రాష్ట్రానికి చేరుకున్న బస్సు దోపిడీ బాధితులు
సాక్షి నెట్వర్క్: షిర్డీ వెళ్లివస్తూ మహారాష్ట్రలో దోపిడీకి గురైన బస్సు ప్రయాణికులు ఆదివారం రాష్ట్రానికి చేరుకున్నారు. ఆర్టీసీ విజిలెన్స్ డెరైక్టర్ వెంకట్రాములు ఆధ్వర్యంలోని బృందం ప్రత్యేక బస్సులో ప్రయాణికులను జహీరాబాద్‌కు తీసుకొచ్చారు. హోటల్లో భోజనం పెట్టించాక వారి గమ్యస్థానాలకు పంపించారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశామని జాంఖేడ్ ఠాణా హెడ్‌కానిస్టేబుల్ గాడిల్కర్ తెలిపారు. ఆదివారం ‘సాక్షి’తో ఫోన్లో ప్రత్యేకంగా మాట్లాడిన గాడిల్కర్ కేసు వివరాలు తెలిపారు. ‘‘36 మంది ప్రయాణికులతో హైదరాబాద్-2 డిపోకు చెందిన బస్సు శనివారం సాయంత్రం షిర్డీ నుంచి బయలుదేరింది.
రాత్రి 10.15 గంటల ప్రాంతంలో అహ్మద్‌నగర్ జిల్లాలోని జాంఖేడ్-కర్డీ రోడ్లో ఆనంద్‌వాడీ శివార్లకు చేరుకుంది. రోడ్డుపై కొన్ని ద్విచక్ర వాహనాలు అడ్డంగా ఉండటంతో డ్రైవర్ గోవర్థన్ బస్సును ఆపారు. వెంటనే 8 నుంచి 10 మంది దుండగులు బస్సులోకి చొరబడ్డారు. నాటు తుపాకులు, కత్తులను చూపించి ప్రయాణికులకు బెదిరించారు. వారి వద్ద ఉన్న విలువైన వస్తువులు, సెల్ఫోన్లు, బంగారు ఆభరణాలతో పాటు నగదునూ అపహరించారు. ఈ ఘటనలో రూ.2,65,900 సొత్తు దోపిడీకి గురైంది’’ అని గాడిల్కర్ వివరించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మహ్మద్ మఖ్రుం ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.