... పేడి లక్షణాలుగా బహిర్గతమవుతాయి. యువనటులు అయినా కూడా ‘స్త్రీ పాత్రలు’ చేయడానికి ధైర్యంగా ముందుకు రావడం నిజంగా ఆనందించదగ్గ విషయమే. -
నేడు అక్కినేని 90 పుట్టినరోజు
అక్కినేని పుట్టింది భారతీయ సినిమా పుట్టిన పదేళ్లకు. ఆయన సినీ నటునిగా పుట్టింది తెలుగు సినిమా పుట్టిన పదేళ్లకు. ఈ తీరుని బట్టి చూస్తే.. సినిమా కోసమే ఈయన్ని దేవుడు పుట్టించాడా? అనిపిస్తుంది.నేడు ఆ మహానటుడు 90వ పడిలోకి అడుగుపెడుతున్నారు -
అక్కినేని అభినయ కిరీటంలో నవరత్నాలు
అక్కినేని పుట్టింది భారతీయ సినిమా పుట్టిన పదేళ్లకు. ఆయన సినీ నటునిగా పుట్టింది తెలుగు సినిమా పుట్టిన పదేళ్లకు. ఈ తీరుని బట్టి చూస్తే.. సినిమా కోసమే ఈయన్ని దేవుడు పుట్టించాడా? అనిపిస్తుంది. కుటీర పరిశ్రమగా మొదలైన ‘సినిమా’ మహా పరిశ్రమగా ఎదగడానికి కారకులైన మహానుభావులు ఎందరో. వారిలో అక్కినేని తప్పకుండా ముందు వరుసలో ఉంటారు. సినిమాను తెలుగు ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతున్నారంటే, తెలుగు సినిమా ఈ రోజు దక్షిణాదిలోనే అత్యధిక చిత్రాలు నిర్మించే స్థాయికి ఎదిగిందంటే అందులో అక్కినేని పాత్ర ఎంతో ఉంది. అందుకే ఆయన్ను తెలుగు సినిమా తల్లి రెండు కళ్లలో ఓ కన్నుగా అభివర్ణిస్తుంటారు సినీ పండితులు. నేడు ఆ మహానటుడు 90వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా నటసమ్రాట్ అభినయ కిరీటంలోని నవ రత్నాలను ఒకసారి స్మరించుకుందాం. లైలామజ్ను (1949) ఈ సినిమా వచ్చే నాటికి అక్కినేని సినీ నటనానుభవం ఎనిమిదేళ్లు. కానీ వంద సినిమాల నటుడికి కూడా సాధ్యపడనంత అమోఘమైన నటన కనబరిచారు. ‘ప్రేమికుడి పాత్రను ఇంత అద్భుతంగా చేయొచ్చా?’ అని సాటి నటులు సైతం విస్తుపోయేలా నటించారు అక్కినేని. లైలాతో పెళ్లి.. నిశ్చితార్థం దాకా వచ్చి ఆగిపోయిన సన్నివేశంలో లోకులందరూ ‘మజ్ను... మజ్ను’ అంటూ రాళ్లతో కొడుతుంటే... దెబ్బలను కూడా ఖాతరు చేయకుండా ఖైస్(అక్కినేని) నవ్విన నవ్వు చరిత్రలో నిలిపోయింది. ఒక్క నవ్వుతో జనహృదయాలపై గాఢమైన ముద్రను వేశారు అక్కినేని. దేవదాసు (1953) ధనమదానికి, పెద్దరికానికీ తన ప్రేమనే బలిపెట్టిన పిరికివాడు దేవదాసు. అందుకే తనపై తనకు అసహ్యం. కావాలనే తన శరీరాన్ని హింసించుకున్నాడు. చేవ లేక, చేసేది లేక చావుకు దగ్గరయ్యాడు. ఈ పాత్రలో అక్కినేని నటన నభూతో నభవిష్యత్. మరొకరు టచ్ చేయడానికి కూడా ధైర్యం చేయని పాత్ర ఇది. దేవదాసుగా అక్కినేని నటనకు దిలీప్‌కుమార్ సైతం జోహార్లు అర్పించారు. ‘‘దేవదాసు’ అంటే అక్కినేని మాత్రమే’ అని పత్రికాముఖంగా అంగీకరించారు. ఆ పాత్ర జనాలను ఏ స్థాయిలో ప్రభావితం చేసిందంటే.. అప్పట్లో ప్రతి మద్యం దుకాణంపై అక్కినేనే కనిపించేవారట. విప్రనారాయణ (1954) ఈ సినిమాను అక్కినేని ఒప్పుకున్నప్పుడు.. ‘దేవదాసు పాత్ర చేసిన నీకు ఈ హరిదాసు పాత్ర ఎందుకయ్యా. నీవు నాస్తికుడవు. భక్తిని ఎలా పలికిస్తావ్?’ అన్నారట చక్రపాణి. ‘తాగుబోతు పాత్ర పోషించేవాడు తాగుబోతే కానవసరం లేదు. భక్తుడి పాత్ర పోషించేవాడు భక్తుడే కానవసరం లేదు. నేను పాత్ర చేసి చూపిస్తాను’ అని చక్రపాణిగారితో ఛాలెంజ్ చేసి మరీ అక్కినేని ఈ పాత్ర చేశారు. విమర్శకులను సైతం విస్తుపోయేలా చేశారు. అటు భక్తునిగా, ఇటు స్త్రీ మోహంలో చిక్కుకున్న మానసిక బలహీనుడిగా అక్కినేని నటన అదరహో. అనార్కలి (1955) ఈ కథతో బాలీవుడ్లో అప్పటికే సినిమా వచ్చింది. సలీంగా ప్రదీప్‌కుమార్ నటించారు. కానీ ఆ సలీం వేరే, ఈ సలీం వేరే. ఈ సలీంలో అమరప్రేమికుడు కనిపిస్తాడు. ప్రేమకోసం తండ్రి అక్బర్ బాదుషాని సైతం ఎదిరించే సన్నివేశంలో అయితే... వీరాధి వీరుడు అగుపిస్తాడు. అనార్కలిని జీవ సమాధి చేసే పతాక సన్నివేశంలో ‘అనార్.. అనార్..’ అంటూ అక్కినేని భావోద్వేగపూరితమైన నటన పతాకస్థాయిలో ఉంటుంది. ఇదీ మరొకరు టచ్ చేయలేని పాత్రే. తెనాలి రామకృష్ణ (1956) రామకృష్ణ కవి అలాగే బిహేవ్ చేసేవారేమో! తన పాండిత్యంతో అందరినీ అలాగే నవ్వించేవారేమో! కోపం వస్తే పండితులను సైతం అలాగే తిట్టేవారేమో! ‘తెనాలి రామకృష్ణ’లో అక్కినేనిని చూస్తే ఇలాంటి భావాలే కలుగుతాయి. కళ్లను పెద్దవిగా చేసి విచిత్రంగా వాటిని కదిలిస్తూ, ఒక రకమైన డైలాగ్ డిక్షన్‌తో, వైవిధ్యభరితమైన శారీరక భాషతో ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. ‘తెనాలి రామకృష్ణ ఎలా ఉంటారు?’ అని కళ్లు మూసుకుంటే తెలుగువాళ్లకు కనిపించే రూపం అక్కినేని. మహాకవి కాళిదాసు (1960) నటునిగా అక్కినేనిని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిన సినిమా ఇది. ఇందులో ప్రథమార్ధం వెర్రిబాగులోడు. ద్వితీయార్థం మహాకవి. ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి పాత్రలు. అక్కినేని లాంటి మహానటులు మాత్రమే అలాంటి పాత్రను పోషించగలరు. అమాయకుడు, అమేయ జ్ఞాన సంపన్నుడిగా మారే పరిణామ క్రమంలో అక్కినేని అభినయం అనితర సాథ్యం. బాటసారి (1961) మానసిక రుగ్మత కలిగిన మేధావి కథ ఇది. అభిప్రాయాలు, అభిమతాలు, ఇష్టాఇష్టాలు.. ఇలా ఏ భావాన్నీ ఆ పాత్ర వ్యక్తం చేయలేదు. ఈ పాత్ర పోషణ నిజంగా కత్తిమీద సామే. సినిమా మొత్తం మీద అక్కినేని డైలాగులు రెండు పేజీలకు మించవు. ఇందులో అక్కినేని ఆహార్యం భిన్నంగా ఉంటుంది. కళ్లద్దాలు, పంచ, ధోవతితో అడపాదడపా కళ్లు ఆర్పుతూ భిన్నంగా కనిపిస్తారాయన. అప్పటికే అక్కినేని సూపర్‌స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి టైమ్‌లో ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోవడం ఆయన తెగువకు దర్పణం. శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) ఇందులోని అర్జున పాత్రను అక్కినేని చేశారు కాబట్టే ఆ సినిమాకు ఓ విలువ ఏర్పడింది. వేరే ఎవరు పోషించినా... ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ ముందు తేలిపోయేవారు. ఆయన్ను తట్టుకొని ఢీ కొట్టేంత స్థాయి ఉన్న నటుడు ఒక్క ఏఎన్నార్ మాత్రమే. కాబట్టే... కేవీరెడ్డి ఆయన్ను అర్జునుడిగా ఎంచుకున్నారు. అనుకున్నట్టే ఎన్టీఆర్‌తో నువ్వా-నేనా అనే స్థాయిలో నటించారు అక్కినేని. అర్జునుడి పాత్రకు ఓ నిండుదనం తెచ్చారు. ప్రేమాభిషేకం (1981) దేవదాసు పాత్రకు పూర్తి విరుద్ధమైన పాత్ర రాజేష్ పాత్ర. దేవదాసు పిరికివాడు. రాజేష్ ధైర్యానికి మరో రూపం. దేవదాసుది త్యాగం కాదు. చేతకాని తనం. రాజేష్‌ది నిజమైన త్యాగం. ప్రియురాలి శ్రేయస్సు కోసం తనకు తాను చెడ్డవాడిగా చిత్రీకరించుకున్న త్యాగమూర్తి రాజేష్. ఆ తేడాను ఇందులో అక్కినేని అద్భుతంగా పలికించారు. దేవదాసు ధైర్యవంతుడైతే ఎలా ఉంటుందో ‘ప్రేమాభిషేకం’లోని రాజేష్ పాత్రలో చూపించారు అక్కినేని. పైగా ఈ సినిమా టైమ్‌లో అక్కినేని వయసు 58. కానీ టీనేజర్లు సైతం విస్తుపోయేంత చలాకీగా కనిపిస్తారాయన. ఈ తొమ్మిది సినిమాలు మచ్చుకు మాత్రమే. ఈ మహానటుడు నటించిన సినిమాల గురించి మాట్లాడాలంటే... ఒక గ్రంథమే అవుతుంది. అర్థాంగి, పునర్జన్మ, మూగమనసులు, మనసేమందిరం, ప్రేమనగర్, ధర్మదాత, సుడిగుండాలు, అనుబంధం, సీతారామయ్యగారి మనవరాలు... ఇలా చెప్పుకుంటే ఎన్నో ఎన్నెన్నో.. అయితే నేడు ఆయన పుట్టిన రోజు కాబట్టి చంద్రునికి ఓ నూలుపోగులా ఈ వ్యాసం. - బుర్రా నరసింహ