మెట్రో ప్రయాణికులకు శుభవార్త!
న్యూఢిల్లీ: మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) చర్యలు చేపట్టింది. ప్రయాణికుల సౌకర్యార్థం రేపటి నుంచి అదనంగా 17 రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 వరకు వీటిని నడపబోతున్నట్లు పేర్కొంది. గ్రీన్ లైన్, ఎయిర్‌పార్టు ఎక్స్‌ప్రెస్ లైన్ మినహా మిగిలిన అన్ని మార్గాల్లో ఈ 17 రైళ్లను అదనంగా తిప్పుతామని చెప్పింది. అదనంగా ఏర్పాటు చేస్తున్న ఈ రైళ్లు రద్దీ సమయాల్లో మొత్తం 104 ట్రిప్పులు వేస్తాయని వెల్లడించింది. ఈ చర్యల వల్ల పీక్ అవర్స్‌లో ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు మరింతగా ప్రోత్సహించినట్లు అవుతుందని డీఎంఆర్సీ ప్రతినిధి చెప్పారు. ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉండే ద్వారాకా-నొయిడా(బ్లూ లైన్),
జహంగీర్‌పురి-గుర్గావ్ (యెల్లో లైన్) మార్గాల్లో కొత్తగా 12 రైళ్లను ఏర్పాటు చేశారు. అదనపు కేటాయింపులతో బ్లూ లైన్ మార్గంలో రైళ్ల సంఖ్య 53కి పెరగగా, యెల్లో లైన్ మార్గంలో 63కి చేరింది. అలాగే ట్రిప్పుల సంఖ్య కూడా వరుసగా బ్లూ లైన్(619), యెల్లో లైన్(734)కి పెరిగింది. రెడ్ లైన్ మార్గంలో మాత్రం ఆఫ్ పీక్ అవర్స్‌లో తిప్పేందుకు ఒకే ఒక రైలును వేయగా, వయొలెట్ లైన్లో పీక్ అవర్స్ కోసం ఒక రైలును కేటాయించారు. ఢిల్లీ మెట్రో ద్వారా రోజుకి 25 లక్షల మంది ప్రయాణిస్తున్నారని అంచనా. ప్రయాణికుల రద్దీ కారణంగా 2010-14 మధ్య కాలంలో కోచ్‌ల సంఖ్యను 640 నుంచి 1,076కి పెంచింది. ఈ విధంగా డీఎంఆర్సీ చేపడుతున్న చర్యలతో మెట్రోలో ప్రయాణం ఇక సులభతరం అయ్యే అవకాశం ఉంది.